Suryaa.co.in

Political News

పురందేశ్వరికి ఆ సత్తా ఉందా?

పురందేశ్వరి. దగ్గుబాటి పురందేశ్వరి. కుటుంబ సభ్యులు “చిన్నమ్మ ” అని ప్రేమగా పిలుచుకునే…. తెలుగువారి యుగపురుషుడి గా చరిత్ర పుటలకెక్కిన నందమూరి తారక రామారావు కుమార్తె గా ప్రజా జీవితం లోకి ప్రవేశించిన పురందేశ్వరి…..ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష బాధ్యత ల్లోకి అడుగు పెట్టారు.

ఒక్క అసెంబ్లీ సీటు గానీ, ఒక లోకసభ సీటు గానీ……; స్వయంగా గెలుచుకునే స్థితి లేని పార్టీ కి రాష్ట్ర నాయకత్వం వహించడం పెద్ద విషయం ఏమీ కాదు అలాంటి పార్టీలు ఏ రాష్ట్రం లో అయినా ఓ నాలుగైదు ఉంటూనే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో సమతా పార్టీ అని ఒక పార్టీ ఉంది. ఇప్పుడు జై భీమ్ పార్టీ అని ఉంది. సీ పీ ఐ, సీ. పీ. ఐ (ఎం) పార్టీలు కూడా ఒక్క సీటూ స్వయంగా గెలవలేని స్థితికి చాలా కాలం క్రితమే చేరుకున్నాయి.

అయితే, ఆ పార్టీలకు, బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖకు చాలా తేడా ఉంది. బీజేపీ దేశాన్ని ఏలుతోంది. దాని తరఫున ప్రధాని పదవిలో ఉన్న నరేంద్ర మోడీ… భారత దేశపు ” మైండ్ సెట్ ” నే సరికొత్తగా ట్యూన్ చేస్తున్నారు. దేశం లోనే అత్యంత ధనిక పార్టీ బీజేపీ. జమ్ము, కశ్మీర్, హర్యానా, గుజరాత్ , మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలలో అధికారం లో ఉన్న పార్టీ బీజేపీ.

దేశ నడకను కొత్త మార్గం పట్టించాలని అభిలషించే “భారతీయ “జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖకు దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షురాలు. ఆ పదవి లో ఆమె బీజేపీ కి చిరస్మరణీయమైన వెలుగులను తీసుకు వస్తారా? లేకపోతే…. సోము వీర్రాజు లాగా నాలుగు రోజులు ఆ పదవి లో కాలక్షేపం చేసి…ఓ ఫైన్ మార్నింగ్.. చడీ చప్పుడు లేకుండా ఆ పదవి నుంచి దిగి వెళ్ళిపోతారా?

ఆమెకు ఈ రెండు అవకాశాలూ ఉన్నాయి. ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఉనికి కోసం బీజేపీ పెనుగులాడుతోంది. ఆ మాటకొస్తే దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాజకీయాలలో బీజేపీ ది నామ మాత్రపు పాత్రే. మత పరమైన రాజకీయ కార్యకలాపాలకు దక్షిణాదిన పెద్దగా అవకాశాలు లేవు. అందుకే, బీజేపీ దక్షిణాది లో అడుగు ముందుకు వేయలేక పోతున్నది.

కర్ణాటక రాజకీయాలలో కూడా బీజేపీకి ఉన్నది బలం కాదు. వాపు. ఇప్పుడు ఆ వాపూ చాలా వరకు దిగిపోయింది. అక్కడ కులాల వారీగా మఠాధిపతులు ఉండడం, బీజేపీ… వారిలో కొందరిని ప్రసన్నం చేసుకోవడంతో… కర్ణాటకలో ” ఉన్నది ” అని అని పిస్తున్నది. ఇక, మిగిలిన రాష్ట్రల్లో రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో మఠాలు లేవు.

చాలా కాలం గా తెలంగాణలో భీకర కసరత్తు చేస్తున్నప్పటికీ ; 119 స్థానాలు కలిగిన తెలంగాణ అసెంబ్లీ కి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో… బీజేపీ కి 10సీట్లు మించి వస్తాయని చెప్పడానికి ఏ సర్వే సంస్థ కూడా సాహసించడం లేదు. కాకపోతే, ఢిల్లీ నుంచి అర్ధబలం…. పార్టీ లో స్థానికంగా అంగ బలానికి ఏమీ ఇబ్బంది లేదు గనుక, బిల్డ్ అప్ కు లోటు లేదు.

