– ఆమెకు మంత్రి పదవి ఇవ్వవద్దు
– సీఎం జగన్కు ఏపీ రజక సంఘాల ఐక్యవేదిక లేఖ
మంత్రి పదవి దాదాపు ఖరారయిందని ప్రచారం జరుగుతున్న చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీకి షాక్ మీద షాక్ తగులుతోంది. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆమెకు మంత్రి పదవి ఇస్తున్నారన్న ప్రచారంపై జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇప్పటికే నాయకత్వంపై ఆగ్రహంతో ఉండగా.. తాజాగా అసలు ఆమె అసలు రజకురాలే కాదంటూ రజక సంఘాల సమాఖ్య ఏకంగా సీఎం జగన్కు లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. రజక సంఘం లేఖ సారాంశం ఇదీ..
గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి దివ్య సముఖమునకు,
ఆంధ్రప్రదేశ్ రజక సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు పాతపాటి అంజిబాబు,
ఆంధ్రప్రదేశ్ రజక జన సేవా సంఘం అధ్యక్షుడు అక్కినపల్లి లక్ష్మయ్య,
రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పొటికలపూడి జయరాం వ్రాసుకున్న మనవి.
మహాశయా,
విషయము:- గుంటూరు జిల్లా చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి విడదల రజని గారు రజక కులస్తురాలు కాదని, శ్రీమతి విడుదల రజనీ గారికి రజక కోటాలో మంత్రి పదవి ఇవ్వవద్దని తమకు విజ్ఞప్తి చేయుట గురించి
ఆంధ్రప్రదేశ్లో సుమారు 140 బీసీ కులాలు ఉన్నప్పటికీ, బీసీ కులాల్లో అత్యధిక జనాభా కలిగిన మొదటి 10 కులాల్లో ఒకటైన రజక సామాజిక వర్గానికి పదివేల రూపాయల జగనన్న చేయూత ఇస్తూ, రజక సామాజిక వర్గీయుల
పట్ల మీరు చూపిస్తున్న ప్రాధాన్యానికి ముందుగా కృతజ్ఞతలు.
భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన 18 కులాల్లో రజక కులం కూడా ఒకటి.
భారతదేశానికి 1947 లో స్వాతంత్ర్యం రాగా, ఎస్సీ ఎస్టీలకు 1950లో రిజర్వేషన్లు ఇచ్చారు.
1950 నుంచి నేటి వరకు రజకుల ఒకే ఒక డిమాండ్ ఎస్సి రిజర్వేషన్.
1985లోని తెలుగు దేశం ప్రభుత్వం , రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తూ, కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపింది. ఇది ఒక మోసపూరితమైన తీర్మానం. తెలుగుదేశం పార్టీ మోసం గురించి తెలియని రజకులు, ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఓటు వేస్తూ వచ్చారు. తమ తండ్రి గారు, మా అందరి ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి అనుచరులుగా, అభిమానులుగా ఉన్న మేము తెలుగుదేశం పార్టీ మోసాన్ని బట్టబయలు చేసాము.
శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు రజకులను ఎస్టి జాబితాలో చేరుస్తామని లక్షలాది మంది రజకులు పాల్గొన్న రాజమండ్రి బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ఈ హామీ రజక జాతిపై తీవ్ర ప్రభావం చూపింది. మెజారిటీ రజకులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. ఈ క్రమంలో 2004 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రజకుల దురదృష్టం, శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు మరణంతో రజకుల రిజర్వేషన్ హోదా మార్పు ప్రయత్నాలు ఆగిపోయాయి.
2009 తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే ప్రయత్నాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు.
2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లతో త్రిసభ్య కమిటీ వేసింది. ఈ కమిటీ మొక్కుబడిగా 3 జిల్లాలు తిరిగి, తన విధులను అర్ధాంతరంగా వాయిదా వేసుకుంది.
తమరు ప్రజా సంకల్ప యాత్రలో, బిసి డిక్లరేషన్ సభలో రజకులకు ఎమ్మెల్సీ ఇస్తామని, రజక వృత్తి దారులకు ప్రతి సంవత్సరం 10 వేల రూపాయలు ఆర్థిక చేయూత ఇస్తామని హామీ ఇచ్చారు. రజక కులంతో పాటు సామాజిక రిజర్వేషన్ హోదా మార్పు కోరుతున్న కొన్ని కులాల అభ్యర్థనల మేరకు, శాశ్వత కమిషన్ ఏర్పాటు చేసి, ఆ కులాల అభ్యర్థనల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చియున్నారు.
