ఏపీ నుంచి వెళ్ళిపోతున్నామని అమరరాజా సంస్థ చెప్పలేదు

– అమరరాజా పరిశ్రమలు ఇప్పటికీ ఏపీలో నడుస్తున్నాయి
– మరే రాష్ట్రంలోనూ పరిశ్రమలు విస్తరించకూడదని రూల్ ఎక్కడైనా ఉందా..?
– ఆ రెండు పత్రికల్లో సినిమా ఒకటే.. టైటిల్సే వేరు
– మరి, చంద్రబాబు హెరిటేజ్ ఏపీలోనే స్వేచ్ఛగా నడుస్తుందిగా..?
– రాజకీయంగా వేధిస్తే హెరిటేజ్ ను బాబు ఎలా నడుపుతున్నాడో సమాధానం చెప్పాలి
– పరిశ్రమలు పోతున్నాయనేది వారే… పెట్టొద్దంటూ లేఖలు రాసేదీ వారే
– అమరరాజా పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించింది కాబట్టే నోటీసులు ఇచ్చాం
– పరిశ్రమల వల్ల ప్రజల ప్రాణాలు పోయినా పర్లేదు అనుకునే ప్రభుత్వం మాది కాదు
– మంత్రి గుడివాడ అమర్నాథ్

రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…

ఆ రెండు పత్రికల్లో సినిమా ఒకటే.. టైటిల్సే వేరు
రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అర్జంటుగా గద్దెదించేసి, చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూడాలనే తాపత్రయంతో ఆ రెండు పత్రికలు పనిచేస్తున్నాయి. ప్రజల్ని తప్పుదోవ పట్టించి దుష్ప్రచారంతో చంద్రబాబు నాయుడికి రాజకీయ లబ్ధి చేకూర్చాలని వారు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రెండు పత్రికలకు బ్యానర్ న్యూస్ తయారు చేసేది చంద్రబాబునాయు డైరెక్షన్ లో టీడీపీ ఆఫీసులోనే. ఆ రెండు పత్రికల్లోనూ సినిమా ఒకటే.. కానీ టైటిల్స్ వేరుగా వస్తాయి. ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పించి, పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయంటూ… ప్రభుత్వంపై వ్యతిరేకత తేవాలని పచ్చ మీడియా తాపత్రయపడుతుంది.

సిరాతో రాస్తున్నారా…? సారాతో రాస్తున్నారా..?
ఎల్లో మీడియాలో ఆ రాతలు సిరాతో రాసినవా… లేక.. సారా తాగి రాసిన రాతలా..?. సిరాకు ఉన్న గొప్ప శక్తి ఎటువంటిదో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఎవరినో తీసుకొచ్చి పైన కూర్చోబెట్టడం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతారా…?. “రూ. 1.73 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని.. అందులో అమరావతిలోనే 50 వేల కోట్ల రూపాయలు వెనక్కు వెళ్లాయని” నోటికొచ్చిన లెక్కలతో ఆ పత్రికల్లో అంకెల గారడీ చేశారు. టీడీపీ హయాంలో విశాఖలో పార్టనర్ షిప్ సమ్మిట్స్ జరిగినప్పుడు కూడా ఇదే అంకెల గారడి చేసి.. రూ. 16 లక్షల కోట్లు పెట్టుబడులు, 40 లక్షల మందికి ఉద్యోగాలు అని బాబును తెగ పొగుడుతూ రాతలు రాశారు. ఆ సమ్మిట్లో చంద్రబాబు, రూ. 16 లక్షల కోట్లకు ఎంవోయూలు చేసుకుంటే.. వచ్చిన పెట్టుబడులు కేవలం రూ. 34 వేల కోట్లు మాత్రమే. పచ్చ పత్రికలు ఈ వాస్తవాలను ఎందుకు రాయడం లేదో సమాధానం చెప్పాలి. ప్రజలను మోసం చేయాలని రాసే రాతలు ప్రజలు నమ్మరు.