తెలంగాణ లో బీజేపీ పరిస్థితి అలా ఉంటే ; ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అసలు సొంతం గా పోటీ చేసి, అసెంబ్లీ కి గానీ… లోక్ సభ కు గానీ కనీసం ఒక్క సీటు గెలిచే పరిస్థితి లేదు. అందుకే, బీజేపీ అనేది ఉత్తరాది పార్టీ అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. బీజేపీ ని ప్రధాని నరేంద్రమోడీ తన కనుసన్నల్లోకి తీసేసుకున్న తరువాత ;ఉత్తరాదితో పాటు, దక్షిణాది లో కూడా తన ‘ ప్రభావం ‘ చూపించాలని విశ్వప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ లో బీజేపీ పరంగా జరుగుతున్న కసరత్తు అందులో భాగమే.

ఎన్ని రకాలుగా తంటాలు పడినా…. పది కి మించి అసెంబ్లీ స్థానాలకు అవకాశం లేదంటున్నారు. ఇటు తెలంగాణతో పాటు, అటు ఆంధ్రప్రదేశ్ లో పాగా వేయడానికి ఏమి చేయాలా అని బీజేపీ లో పెద్ద తలకాయలన్నీ, ఢిల్లీ స్థాయిలో మల్లగుల్లాలు పడుతున్నట్టు ఒక సమాచారం వస్తున్నది. హైదరాబాద్ జంట నగరాలను కేంద్ర పాలిత ప్రాంతం గా ప్రకటించడం తో పాటు ; ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి ప్రాంతాన్ని దేశ రెండో రాజధాని గా ప్రకటించడం అనేది బీజేపీ వ్యూహం లో ఒక భాగమని అంటున్నారు.

నిజానికి, రాజ్యాంగ రూపకల్పన దశలోనే, హైదరాబాద్ నగరం… రాజ్యాంగ నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. ఇంత పెద్ద దేశానికి ఢిల్లీ ఒక్కటే రాజధాని గా ఉండడం వల్ల ; దక్షిణాది ప్రజలకు దేశ రాజధాని “అందని ద్రాక్ష పుల్లన” అన్నట్టుగా తయారైందనే అసంతృప్తి దక్షిణాది లో బలం గా ఉన్నదనే విశ్లేషణలకు కొదువ లేదు.

ఈ సువిశాల, 140 కోట్ల మేర జనాభా విస్తరించి ఉన్న దేశ రాజధాని… కేవలం ఉత్తరాది కె పరిమితం అయివున్న ఫలితంగా దక్షిణాది వారిలో అసంతృప్తి రేగితే ; దేశ ఐక్యత కు మంచిది కాదని డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ రూపాకల్పన దశ లోనే అభిప్రాయ పడ్డారు. కనుక, దక్షిణాది కి ముఖ ద్వారం లాటి హైదరాబాద్ ను దేశానికి రెండవ రాజధానిగా ప్రకటించాలని ఆయన సూచించారు. ఆ సూచన కార్యక్రమం రూపం లోకి రాలేదు.

రాజ్యాంగం అమలు లోకి వచ్చిన చాలా కాలానికి, తెలుగు ప్రాంతాలు అన్నిటినీ కలిపి, 1956 లో హైదరాబాద్ రాజధానిగా ఒక తెలుగు రాష్ట్రం ఏర్పాటు చేశారు. అంబేద్కర్ సూచన అమలులోకి వచ్చి ఉన్నట్టయితే ; తెలుగువారి రాజకీయ, సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక చరిత్ర, జీవన శైలి ; ఆ మాటకొస్తే దక్షిణాది వారి జీవన శైలి ఊహకి సైతం అందనంత సమున్నతి రీతి లో ఉండి ఉండేది. ఈ ” బురద గుంట ” రాజకీయాలకు ఆస్కారమే ఉండేది కాదు. ” బతకని బిడ్డ బారెడు… ” అన్న సామెత చందం గా ఇప్పుడు “చింతించి… చింతించి…. వగచిన…” ఫలితం లేదు కదా!

