– స్పందించేందుకు అధికారం లేదా?
– నిఘా వ్యవస్థ నిద్ర పోతోందా?
– కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలను పరామర్శించిన బిసి వై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్
– క్షతగాత్రులకు, మ్రుతుల కుటుంబాలకు తక్షణ సాయం అందజేసిన రామచంద్ర యాదవ్
అమరావతి: రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నారా లోకేష్ భ్రష్టు పట్టిస్తున్నారని బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించారు. మృతులకు నివాళులు అర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు బిసివై పార్టీ తరపున తక్షణ సాయం అందజేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన..
ఈ మధ్య కాలంలో హిందూ పండుగలు అంటే ఏదో ఒక చోట ఏదో ఒక విధంగా ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం అన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో, ఆ తర్వాత సింహాచలంలో ఇప్పుడు కాశీబుగ్గలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం… సంఘటన జరిగిన ప్రతిసారి కుంటి సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకుంటున్న చర్యలు శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగినప్పుడు హడావుడి చేసి తరువాత అశ్రద్ద చేయడం అలవాటుగా మారిపోయిందన్నారు. కాశీబుగ్గ తొక్కసలాట ఘటనపై ప్రభుత్వం నిస్సిగ్గుగా ప్రకటనలు చేస్తోందన్నారు.
అది ప్రైవేటు ఆలయం అంటూ తప్పించకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. నిజంగా ప్రైవేటు ఘటనలతో తమకు సంబంధం లేదని చెబుతున్న ప్రభుత్వం… అదే ప్రైవేటు సంస్థలు, ప్రైవేటు ఫ్యాక్టరీల్లో ఘటనలు జరిగితే తప్పించుకునే ప్రయత్నం చేస్తోందా? అంటూ ప్రశ్నించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని రామచంద్రయాదవ్ మండిపడ్డారు.
రాష్ట్రంలో నిఘా వ్యవస్ధ నిద్ర పోతోందని రామచంద్రయాదవ్ విమర్శించారు. తాను రైతులు, మత్స్యకారులను కలుస్తానని చెబితే తాను ఎక్కడున్నానో తెలుసుకొని, ఢిల్లీకి వచ్చి మరీ ప్లైట్ లో వచ్చి నోటీసులు ఇచ్చిన పోలీసులు…. కాశీబుగ్గలో పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న ఆలయంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోవడం దారుణమన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే 24 గంటల్లో వచ్చి రోడ్డు మీద పడుకున్న పవన్ కళ్యాణ్ ఇలాంటి ఘటనలపై ఎందుకు స్పందించడంలేదో సమాధానం చెప్పాలని రామచంద్రయాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఘటనలు పవన్ కళ్యాణ్ కు కనపడంలేదా?
లేక స్పందించేందుకు అధికారం లేక… ప్రభుత్వంలో ఉత్సవ విగ్రహంగా మారిపోయారా? అనేది ప్రజలకు స్పష్టతనివ్వాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన ప్రశ్నించారు.