అమరరాజా పరిశ్రమలు ఇప్పటికీ ఏపీలో నడుస్తున్నాయి
ఆమరరాజా సంస్థ వారు నిన్న తెలంగాణలో 9500 కోట్ల మేర పెట్టుబడులకు ఎంవోయూ చేసుకుంటే.. ఆ కంపెనీని ఇక్కడ నుంచి మా ప్రభుత్వమేదో వెళ్లగొట్టినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. అమరరాజ బ్యాటరీస్ అనే సంస్థ తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక పార్లమెంటు సభ్యునిది. ఈ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైనా ఏపీలో మేం పెట్టుబడులు పెట్టకుండా పక్క రాష్ట్రం వెళ్లిపోతున్నాం అని చెప్పారా..? పోనీ ఇదే మాట ఈనాడు రామోజీకి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు చెప్పారా..?. అమరరాజా అనే సంస్థ ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే వ్యాపారం చేయాలి… ఇతర ఏ రాష్ట్రాల్లోనూ వ్యాపార విస్తరణ చేయకూడదు అనే చట్టం, రూల్స్ ఏమైనా ఉన్నాయా..?. అమరరాజా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. అనేక ఉత్పత్తులు చేస్తున్నారు. కేవలం అమరరాజా బ్యాటరీస్ అనే సంస్థ ఒక తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీది కాబట్టి ఎల్లో మీడియాలో ఇటువంటి ప్రచారం చేస్తున్నారు. అసలు ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైనా మాట్లాడారా? అంటే అదీ లేదు..

మరి, చంద్రబాబు హెరిటేజ్ ఏపీలోనే స్వేచ్ఛగా నడుస్తుందిగా..?
ఒక వేళ మేం రాజకీయ కోణంలో చూసి రాష్ట్రంలో ప్రతిపక్షాలకు సంబంధించిన పరిశ్రమలు ఏవీ ఈ రాష్ట్రంలో వ్యాపారం చేయకూడదు అనుకుంటే.. మరి చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ ఇక్కడ వ్యాపారం చేయలేదు కదా..!. ఒకవేళ మేం వేధిస్తే హెరిటేజ్ సంస్థ ఈ రాష్ట్రంలో ఎలా నడుస్తోందో చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనను రాజకీయ కోణంలో చూడలేదు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే.. రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. యువతకు ఉపాధి లభిస్తుందన్న ఆలోచనే తప్ప మాకు వేరే ఆలోచన లేదు. పరిశ్రమలు నడుపుతున్న వ్యక్తులను ఏ రోజూ మేం ఏ రాజకీయ పార్టీల కోణంలో చూడలేదు. ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు వారి పార్టీ నేతలతో ఇష్టానుసారంగా మాట్లాడిస్తూనే తన పరిశ్రమలను స్వేచ్ఛగా నడుపుకుంటున్నాడు. ఈ వార్తలు రాసిన ఈనాడు వారికి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు లేవా… వారు నడుపుకోవడం లేదా..? మాకు వారు చెప్పినట్లు కక్ష సాధింపు ఉంటే వీరంతా ఎలా వారి వారి పరిశ్రమలు ఈ రాష్ట్రంలో నడుపుకుంటున్నారో చెప్పాలి.

