• రాష్ట్ర ప్రజలు భారత దేశ పౌరుల్లా జీవించేందుకు అవసరమైన హక్కులకోసం పోరాడే దుర్గతి కల్పించాడు ఈ ముఖ్యమంత్రి
• మీ బిడ్డను.. మీ అన్నను.. మీ తమ్ముడిని.. రాష్ట్రానికి నా అవసరం ఉందని జగన్ చెప్పుకుంటున్నాడు… ప్రజలు చెప్పడంలేదు
• తాను పేదల పక్కన ఉన్నానని జగన్ చెప్పుకుంటున్నాడు.. వాస్తవానికి ఆయన పక్కన ఉంది వేలకోట్లతో లిక్కర్…ఇసుక వ్యాపారం చేసేవారు.. వేలకోట్ల విలువైన కాంట్రాక్టులు కొట్టేసే కాంట్రాక్టర్లు… అదానీలు.. పరిమల్ నత్వానీలు
• ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు జగన్ పక్కన ఉన్నారనేనా… అధికారంలోకి వచ్చీరాగానే టీడీపీప్రభుత్వం వారి సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన కార్పొరేషన్లు..పథకాలు అన్నీ రద్దుచేశాడు
మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
“ విజయవాడలో జరిగిన వైసీపీ జనరల్ బాడీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ… వై ఏపీ నీడ్స్ జగన్ (ఆంధ్రరాష్ట్రానికి జగన్ ఎందుకు కావాలి) అనే దా నిపై చాలా చెప్పుకొచ్చారు. పేదలు ఒక పక్క.. పెత్తందారులు ఒకపక్క ఉన్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లోని పేదలకు తానే ప్రతినిధినని ఆయన చెప్పు కున్నారు.
వేలకోట్లతో లిక్కర్, ఇసుక వ్యాపారం చేస్తూ, వేలకోట్ల కాంట్రాక్టులు పొందే తన కుడి, ఎడమ ఉండే కాంట్రాక్టర్లు, అదానీలు, మెగా సంస్థలు, పరిమల్ నత్వానీ లాంటి వారంతా జగన్ రెడ్డి పక్క. అందులో ఎలాంటి సందేహం లేదు. 80శాతం మంది ప్రజలకు బటన్ నొక్కాను అంటున్న జగన్ రెడ్డి ఆ పనిచేశాడో లేదో తెలియదు గానీ.. రాష్ట్రంలోని 100శాతం కుటుంబాలపై భారీ స్థాయిలో భారాలు వేశాడు.
విద్యుత్ ఛార్జీలు పెంచాడు.. నిత్యావసరాల ధరలు పెంచాడు.. కర్ణాటక కంటే రూ.12 లు డీజిల్ ధర, 10రూపాయల పెట్రోల్ ధర పెంచాడు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్, అరాచక ఆంధ్రప్రదేశ్ గా మార్చాడు కాబట్టి.. మరలా ఈ రాష్ట్రానికి తానే ముఖ్యమంత్రి కావాలంటున్నాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ తనపక్కనున్నారనేనా.. అధికారంలోకి వచ్చీరాగానే ఆయా వర్గాలకోసం టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లన్నింటినీ ఎత్తేశాడు.
టీడీపీ ప్రభుత్వం రూ.200లు ఉన్న పింఛన్ ను రూ.2 వేలు చేసింది. జగన్ రెడ్డి మాదిరిగా ఐదేళ్లు పూర్తయ్యే ముందు రూ.3వేలు చేయలా! అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3వేలు పింఛన్ ఇస్తానన్న వ్యక్తి.. ఇప్పుడు 2024 జనవరిలో పింఛన్ రూ.3వేలు చేస్తానంటున్నాడు. ఇలా చేసినందుకు మరలా తానే రాష్ట్రానికి కావాలనుకుంటున్నాడు.
తన అవినీతి, అక్రమాలు, దోపిడీని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదుల్ని పోలీసుల సాయంతో కర్కశంగా అణచివేస్తున్నాడు కాబట్టి… మరలా జగనే రాష్ట్రానికి కావాలి. ప్రతిపక్షనేత రూ.6లక్షలకోట్ల అవినీతి చేశాడని ఎన్నికలకు ముందు చెప్పి.. ఇప్పుడు రూ.27కోట్లకు దిగి, అక్రమకేసులతో ఆయన్ని జైలుకు పంపాడు కాబట్టి.. మరలా జగనే ఈ రాష్ట్రానికి కావాలి. రాష్ట్రంలోని ప్రతి రైతు తలసరి అప్పు దేశంలోని రైతులందరికంటే ఎక్కువ ఉండేలా చేసినందుకు మరలా జగనే రాష్ట్రానికి కావాలి.
రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిపినందుకు.. రూ.10 లక్షల90వేలకోట్ల అప్పు చేసినందుకు… మరలా రాష్ట్రానికి జగన్ కావాలి. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పటినుంచీ ఎన్నడైనా ఇంత అరాచకం..అక్రమాలు..అవినీతి జరిగా యా? సంక్షేమం అనేది రాష్ట్రంలో ఎప్పటినుంచో అమలవుతోంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందించిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలి చాయి. ఆయన తర్వాత ఎందరో ముఖ్యమంత్రులు అమలుచేసిన పథకాలు అన్నీ ఆపేసి, మొత్తం తానే చేశానని జగన్ లాగా ఎవరూ చేయలేదు.. చెప్పుకోలేదు.
రాజశే ఖర్ రెడ్డి పథకాలను చంద్రబాబు ఆపలేదు. చంద్రబాబు అమలుచేసిన అనేక గొప్ప పథకాల్ని జగన్ ఆపేశాడు. వ్యవసాయరంగంలో కేంద్రప్రభుత్వం అమలుచేసే అనేక పథకాల్ని నిర్దాక్షణ్యంగా ఆపేశాడు. టీడీపీ ప్రభుత్వం ఇరిగేషన్ రంగానికి రూ.63వేల కోట్లు ఖర్చుచేస్తే, జగన్ రూ.20వేలకోట్లు కూడా ఖర్చుచేయలేదు. మొత్తంగా వ్యవసాయ, సాగునీటి రంగాల్నే ముంచేశాడు. అలాంటి వ్యక్తి .. మీ బిడ్డను.. మీ అన్న ను.. మీ తమ్ముడిని.. నా అవసరం రాష్ట్రానికి ఉంది అని తనకు తానే చెప్పుకుంటున్నాడు.
రాష్ట్రంలో దురదృష్టకరమైన పరిపాలన నడుస్తోంది. అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని అరాచకాంధ్రప్రదేశ్ గా మార్చాడు. కల్తీ మద్యం తాగిస్తూ రాష్ట్రంలో మరణ మృదంగం మోగిస్తున్నాడు. ఈ విషయం మేం చెప్పడం కాదు.. దేశాన్ని పరిపాలించే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలే చెబుతోంది. రాష్ట్రంలో జరిగే మద్యం అమ్మకాలపై సీబీఐ విచారణ కోరుతోంది. మేం కూడా అదే డిమాండ్ చేస్తున్నాం.
ఈడీ.. సీబీఐ ఏపీవైపు కన్నేయాలని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇతర రాష్ట్ర పౌరుల్లా (భారతదేశ పౌరుల్లా) జీవించే హక్కుల కోసం పోరాడాల్సిన దుర్గతి పట్టింది. ఇది నిజంగా దురదృష్ట కరం కాదా?” అని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.