వ్యవస్థల ప్రతిష్ట పలచనై, వాటిపట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లితే సమాజంపై దుష్ఫలితాలు ఉంటాయి. అవినీతి – అక్రమాలు, నేరాలు – హత్యారాజకీయాలు, విధ్వంసకర మరియు అప్రజాస్వామిక విధానాలపై ఆంధ్రప్రదేశ్ సమాజం తీవ్రకలత చెందుతున్నది.
వాలంటీర్లు మరియు సచివాలయ ఉద్యోగులు దినపత్రిక కొనుక్కోవడానికి నెలకు రు.200 చొప్పున మంజూరు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును సవాల్ చేస్తూ ఉషోదయ పబ్లికేషన్ సంస్థ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై విచారణను సుప్రీం కోర్టు, ఢిల్లీ హైకోర్టుకు బదలాయించడం ఒకింత ఆశ్చర్యం కలిగించింది. అత్యున్నత న్యాయస్థానానికి సంపూర్ణ నిర్ణయాధికారం ఉన్నది. దాన్ని ఎవరు ప్రశ్నించలేరు. కాకపోతే, ఆ పరిస్థితికి దారితీసిన పరిణామంపై ఒక్కో బుర్ర ఒక్కో విధంగా ఆలోచించడానికి అవకాశం కల్పించబడింది.
వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను, ఆయన కుమార్తె డా.సునీతగారి విజ్ఞప్తి మేరకు సుప్రీం కోర్టు తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నమ్మకంలేదన్నారు. సుప్రీం కోర్టు వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయడంతో పోలీసు వ్యవస్థ ఎవరు అధికారంలో ఉంటే వారి కనుసన్నల్లోనే పని చేస్తుందన్న ఆరోపణలకు బలం చేకూరినట్లయ్యింది కదా!
ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి సుప్రీం కోర్టు, హైకోర్టులలో విచారణలో ఉన్న కేసులను పరిశీలిస్తే పెద్ద “లిటిగెంట్” రాష్ట్ర ప్రభుత్వమేనని పిస్తోంది. ఎందుకీ పరిస్థితి నెలకొన్నదో ఆలోచించాలి. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, చట్ట వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలే కారణమని చెప్పక తప్పదు.
న్యాయస్థానాల్లో విచారణ ప్రక్రియలోను, తీర్పులు వెలువరించడంలోను జరుగుతున్న జాప్యం పర్యవసానంగా న్యాయానికి న్యాయం జరుగుతుందా! అన్న భావన కలగడం సహజమే. జీ.ఓ. నెం.1 పై దాఖలైన ప్రజాప్రయోజనాల కేసు విచారణ, రిజర్వులో ఉంచబడిన తీర్పు ఒక ఉదాహరణగా పేర్కొనబడుతున్నది. బహుశా ఈ తరహా ఘటనలను పరిగణలోకి తీసుకొని కాబోలు సుప్రీం కోర్టు తాజాగా పైన ప్రస్తావించిన ఆదేశాలు జారీచేసి ఉండవచ్చన్న భావన కలగడంలో తప్పులేదేమో!
నా స్వానుభవంతో ఒక కేసును ఉదహరిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఒక తప్పుడు జీ.ఓ.ను జారీ చేసి, ఒక అధ్యాపకురాలికి అర్హతలేని పోస్టింగ్ ఇచ్చింది. అది తప్పని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరిదిద్దుకోలేదు. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాక, విధిలేక జీ.ఓ.ను ప్రభుత్వం ఉపసంహరించుకొని కోర్టుకు తెలియజేసింది. అంతటితో గుణపాఠం నేర్చుకోకుండా సీనియారిటీ లిస్టులో మార్పులు చేసి సర్క్యులర్ విడుదల చేసింది. అది కూడా తప్పని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. మళ్ళీ, హైకోర్టులో మరొక రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.
విచారణ మొదలుకాగానే ఆ సర్యులర్ ను ఉపసంహరించుకుని హైకోర్టుకు విన్నవించింది. అర్హులైన వారితో 2022 ఫిబ్రవరిలో జారీ చేసిన సీనియారిటీ జాబితా ప్రకారం పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి చేసినా అధికారులు చేవికెక్కించుకోలేదు. దాంతో హైకోర్టులో మూడో రిట్ పిటిషన్ దాఖలు చేస్తే కొన్ని నెలలపాటు విచారించిన మీదట సానుకూలమైన తీర్పు ఇచ్చింది. దాన్ని ప్రభుత్వం అమలు చేయకుండా జాప్యం చేసింది. ప్రత్యర్థి రిట్ అప్పీల్ దాఖలు చేశారు. మొత్తం మీద ఈ సమస్యపై ఎడాదికిపైగా విచారణ కొనసాగుతూనే ఉన్నది.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2013 ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిబంధనలు రూపొందించి, ప్రభుత్వ ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు కేటాయించింది. ఆ నిబంధనలను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం సమస్యను సృష్టించింది. ఆ సమస్య పరిష్కారానికి మూడు రిట్ పిటీషన్స్ దాఖలు చేయాల్సి వచ్చింది. తీర్పు పిటిషనర్ కు అనుకూలంగా వచ్చింది. కానీ, రిట్ అప్పీల్ దాఖలయ్యింది. ఏడాదిగా విచారణ జరుగుతూనే ఉన్నది. న్యాయమూర్తుల నియామకం, బదిలీలు, పదవి విరమణ, పర్యవసానంగా “రోస్టర్”లో మార్పులు, చేర్పులు. ఫలితంగా దాదాపు పది మంది న్యాయమూర్తుల బెంచిల వద్దకు ఈ చిన్నసమస్యపై దాఖలైన కేసులు విచారణకు వచ్చాయి.
ఇంకా పెండింగ్ లోనే ఉన్నది. ఎప్పటికి ముగింపు పలుకుతారో! న్యాయానికి, న్యాయం జరుగుతుందో! లేదో! అగమ్యగోచరంగా తయారయ్యింది. హైకోర్టులో విచారణ ప్రక్రియలో ఇంత జాప్యం జరుగుతుంటే న్యాయ వ్యవస్థపైన ప్రజలకు విశ్వాసం బలపడుతుందా! బలహీనపడుతుందా!

సామాజిక ఉద్యమకారుడు