వెళ్తున్నాయి అనేది వారే… వద్దంటూ లేఖలు రాసేది వారే
బల్క్ డ్రగ్ పార్క్ పెట్టడానికి వీళ్లేదంటూ యనమల రామకృష్ణుడు ఒకవైపు లేఖలు రాస్తూ.. మరోవైపు అదే మాట్లాడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం పెట్టిన అన్ని నిబంధనలు పాటించిన తర్వాత మాత్రమే బల్క్ డ్రగ్ పార్క్ కు అనుమతి ఇచ్చాం. ఒక పక్క పరిశ్రమలు వెళ్లిపోతున్నాయి అని వారే అంటారు. మరో వైపు యనమల లాంటి వారు పరిశ్రమలు పెట్టడానికి వీళ్లేందంటారు, పక్క రాష్ట్రంలో పరిశ్రమలు పెడుతుంటే గగ్గోలు పెడుతున్నారు. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టిన వారు ఇక ఏ రాష్ట్రంలోనూ పరిశ్రమలు పెట్టడానికి వీల్లేదా..? ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం ఆ రెండు పత్రికలు మానుకోవాలి. వెంటనే రాష్ట్ర ప్రజలకు ఆ పత్రికలు క్షమాపణలు చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఒక రాజకీయ పార్టీ కోసం ఫణంగా పెట్టొద్దు.

ఇక టిడిపీ రాదనే, వారు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతున్నారేమో..!
ఇక ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు.. అందుకే ఆ పార్టీ నేతలు ఇక్కడ పరిశ్రమలు పెట్టడం లేదని ఎల్లో మీడియాకు చెందిన ఆ రెండు పత్రికలు చెప్పకనే చెపుతున్నట్లు ఉంది. దేశ వ్యాప్త జీడీపీతో పోలిస్తే మన జీఎస్డీపీ రెండు శాతం అదనంగా ఉంది. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కోసం, పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంటే.. తెలుగుదేశం పార్టీ ఇక ఎప్పటికీ అధికారంలోకి రాదనే ఉద్దేశంతో ఆ పార్టీ నేతలు పక్క రాష్ట్రానికి వెళ్లిపోతున్నారేమో. తాను ఐటీ కనిపెట్టకపోతే… ఈ దేశంలోని యువతకు ఐటీ అంటే ఏంటో కూడా తెలిసేది కాదని చంద్రబాబు ఇంకా సిగ్గులేకుండా చెప్తున్నాడు. రాష్ట్రంలోని ప్రతి ఓక్క ఐటీ ఉద్యోగి తెలుగుదేశం పార్టీకి రాయల్టీ కట్టాలని సిగ్గు లేకుండా అడుగుతున్నాడు.

మైకు పట్టుకోలేని బాబుకు అధికారం కావాలట
చివరికి మైకు కూడా పట్టుకోలేకపోతున్న చంద్రబాబు.. ఈ వయసులో తనకు ముఖ్యమంత్రి పదవి కావాలంటున్నాడు. మొన్నటి వరకూ ఇవే చివరి ఎన్నికలు అన్నాడు… అది రివర్స్ కొట్టిందనగానే ప్రజలకు, రాష్ట్రానికి చివరి ఎన్నికలు అంటాడు. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడో కూడా అతనికే అర్థం కావడం లేదు. ఈయన మానసిక పరిస్థితి ఇలా ఉంటే.. పచ్చ పత్రికలు మాత్రం చంద్రబాబును జాకీలు పెట్టి పైకి లేపాలని విఫల ప్రయత్నాలు చేస్తున్నాయి.

ప్రజల ప్రాణాలు పోయినా పర్లేదు అనుకునే ప్రభుత్వం మాది కాదు
అమరరాజ సంస్థకు 2010లో ప్రభుత్వం 483 ఎకరాల భూములను ఇచ్చింది. 2019లో ప్రభుత్వం వారికి నోటీసులు ఇచ్చే సమయానికి వారు 252 ఎకరాల్లో ఏమి చేయలేదు. కేవలం 230 ఎకరాల్లో మాత్రమే వారు కార్యకలాపాలు చేపట్టారు. పర్యావరణకు సంబంధించిన నిబంధనలు పాటించలేదు. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అనే నిబంధనను ఎక్కడా వారు పాటించలేదు. శుద్ధిచేసిన తర్వాత వచ్చే నీటిని, బయటకు కాల్వలోకి విడుదల చేయడం వల్ల పరిసర గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి.. చివరికి ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల బ్లడ్ శాంపిల్స్ లో కూడా లెడ్ శాతం మోతాదుకు మించి ఉంది. ప్రజల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని నోటీసులిచ్చాం… వారు కోర్టుకు వెళ్లారు. అయినా కోర్టు కూడా నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సూచించింది. దానిపై మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడ కేసు నడుస్తోంది. అమరరాజ వల్ల ప్రజల ప్రాణాలు పోయినా పర్లేదు అనుకునే ప్రభుత్వం కాదు ఇది. ప్రజలు ప్రాణాలు ఫణంగా పెట్టాలనే ఆలోచన చంద్రబాబుది.

