Suryaa.co.in

Features

చేసే క్రియలు నిస్వార్థమైనవి అయితే…

పురాణాలలో అక్షయపాత్ర గురించి వినేవుంటారు. వశిష్టుడి దగ్గర వున్న ఈ పాత్రను విశ్వామిత్రుడు కోరడం, వశిష్ఠుడు తిరస్కరించడం జరుగుతుంది.

తర్వాత ధర్మరాజుకు కృష్ణుడు బహుాకరిస్తాడు.అయితే ఆ పాత్రనుండి ఆహారపదార్ధాలు తీసుకొనేటప్పుడు పాత్రపై వున్న గుడ్డను పూర్తిగా తొ ల గించవద్దంటాడు.ఆ పాత్ర ద్వారా ఎంతోమందికి భోజనం వడ్డిస్తాడు ధర్మరాజు.

అలాగే “బైబిల్ “లో కూడా మూడురొట్టెలు,ఏడు చేపలు కథవుంది. ఒక వేడుక సందర్భంగా జీసెస్ అన్నదానం చేస్తుండగా , వాళ్ళ అమ్మగారు వచ్చి చేపలు,రొట్టెలు అయిపోతున్నాయని,ఇంకా చాలామంది అన్నార్తులు వున్నారని చెప్పగా ,ఆయన అమ్మా..దిగులుపడకు ఆ గంపలపై ఒక వస్త్రం కప్పి, అయిపోతుందేమొా అనే ఆలోచనలేకుండా అందులో నుండి రొట్టెలు,చేపలు తీసి వడ్డించమంటాడు..ఆశ్చర్యంగా అందరికీ పోనూ ఇంకా మూడు గంప నిండా ఆహారపదార్ధాలు మిగిలిపోతాయి.

అలాగే 20వ శతాబ్ధంలో లంబసింగిలో “పాకలపాటి గురువు”అనే ఆయన అన్ని కాలాలూ అన్నదానం నిరంతరం చేస్తునే వుండేవారట. కరువు కాలంలో సహితం ఆయన అన్నదానం చేయడం చూసి ఆంగ్లేయ ప్రభుత్వానికి అనుమానం వచ్చి ఒక కలెక్టర్ ని,పోలీస్ ఆఫీసర్ ను నిఘా పెట్టింది. వాళ్ళూ ఆ రహస్యం కనుక్కోలేకపోయారట. బయటనుండి ఎటువంటి సరుకులు వెళ్ళేవి కావట. వంటశాలలో చూస్తే ఆ రోజుకు కావలసిన సరుకులే వుండేవట.

“ఇవన్నీ అతిశయోక్తులు కావచ్చు. అక్కడ కృష్ణుడు,జీసెస్ చెప్పినది గమనిస్తే ” పెడితే అయిపోతుందేమో అనే తలంపు రాకుండా, అన్నం పెట్టమని చెబుతున్నట్లనిపిస్తుంది. మన ఆలోచన నిష్పక్షపాతమైతే ఏదోకరూపంలో మనకు సహాయం అందుతుందనేది దీని సారాంశం అయివుండవచ్చు.

అలాగే మన ఆంధ్రప్రదేశ్ 19శతాబ్ధం మధ్యకాలం నుండి 20 వ శతాబ్ధం మొదటిభాగం వరకు అన్నార్తుల పాలిట అన్నపూర్ణగా కీర్తింపబడ్డ “డొక్కా సీతమ్మగారు” కూడా ఎన్నో వేలమందికి అన్నదానం చేశారు. ఏ కాలంలోనైనా, ఏ సమయంలోనైనా ఆకలి అంటూ వచ్చిన అన్నార్థులకు భోజనం చేసిపెట్టేవారామె. భర్త స్థితివంతుడైనా ప్రతిరోజూ వందలమందికి భోజనం పెడుతూవుంటే ఆస్థులన్నీ కరిగిపోయాయట.

ఒకరోజు భర్త ఏమే ఆస్థులన్నీ కరిగిపోయాయి..ఇంక మనకు కూడా అన్నం దొరికే పరిస్థితిలేదు అంటే…” అయ్యా..నేను అన్నం పెడుతున్నది విష్ణుమూర్తికి..అన్నం తినేవారందరిలోనూ ఆయననే చూస్తున్నాను,ఆయనే అన్ని చూసుకుంటాడని వినయంగా జవాబిచ్చిందట. ఆమె చేసేది నిస్వార్థసేవ కాబట్టి ఆమె బతికినన్నిరోజులూ అన్నదానం నిరాటంకంగా చేసిందట. ఆమె సేవలను ఒకసారి గుర్తుచేసుకుందాం.
చేసే క్రియలు నిస్వార్థమైనవి అయితే…వాటికి కావల్సిన సహాయం ఏదోక రూపేణా అందుతుందని వీరు రుజువు చేశారు.

– మాటేటి రవి

LEAVE A RESPONSE