Suryaa.co.in

Andhra Pradesh

పన్నులు పెంచడమే గానీ, ప్రజలకు సౌకర్యాలు కల్పించరా?

-నీటి ఎద్దడి, కాలుష్యంతో దెబ్బతింటున్న ప్రజారోగ్యం
-పదేళ్ల టీడీపీ, వైసీపీ పాలనలో పదవులు వెలగబెట్టిన వారు ఏం చేశారు
-సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్‌ బాబురావు

విజయవాడ సెంట్రల్‌లో సీపీఎంను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్‌ బాబురావు కోరారు. గురువారం 59వ డివిజన్‌ అజిత్‌ సింగ్‌ నగర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంచినీటి ఎద్దడి, నీటి కాలుష్యం, పార్కుల్లో దెబ్బతిన్న క్రీడా పరికరాలు, చెత్తపన్ను, ఇతర భారాలు, తదితర అంశాలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ మంత్రి పదవులు వెలగబెట్టిన వైసీపీ, టీడీపీ నేతలు విజయవాడ నగరానికి ఏమి చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆ రెండు పార్టీలు చేసింది తక్కువ.. భారాలు మోపింది ఎక్కువ అని విమర్శించారు.

గత రెండు నెలల నుంచి నగరంలో నీటి ఎద్దడితో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నా, నీటి కాలుష్యంతో ప్రజారోగ్యం దెబ్బతింటున్నా పట్టించుకునే నాధుడే లేడన్నారు. కృష్ణానది నీటిమట్టం తగ్గటంతో రాబోయే కాలంలో మరింత నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ముంచుకొస్తుందన్నారు. వేసవిలో నీటి సమస్య పరిష్కారానికి ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంలో నగరపాలక సంస్థ విఫలమైందన్నారు. ప్రజా ప్రతినిధులు మొద్దు నిద్రలో ఉన్నారని విమర్శించారు. మోడీ,జగన్‌ ప్రభుత్వాలు 24 గంటల నీటి పథకం పేరుతో నీటి మీటర్లు బిగించటానికి అత్యుత్సాహం చూపిస్తున్నారు తప్ఫ నీటి సమస్యను పరిష్కరించడంపై దృష్టి సారించడం లేదన్నారు.

మరోవైపు నగరంలో ఎండలు ముదురుతున్నాయని, మురుగు కాలువల నిర్వహణ అధ్వానంగా మారిందని, దోమలు విపరీతంగా పెరిగిపోయాయని తెలిపారు. మురుగు కాలువల నిర్మాణానికి రూ.460 కోట్లు నిధులు కేటాయించినా డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడలేదన్నారు. దోమలను అరికట్టలేని నేతలు నగరాభివృద్ధి గురించి ప్రగల్భాలు పలకటం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు బి.రమణారావు, కె.దుర్గారావు, బి.రూబెన్‌, ఎస్‌కే రసూల్‌, ఎస్‌కే రషీద్‌, బెంజిమెన్‌, ఎ.పున్నారావు, పీఎస్‌ఎన్‌ మూర్తి, ఎస్‌కే నిజాముద్దీన్‌, వెంకటేశ్వరరావు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE