– దాడులతో ప్రజలకు ఏం చెప్పదల్చుకున్నారు?
– మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
– మల్కాజిగిరిలో కాంగ్రెస్ నేతల దాడిలో గాయపడ్డ బీసీ నేతలను పరామర్శించిన శాసనమండలి లో ప్రతిపక్ష నాయకులు మధుసూదనాచారి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర
హైదరాబాద్: ప్రజాస్వామ్యం అంటే దాడులు చేయడమేనా అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతిలో దాడికి గురైన మల్కాజిగిరి కి చెందిన బీసీ నాయకులను శనివారం మల్కాజిగిరి లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ముందుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో శాసనమండలి లో ప్రతిపక్ష నాయకులు మధుసూదనాచారి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తదితర బిసి నాయకులు బాధితులు చిన్నా యాదవ్, జగదీష్ గౌడ్, రాధాకృష్ణ యాదవ్, వెంకయ్య, రాములు యాదవ్ ల నివాసాలకు వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా ? అని ప్రశ్నించారు. ప్రజలు భయబ్రాంతులకు గురవుతూ పండుగలు జరుపుకోవాలా అని నిలదీశారు. అల్వాల్ లో జరిగిన బోనాల చెక్కుల పంపిణీ అధికారిక కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకపోవడం సరైన పద్ధతి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు జరిపిన దాడులతో ప్రజలకు ఏం చెప్పదల్చుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. తమ వారిపై దాడి చేసి తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు.
అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. మల్కాజిగిరి బస్టాండ్ వద్ద నడిరోడ్డుపై ఏం జరిగిందో రాష్ట్రం మొత్తం చూసిందని పేర్కొన్నారు. 40, 50 వాహనాలలో వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే పట్టించుకోలేదన్నారు. పోలీసు వ్యవస్థ, రాష్ట్ర డిజిపి ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. రాము యాదవ్ ను చంపేందుకు కుట్ర చేశారని, వందలాది మంది కాంగ్రెస్ నాయకులు పోలీసు స్టేషన్ కు వస్తే అడ్డుకున్న వారు లేరా అన్నారు. రౌడీయిజం, గూండాయిజం ఈ రాష్ట్రానికి అవసరమా అన్నారు. రాష్ట్రంలో బీసీ లపై ఎక్కడా దాడులు జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
రాజకీయాలలో గెలుపు, ఓటములు సహజమని అన్నారు. ఎంతో ప్రశాంతంగా ఉన్న మల్కాజిగిరి లో ఇలాంటి ఘటనలు దురదృష్టకరం అన్నారు. ఇక ముందు ఇలాంటి ఘటనలను సహించబోమని హెచ్చరించారు. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. బోనాల పండుగకు ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమం ప్రారంభించింది కేసీఆర్ ప్రభుత్వం అని గుర్తు చేశారు. దుర్బాషలాడటం, దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో సరైన విధానం కాదన్నారు.
ముఖ్యమంత్రి వేదికలపై మాట్లాడుతున్న భాష సరిగా లేదని, అదే భాష ను మీ పార్టీ నాయకులు వాడుతున్నారని ధ్వజమెత్తారు. అధికారం శాశ్వతం అని, మేము ఇలాగే ఉంటామంటే వ్యవస్థలు ఎందుకు అని ప్రశ్నించారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయా, కొత్త సాంప్రదాయాలకు కాంగ్రెస్ పార్టీ తెరతీసిందని అన్నారు. తాము అధికారంలో ఉండగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుల ఇండ్లపై ఏ రోజైనా దాడి చేసిన సందర్భాలు ఉన్నాయా అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు మితిమీరిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. తమ విధానాలను మార్చుకోకుంటే దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఉందనే విషయాన్ని ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలని చెప్పారు. ప్రభుత్వం, పోలీసులు ఇప్పటికైనా దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.