వైసీపీ పాలనలో పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి పీతల సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను చర్చించాల్సిన అసెంబ్లీలో సమస్యలను గాలికొదిలేసి మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవుల కోసం ముఖ్యమంత్రి జగన్‌పై పొగడ్తలు, ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేస్తూ వైసీపీ మహిళా ప్రజా ప్రతినిధులు సభా సమయాన్ని వృధా చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
మహిళా ప్రజా ప్రతినిధులకు సాటి మహిళల కష్టాలు కనపడటం లేదా అని పీతల సుజాత ప్రశ్నించారు. మహిళా సాధికారత అంటే స్వాతంత్ర్య దినోత్సవం నాడే పట్ట పగలు బీటెక్ విద్యార్థినిని హత్యచేయడమేనా? అని ఆమె ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్న మహిళా ఎమ్మెల్యేలు మహిళలపై హత్యలు, హత్యాచారాలు, దాడులు జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదన్నారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే వైసీపీ ప్రభుత్వం ఈ రెండున్నర సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలపై కూడా మాట్లాడాలని మాజీ మంత్రి పీతల సుజాత సూచించారు.