ట్రంప్, పైరసీ, థియేటర్ల మాఫియా.. జగన్, కరోనా.. వరుసగా ఇలా ఏదో ఒక పిడుగు గ్లామర్ ఇండస్ట్రీని గజగజలాడిస్తోంది. ఇండస్ట్రీలో హీరోలు, నిర్మాతలు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ఆలోచించి పరిశ్రమకు ప్రాణం పోయాలి. ఇది సంస్కృతిని నిలిపే ప్రధాన మాధ్యమం కాబట్టి. బాధ్యత, త్యాగం, ఆలోచనలు చాలా అవసరం.
అమెరికాలో తెలుగు సినిమా దశాబ్ద కాలంగా పండిస్తున్న డాలర్ల పంటపై డోనాల్డ్ ట్రంప్ కొత్తగా విధించిన 100 శాతం సుంకం పిడుగుపాటు లాంటిది. తెలుగు సినిమాకు అతిపెద్ద విదేశీ మార్కెట్ అయిన అమెరికాలో ఈ నిర్ణయం తక్షణమే పెను ప్రభావం చూపనుంది. ఈ విధానం టాలీవుడ్ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో ఓసారి చూద్దాం.
డాలర్లే ఆక్సిజన్…
గత పదేళ్లుగా తెలుగు సినిమాలకు అమెరికా మార్కెట్ స్వర్గధామంలా మారింది. ఏటా $160-170 మిలియన్ల (దాదాపు ₹1,300-1,400 కోట్లు) ఆదాయం మన సినిమాకు అక్కడ లభిస్తోంది. ఇది మన సినిమా ఓవర్సీస్ ఆదాయంలో 85 శాతం, మొత్తం వసూళ్లలో 5-10 శాతం కావడం విశేషం. ‘బాహుబలి 2’ ($20.8 మిలియన్లు), ‘కల్కి 2898 AD’ ($18.6 మిలియన్లు), ‘RRR’ ($15.3 మిలియన్లు) వంటి సినిమాలు అమెరికాలో రికార్డులు సృష్టించాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే… తెలుగు సినిమా ఇండస్ట్రీకి డాలర్లు ఆక్సిజన్‌లా మారిపోయాయి.
మనవాళ్ల వలసలే పెట్టుబడి!
అమెరికాలో తెలుగు సినిమా ఇంతలా విజయం సాధించడానికి ప్రధాన కారణం అక్కడ పెరుగుతున్న తెలుగు జనాభే. 3.2 లక్షలు ఉన్న తెలుగు జనాభా 2024 నాటికి ఏకంగా 12.3 లక్షలకు పెరిగింది. ఈ పెరుగుదలతో తెలుగు అక్కడ అత్యధికంగా మాట్లాడే భాషగా నిలిచింది. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీ వంటి రాష్ట్రాలు మన సినిమాలకు ప్రధాన కేంద్రాలు. ఐటీ నిపుణులు, విద్యార్థులతో నిండిన ఈ జనాభా సినిమా టికెట్లపై పెట్టే ఖర్చు మన నిర్మాతలకు భారీగా లాభాలు తెచ్చిపెడుతుంది.
ట్రంప్ తంటా: 100% సుంకం అంటే ఏంటి?
డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 29, 2025న ట్రూత్ సోషల్ ద్వారా విదేశీ చిత్రాలపై 100 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. దీనివల్ల $25-40 ఉన్న టికెట్ ధరలు ఏకంగా $50-80కి పెరిగిపోతాయి. ఈ భారీ పెరుగుదలతో ప్రేక్షకులు థియేటర్‌కు రావడం తగ్గించవచ్చు. ఫలితంగా తెలుగు చిత్ర పరిశ్రమ 30-40 శాతం ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉంది. నిర్మాత లగడపాటి శ్రీధర్ వంటి వారు ఈ నిర్ణయం టాలీవుడ్ వ్యాపార నమూనానే నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పంపిణీకి సంకెళ్లు…
ఈ సుంకం కేవలం థియేటర్లకే పరిమితం కాదు. ఇది స్ట్రీమింగ్ హక్కులు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై కూడా ప్రభావం చూపవచ్చు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి సంస్థలు మన సినిమాలపై పెట్టుబడులు పెట్టడం తగ్గిస్తే భారీ నష్టం తప్పదు. అలాగే, చిన్న సినిమాలకు అమెరికాలో పంపిణీ దొరకడం కష్టమవుతుంది. కేవలం భారీ బడ్జెట్ సినిమాలకే అక్కడ అంతో ఇంతో థియేటర్లు దొరికే అవకాశం ఉంటుంది.
టాలీవుడ్‌కు సవాళ్లు – పరిష్కారాలు
ఈ సంక్షోభం నుండి బయటపడాలంటే టాలీవుడ్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
చట్టపరమైన పోరాటం: చలన చిత్రాలు వస్తువులు కావు, సేవలు. కాబట్టి వీటిపై సుంకాలు విధించడం చట్టపరంగా సాధ్యం కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ అంశంపై కోర్టులో పోరాటం చేయవచ్చు.
కొత్త మార్కెట్ల అన్వేషణ: అమెరికాకు ప్రత్యామ్నాయంగా యూకే, కెనడా, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్య దేశాలలో మార్కెట్‌ను విస్తరించుకోవాలి. అయితే, ఏ మార్కెట్ కూడా అమెరికా స్థాయి లాభాలను ఇవ్వలేదు.
ఓటీటీ ఫస్ట్: చిన్న సినిమాలకు థియేటర్ విడుదలలకు బదులుగా నేరుగా ఓటీటీలో విడుదల చేయడం మంచి వ్యూహంగా మారవచ్చు.
ట్రంప్ సుంకం ప్రకటన టాలీవుడ్లో ఇప్పటికే అనిశ్చితిని సృష్టించింది. ఈ విధానం అమలు అయితే మన పరిశ్రమ విదేశీ కలలపై అది ఒక గొడ్డలిపెట్టుగా మారే ప్రమాదం ఉంది. మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో వేచి చూడాలి.
ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ కు ధీటుగా మనదైన వినోదం అందించే ఒక బలమైన ప్లాట్‌ఫామ్ అవసరం. క్రియేటివిటీకీ, టెక్నాలజీకి, కథకు ప్రాధాన్యత ఇస్తూ.. హీరోల రెమ్యూనరేషన్, వారం, రెండువారాల వ్యాపార ధోరణి నుండి బయటకు రావాలి.