– పరిశ్రమలకు కేటాయించిన భూములు ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటం బాధాకరం
– ప్రతి సెజ్ లోనూ పరిశ్రమలు ఏర్పాటు చేసి రైతుల త్యాగానికి సార్థకత చేకూర్చాలని కోరుతున్నాం
– నైపుణ్యం కలిగిన విద్యావంతులెందరో మన ప్రాంతంలోనే ఉన్నారు..వారందరికీ ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పించాలి
– అసెంబ్లీలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
అమరావతి: ముత్తుకూరు మండలం కృష్ణపట్నం వద్ద పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం 2008లో 2600 ఎకరాల భూమిని రిలయన్స్ సంస్థకు అప్పగించారు. 2008 నుంచి ఆ భూములు ఖాళీగానే ఉన్నాయి. ఎకరాకు రూ.30 వేలు లెక్కన వేసుకున్నా ఏడాదికి రూ.9 కోట్లు ఆదాయం పోయింది. ఇండస్ట్రీయల్ పాలసీ ప్రకారం భూములు కేటాయించిన తర్వాత రెండేళ్లలో పరిశ్రమ కార్యకలాపాలు ప్రారంభం కావాలి.
రెండేళ్లు కాకపోయినా నాలుగేళ్లకైనా ప్రారంభించవచ్చు. అలా కాకుండా ఏళ్ల తరబడి భూములను బీడుగా పెట్టి రైతులు, రైతు కూలీలను పనులు లేకుండా పస్తులు పెట్టడం దురదృష్టకరం. అప్పట్లో ఎకరాకు రూ.3 లక్షల పరిహారం ఇస్తామంటే మేం ఒప్పుకోలేదు..నేను ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నా రైతులకు అండగా నిలిచి ఎకరాకు రూ.7 లక్షల నుంచి రూ.7.70 లక్షలు ఇప్పించాం.
అప్పట్లో రూ.7 లక్షలకు శంషాబాద్ ప్రాంతంలో వస్తుందని ఆయా కంపెనీల ప్రతినిధులు అభ్యంతరం తెలిపినా మేం రాజీపడలేదు.పోరాటం సాగించి ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించాం. 2029 నాటికి రూ.20 వేల కోట్లతో రెండు యూనిట్లు పెడతామని ఇప్పుడు రిలయన్స్ సంస్థ ముందుకొచ్చిదంటున్నారు. ఒక్కో యూనిట్ లో 800 నుంచి 1000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయంటున్నారు.
ఆ ఉద్యోగాలను కూడా స్థానికులకే ఇవ్వాలని కోరుతున్నాను. నైపుణ్యం కలిగిన వారు మన ప్రాంతంలోనే ఎందరో ఉన్నారు. 2600 ఎకరాల భూమి అంతా తమకు అవసరమని రిలయన్స్ సంస్థ చెబుతోంది. ఆ కంపెనీ పెట్టే పరిశ్రమలకు అంత భూమి అవసరం ఉందా..అనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. మిగిలిన భూములను ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసి ఇతర పరిశ్రమలకు అప్పగించాలి.
రిలయన్స్ సంస్థకు కేటాయించిన భూములే కాదు..జిల్లాలో ఇంకా వేలాది ఎకరాల భూములు ఖాళీగా ఉన్నాయి. పీవీ నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పెన్నార్ డెల్టాలోని 2700 ఎకరాలతో రాచర్లపాడు వద్ద కిసాన్ సెజ్ ఏర్పాటు చేశారు. కృష్ణపట్నం సెజ్ లో 7 వేల ఎకరాలు, మేనకూరు సెజ్ లోనూ ఇంకా భూములు ఖాళీగా ఉన్నాయి.
కూటమి ప్రభుత్వం వచ్చాక 10 ఎకరాల నుంచి 1000 ఎకరాల వరకు ఎంత భూమి ఉన్నా సేకరించి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం శుభపరిణామం. ఇప్పటికే ఖాళీగా ఉన్న వేలాది ఎకరాల భూములను ఉపయోగంలోకి తీసుకొచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.