మార్చి 3,4 తేదీల్లో విశాఖలో ఇన్వెస్ట్ మెంటు సమ్మిట్
మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ నిర్వహించి పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇవేవీ ప్రతిపక్షాలకు, పచ్చ పత్రికలకు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మూడున్నరేళ్ళలోనే ఎన్నెన్ని పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారో వారికి కనిపించడం లేదు. మనకున్న సముద్ర తీరాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా పోర్టుల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. రామాయపట్నం పోర్టు పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. మచిలీపట్నం పోర్టుకు త్వరలోనే శంకుస్థాపన చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. కాకినాడ యాంకరేజ్ పోర్టును రూ.95 కోట్లతో ఆధునికీకరణ చేస్తున్నాం. ఫిషింగ్ హార్బర్ జనవరిలో ప్రారంభోత్సవం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. రూ. 1.40 లక్షల కోట్ల ఎగుమతులు రాష్ట్రం నుంచి వెళ్ళాయి. ఆక్వారంగంలో దేశ ఎగుమతుల్లో 45 శాతం మన రాష్ట్రం నుంచే వెళుతోంది. రొయ్యల ఎగుమతుల్లో దేశం మొత్తం మీద 65 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే ఎగుమతి అవుతోంది. ఇలా అన్ని రంగాలను మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంటే.. వీళ్లు మాత్రం లేనిపోని తప్పుడు రాతలు రాస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..
అమరరాజా బ్యాటరీస్ వారెవరూ ఈ రాష్ట్రంలో ఇబ్బంది ఉంది కాబట్టి మేం వెళుతున్నాం అని చెప్పలేదు. అలా చెప్పి ఉంటే వారి సమస్య ఏమిటో అడగొచ్చు, ఈ రాష్ట్రంలో నిబంధనల వల్ల ఇబ్బంది ఉంది.. పక్క రాష్ట్రం ఆ నిబంధనలను చూసీ చూడనట్లు ఉంటుందని అమరరాజా బ్యాటరీస్ వారు ఎక్కడైనా చెప్పారా..? ఈ రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్న పరిశ్రమలకు లేని సమస్య వీరికి ఎందుకు వస్తుంది..? దయచేసి దీన్ని రాజకీయంగా వినియోగించుకునే ప్రయత్నం చేయవద్దు. అనేక సంవత్సరాలుగా సంస్థ యాజమాన్యం రాష్ట్రంలో పనిచేస్తోంది. ఎక్కడా వారు ఈ రాష్ట్రంలో పెట్టబడులు పెట్టలేము అని చెప్పలేదు. ఈ రాష్ట్రంలో పుట్టిన వారు ఇంకే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకూడదు అనే చట్టం ఏమైనా ఉందా.?. ప్రజలకు ఇబ్బంది లేకుండా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారిని మేం ఆహ్వానిస్తాం. వెళ్లిపోతున్నారు అనొద్దు.. అక్కడ కూడా పెట్టుబడులు పెడుతున్నారు అనడం సమంజసం. అక్కడ కూడా నిబంధనలు సరిగ్గా పాటించకపోతే ఇదే పరిస్థితి రావచ్చేమోనని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు.

Leave a Reply