2019 ఎన్నికల్లో తమరి సారథ్యంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నభూతో నభవిష్యత్ అన్నట్టుగా నమోదైన విజయంతో అధికారం చేపట్టింది.
తమరు అధికారంలోకి వచ్చాక రజక కుల వృత్తి దారులకు ఏడాదికి పది వేల రూపాయలు ఇచ్చే జగనన్న చేయూత పథకం అమలయింది. రజకులకు ఎమ్మెల్సీ హామీ, పలుకుల ఎస్సీ రిజర్వేషన్ హోదా మార్పు అంశాలకు సంబంధించిన హామీలు ఇంకా అమలు కావాల్సి ఉంది.
ఈ దశలో… ఆంధ్ర ప్రదేశ్ రెండవ మంత్రి వర్గం ఏర్పాటులో తమరు వెనుకబడిన కులాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిసింది. వెనుకబడిన కులాలకు చెందిన శాసన సభ్యులకు మంత్రి పదవులు ఇచ్చే క్రమంలో, గుంటూరు జిల్లా చిలకలూరిపేట శ్రీమతి విడుదల రజని గారికి “రజక” సామాజిక వర్గం కోటా కింద మంత్రి పదవి ఇస్తున్నారని తెలిసింది.
శ్రీమతి విడుదల రజని గారు రజక కులస్తురాలు కాదు. శ్రీమతి విడదల రజని గారికి రజక కోటా కింద మంత్రి పదవి ఇవ్వద్దని తమకు తెలుపుకుంటున్నాము. శ్రీమతి విడుదల రజని గారికి రజక కోటా కింద మంత్రి పదవి ఇచ్చినట్లయితే, రజకుల మనోభావాలు దెబ్బతింటాయి. రజక కులం కాని వ్యక్తికి, రజక కులం కోటా కింద మంత్రి పదవి ఇవ్వటం సరికాదు.
తమరు శ్రీమతి విడుదల రజనీ గారి నిజమైన కులం ఏమిటో నిర్ధారించుకుని, వారి యొక్క నిజమైన కులం కోటా కింద మంత్రి పదవి ఇచ్చిన ఎడల, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
రజక కులస్తురాలు కాని, శ్రీమతి విడుదల రజిని గారికి రజక కోటాలో మంత్రి పదవి ఇవ్వడాన్ని మేమందరము వ్యతిరేకిస్తున్నాము. మా అభ్యర్థన పరిశీలించకుండా, శ్రీమతి విడుదల రజిని గారి నిజమైన కులం నిర్ధారించుకోకుండా, శ్రీమతి విడదల రజనీ గారికి రజక కోటా కిందనే మంత్రి పదవి ఇచ్చినట్లయితే, రజకుల మనోభావాలు దెబ్బతింటాయి. ఇది మన పార్టీకి మంచిది కాదు. సానుకూల పొలిటికల్ మైలేజీ రాకపోగా, నెగిటివ్ ప్రాపగాండా బలపడి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉన్నది. మా విజ్ఞాపన పరిశీలించి సముచితమైన నిర్ణయాన్ని తీసుకోవడంతోపాటు, రజకులకు వివిధ సందర్భాలలో ఇచ్చిన హామీలను అమలు పరిచే నిమిత్తం తమరు ఉన్నతస్థాయి సమీక్ష జరపాలని కోరుకుంటున్నాము.
ఇట్లు
తమ విశ్వాసపాత్రులు,
(పాతపాటి అంజిబాబు)
రాష్ట్ర అధ్యక్షులు,
ఆంధ్రప్రదేశ్ రజక సంఘాల ఐక్యవేదిక. 9701884444
(అక్కినపల్లి లక్ష్మయ్య)
రాష్ట్ర అధ్యక్షులు,
ఆంధ్రప్రదేశ్ రజక జన సేవా సంఘం.
76748 43937
(పొటికలపూడి జయరాం)
రాష్ట్ర అధ్యక్షులు,
రజక రిజర్వేషన్ పోరాట సమితి.
9515184699