ఇప్పుడు ఆ ఆలోచన ను బీజేపీ బయటకు తీస్తున్నట్టు వినికిడి. అంటే – హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధి మరి కాస్త విస్తరించి, దానిని కేంద్రపాలిత ప్రాంతం గా ప్రకటించడం తో పాటు ; ఒక రాజధాని కి నోచుకొనే ఆంధ్రప్రదేశ్ లో అమరావతి ని దేశానికి రెండో రాజధానిగా ప్రకటించడం అనే ఆలోచనల పై ఢిల్లీ లో కొందరు బీజేపీ నాయకులు ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు.

ఈ రెండూ ఏక కాలం లో ప్రకటిస్తే ; తెలుగు రాష్ట్రాల రూపు రేఖలతో పాటు ; బీజేపీ ప్రొఫైల్ కూడా దక్షిణాదిన సంపూర్ణం గా మారిపోతుంది. ఈ రెండు రాష్ట్రాలు బీజేపీ కి కంచుకోటలుగా మారి పోవడం తో పాటు నాలుగు దక్షిణాది రాష్ట్రాల లోనూ బీజేపీ…. ఒక బలమైన రాజకీయ శక్తి గా రూపు దిద్దుకుంటుంది. రెండు రాష్ట్రాల ఆర్ధిక, రాజకీయ, సామాజిక స్వరూపం మారిపోవడంతో పాటు ; దక్షిణాది రాష్ట్రాల జన హృదయాలకు బీజేపీ దగ్గరవుతుంది.

ఈ జంట ప్రతిపాదనలపై బీజేపీ ప్రధాన కార్యదర్శి, సంస్థగత వ్యవహారాల నిపుణుడు బీ. ఎల్. సంతోష్ ఇప్పటికే కొందరు ముఖ్య నాయకులతో సమగ్రంగా చర్చించినట్టు బీజేపీ వర్గాల నుంచి ఓ సమాచారం వినబడుతున్నది.

అయితే, తెలంగాణ లో పోలింగ్ కు ఇప్పుడు ఓ వారం రోజులు కూడా వ్యవధి లేదు. అందువల్ల, ఈ లోగా హైదరాబాద్ పై కేంద్ర ప్రకటన వచ్చే అవకాశం లేకపోవచ్చు. ఈ సమయం లో అటువంటి ప్రకటన వంటిది ఏది వెలువడినా ; తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి,2018 లో లాగా ఎన్నికల లబ్ది పొందవచ్చునని కూడా బీజేపీ నాయకుడొకరు అన్నారు.

2018 లో కాంగ్రెస్ గెలిచే వాతావరణం కనిపించింది. ప్రచారం చివరి ఘట్టం చేరుకున్న దశలో చంద్రబాబు నాయుడు రంగా ప్రవేశం చేసి, కాంగ్రెస్ తో కలిసి ప్రచారం చేయడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి క్యాష్ చేసుకున్నారు. “ఆంధ్ర బూచి ” ని చూపించి, తెలంగాణ వాదాన్ని రెచ్చ గొట్టారు.

అటు అమరావతిని రెండో దేశ రాజధాని గాను, ఇటు హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం గానూ ఒకేసారి ప్రకటిస్తే మాత్రం…. రెండు రాష్ట్రాల్లో బీజేపీ స్థాయి అమాంతం పెరిగి పోతుంది అనడం లో సందేహం లేదు. సరిగ్గా ఇక్కడే, దగ్గుబాటి పురందేశ్వరికి ” చారిత్రాత్మక ” పాత్ర ఉన్నది.

ఢిల్లీ కేంద్ర నాయకులతో తనకు గల రాజకీయ పరిచయాలన్నింటినీ ఏకోన్ముఖం చేసి ; అమరావతి ప్రాంతాన్ని దేశ రెండో రాజధాని గా ప్రకటింప చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలి. ఇందుకు ప్రాతిపదిక లేక పోలేదు. నరేంద్ర మోడీ అయితే,2014 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ వాసులకు దాదాపు ఇటువంటి ఆశలనే కల్పించారు కూడా.

“నేను ప్రధాన మంత్రి అయితే, ఢిల్లీ తో పోల్చతగిన రాజధానిని ఆంధ్రాలో నిర్మింప చేస్తాను అని ఈ తిరుపతి వెంకన్న సాక్షిగా చెబుతున్నాను” అని మోడీ తిరుపతి బహిరంగ సభలో ప్రకటించారు.

