-చిలకలూరిపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు
రాష్ట్ర వ్యాప్తంగా కరువు కరాళ నృత్యం చేస్తున్నా..రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కనీసం పట్టించుకోని జగన్ లాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా అని మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. గురువారం చిలకలూరిపేట 6, 7 డివిజన్లకు చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పుల్లారావు సమక్షంలో టీడీపీలో చేరారు. 6వ వార్డు నుంచి కొణిదెన దుర్గాప్రసాద్, ముత్తుకూరి ఈశ్వర్, పాలెపు వెంకటేషయ్య, నాదెండ్ల శివకృష్ణ, క్రాంతి, 7వ వార్డు నుంచి వైసీపీ నాయకుడు గోగుల నాగరాజు తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ కరువు బాధితుల్ని పరామర్శించడానికి ముఖం చాటేసిన ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధమంటూ ఊరూరా ప్రచారానికి బయల్దేరడానికి సిగ్గుండాలని తూర్పారబట్టారు. జగన్ తన అసమర్ధ, చేతగాని తనంతో నీటి వనరుల నిర్వహణలో అలసత్వం వహించడంతో కరవు కష్టాలు రెట్టింపు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తి నేతృత్వంలో పనిచేయలేకే నిరంతరా యంగా వైసీపీ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయన్నారు. చంద్రబాబు ఇంకా ఆచితూచి వ్యవహరిస్తున్నారని, ఆయన పూర్తిగా గేట్లు తెరిస్తే వైసీపీలో ఒక్కరు కూడా మిగలరన్నారు. నియోజకవర్గంలో తనకు ప్రత్యర్థిగా ఎవరిని పెట్టాలో తేల్చుకోవడానికి వైసీపీకి ఇప్పటివరకు సమయం పట్టిందని, ఇక గెలుపు గురించి ఆలోచించే అవకాశం వారికి లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తానని తెలిపారు.