ఒక వేళ, అమరావతి ని దేశ రెండో రాజధానిగా ప్రకటించాలని ఆయన భావించే పక్షం లో…., సుమారు 32 వేల ఎకరాల ఖాళీ భూమి సిద్ధం గా ఉంది. దానికి దగ్గర్లో మరో ఇరవై వేల ఎకరాల అటవీ భూమి, నాగార్జున యూనివర్సిటీ కి ఎదురుగా మరో ఆరువేల ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉన్నదని అంటున్నారు. హైదరాబాద్ విషయానికి వస్తే ; ఈ రోజు కాకపోతే రేపైనా కేంద్రపాలిత ప్రాంతం గా ప్రకటిస్తారని జనం లో ఒక అభిప్రాయం గట్టి ప్రచారం లో ఉంది. అమరావతి విషయం పై బీజేపీ లోనే ఒక స్థాయి లో చర్చ జరిగిందనే సమాచారం బీజేపీ వర్గాల నుంచి ఉన్నప్పటికీ ; అది ఇంకా జనం లోకి వచ్చినట్టు లేదు. చిన్నమ్మ చరిత్ర సృష్టిస్తుందా?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ కి ఎన్ టీ రామారావు కుమార్తె, డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు సతీమణి, కేంద్ర మాజీ మంత్రి అయిన పురందేశ్వరి ని అనూహ్యం గా నియమించారు. నిజానికి ఆమెకు పార్టీ కేంద్ర స్థాయిలో పదవి ఏదైనా ఇవ్వడమో, ఏదైనా ఓ రాష్ట్రానికి గవర్నర్ గా పంపడమో చేస్తారని చాలా మంది ఊహించారు. ఆ స్థాయి హుందాతనం, గంభీరత, బాడీ లాంగ్వేజ్ కి ఈ ” బురద గుంట ” రాజకీయాలు పెద్దగా సూటవ్వవు. నిజానికి , ఈ తరహా పదవికి సోము వీర్రాజు లాటి నేతలే బెస్టు. రాష్ట్ర బీజేపీ లో ఉన్నారు కూడా.

అయితే, అనూహ్యం గా రాష్ట్ర పార్టీ పగ్గాలు ఆమె చేతికి అప్పగించారు. ఆమె, చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి- భువనేశ్వరి కి సోదరి. తెలుగు దేశం కు – పురందేశ్వరి ప్రాతినిధ్యం వహించే బీజేపీ కి- రాజకీయం గా సరిపడడం లేదు. ఈ ఈక్వేషన్ తెలిసి కూడా పురందేశ్వరిని రంగం లోకి దింపారు.

సోము వీర్రాజు స్థానం లో పురందేశ్వరి వచ్చినా ; మామూలుగా అయితే బీజేపీ తల రాత మారే అవకాశమే లేదు , ఏదో అద్భుతం జరిగితే తప్ప. ఆ అద్భుతమే – దేశ రెండో రాజధానిగా అమరావతి ఏర్పాటు. రాష్ట్ర ప్రభుత్వం పై రోజువారీ విమర్శలు, కేంద్రానికి ఫిర్యాదులు, క్షేత్ర స్థాయి పర్యటన ల వల్ల, బీజేపీ కి ఒక ఓటు కొత్తగా రాదు…..; ఒక ఓటు పోదు అనే విషయాన్ని పురందేశ్వరి గమనించాలి. సోము వీర్రాజు హయాం లో బీజేపీ ఓటు బ్యాంకు ఎంత ఉందో… పురందేశ్వరి హయాం లోనూ అంతే ఉంటుంది.

అందుకే, దేశ రెండవ రాజధాని గా అమరావతి అనే అంశాన్ని ఆమె ఢిల్లీ పెద్దల దృష్టికి బలం గా తీసుకు వెళ్ళాలి. ఆమె శక్తీ యుక్తులన్నీ ఆ అంశం పై కేంద్రకరించాలి. తద్వారా బీజేపీ కి దక్షిణాదిన ప్రాణ ప్రతిష్ట చేయాలి. అటువంటి కృషి చేసిన నేత గా ఆమె దేశ చరిత్రలో నిలిచిపోతారు. బీజేపీ ని తెలుగు రాష్ట్రాల్లో హిమాలయాల ఎత్తుకు తీసుకెళ్లిన నేతగా ఆమె రాజకీయం చరితార్ధం అవుతుంది. తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సవాలక్ష సమస్యలకు అర్ధవంతమైన శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

భోగాది వేంకట రాయుడు bhogadirayudu2152@gmail.com

LEAVE A RESPONSE