– స్కిల్ స్కాంలో పార్టీ విరాళాల రచ్చ
– పార్టీల విరాళాల తుట్టె కదిపిన ఏఏజీ సుధాకర్‌రెడ్డి
– స్కిల్ స్కాంలో టీడీపీకి 27 కోట్లు వచ్చాయని వాదన
– టీడీపీ ఆడిటర్‌ను విచారించాలని స్పష్టీకరణ
– అవి పార్టీకి వచ్చిన విరాళాలని టీడీపీ ఎదురుదాడి
– మరి జగన్ పార్టీకి వచ్చిన విరాళాల సంగతేమిటి?
– వైసీపీ విరాళాలు బయటపెట్టిన టీడీపీ
– టీడీపీకి వచ్చినవి విరాళాలైతే, వైసీపీకి వచ్చినవి ప్రసాదాలా?
– ఆ లెక్కన అవన్నీ క్విడ్ ప్రోకో కాదా?
– దీనిపై సోషల్‌మీడియాలో టీడీపీ సెటైర్ల వర్షం
– తెరపై అన్ని పార్టీల విరాళాల లెక్కలు తీయాలన్న మేధావుల చ ర్చ
– ఆ ప్రకారమైతే బీజేపీపై ఎన్నికేసులు పెట్టాలంటూ సోషల్‌మీడియాలో ప్రశ్నలవర్షం
– స్కిల్ కేసు అవినీతి డబ్బు టీడీపీ ఖాతాలోనే వేశారా?
– వైసీపీని ఇరికించిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి
– పొన్నవోలు వాదనలతో ఇరకాటంలో బీజేపీ
– బయటపడుతున్న బీజేపీ విరాళాలు
– పొన్నవోలు వాదన పుణ్యాన పార్టీల విరాళాల గుట్టు రట్టు
– తలపట్టుకుంటున్న వైసీపీ సీనియర్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు స్కాం పుణ్యాన దేశంలో ఏ పార్టీకి ఎన్ని విరాళాలు వస్తున్నాయన్న రహస్యం బట్టబయలవుతోంది. స్కిల్ కేసు అవినీతిలో పాల్పడిన డబ్బు, టీడీపీ ఖాతాల్లోకి వెళ్లాయంటూ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చేసిన ఆరోపణ బూమెరాంగవుతోంది. కాబట్టి పార్టీ ఆడిటర్‌ను విచారించాలన్న పొన్నవోలు వాదన ఆసక్తికరంగా మారింది. అయితే అది అటు ఇటు తిరిగి వైసీపీ మెడకే చుట్టుకునే ప్రమాదం కనిపించడంతో, వైసీపీ సీనియర్లు తలపట్టుకోవలసి పరిస్థితి. ప్రధానంగా తాము ఈ వ్యవహారంలో బీజేపీని కూడా రచ్చ చేస్తున్నామన్న విషయం, తమ నాయకత్వానికి తెలియకపోవడమే ఆశ్చర్యంగా ఉందంటున్నారు.
స్కిల్ కేసులో జరిగిన అవినీతికి సంబంధించి వచ్చిన 27 కోట్ల లంచం, టీడీపీ ఖాతాలో వేశారంటూ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చేసిన వాదన లాంటి ఆరోపణ, రాజకీయవర్గాల్లో పెను దుమారం సృష్టిస్తోంది. అయితే వెంటనే మెరుపువేగంతో ఎదురుచేసిన టీడీపీ లేవెత్తిన లా పాయింట్లు, వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఆ మేరకు టీడీపీ తనకు విరాళాల రూపంలో వచ్చిన నిధులకు సంబంధించిన బ్యాంకు వివరాలను బయటపెట్టింది. అంతేనా? వైసీపీకి వచ్చిన విరాళాల లెక్కల గుట్టు రట్టు చే సింది. వైసీపీ ఖాతాలకు ఏపీలో కాంట్రాక్టు పనులు చేస్తున్న ఏ కంపెనీలు విరాళాలు జమచేశాయన్న వివరాలు వెల్లడించింది.
మరి మాకు వచ్చినవి విరాళాలయితే, మీకు వచ్చినవి ప్రసాదాలా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. పార్టీకి వచ్చిన విరాళాలను కూడా స్కిల్ స్కాంకు లింకు చేయడం మతిలేని చర్య అని మండిపడింది. తాము విరాళాల లెక్కలను ఎప్పటికప్పుడు ఆడిట్ చేయించి, ఎన్నికల సంఘానికి పంపిస్తామని స్పష్టం చేసింది. స్కిల్ అవినీతిపై ఆధారాలు లేకపోవడంతో, గుడ్డ కాల్చి పార్టీపై వేస్తున్నారని ఎదురుదాడి ప్రారంభించారు. దీనిని న్యాయమూర్తులు గమనించి, కోర్టు ధిక్కరణ కింద పొన్నవోలుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
దానితోపాటు.. వైసీపీకి వచ్చిన విరాళాల వివరాలను టీడీపీ బయటపెట్టడంతో, వైసీపీ ఇరుకునపడింది. అధికారంలో ఉన్న ఈ నాలుగేళ్లలో వైసీపీకి 600 కోట్ల రూపాయలకు పైగా విరాళాలు వచ్చాయన్న వివరాలు బహిర్గతం చేసింది. ఏపీలో కాంట్రాక్టులు చేసిన కంపెనీల నుంచి, వాటిని వసూలు చేశారా అని నిలదీసింది. పైగా ఏపీలో పలు కాంట్రాక్టులు చేస్తున్న మేఘా కంపెనీ, హెటిరో, ఎంపి ఎంవివి కంపెనీల నుంచి ఎన్నెన్ని విరాళాలు వచ్చాయన్న గుట్టు విప్పింది.
పోలవరం కాంట్రాక్టు ద క్కించుకున్న మేఘా నుంచి 22 కోట్లు, కడప స్టీల్ దక్కించుకున్న జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీ నుంచి 13 కోట్లు, విశాఖ జిల్లా నక్కపల్లిలో వివాదార్పద భూములను వైసీపీ సర్కారు నుంచి క్లియర్ చేసుకున్న హెటిరో డ్రగ్స్- హెటిరో ల్యాబ్స్ కంపెనీ నుంచి 10 కోట్లు ఫ్రుడెంట్ ఎలక్ట్రోరల్ ట్రస్టుకు అందిన వివరాలు వెల్లడించింది.
ఇక ఆశ్చర్యంగా జగన్‌కు చెందిన సండూర్, సరస్వతి పవర్, క్లాసిక్ రియాలిటీ కంపెనీల నుంచి కూడా వైసీపీ ఖాతాల్లోకి ఎలా వెళ్లాయన్న ప్రశ్నలతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు, ఆ పార్టీ నేతల మౌనం స్పష్టం చేస్తోంది. మరి ఇవన్నీ వైసీపీ ఖాతాకే వెళ్లిందా అన్న ప్రశ్నలకు వైసీపీ నుంచి ఇప్పటిదాకా జవాబు లేకపోవడం బట్టి.. విరాళాల వ్యవహారాల్లో అధికార పార్టీ ఏ స్థాయిలో ఆత్మరక్షణలో పడిందో స్పష్టమవుతోంది.
దీనిపై వైసీపీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. స్కిల్ స్కాంలో అవినీతి జరిగి, ఆ డబ్బు ఏయే ఖాతాలకు వెళ్లిందన్న వివరాలు బయటపెడితే.. టీడీపీ ఇరుకునపడేదని స్పష్టం చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే అది ఆ పార్టీకి గొంతు లేకుండా పోయేదని విశ్లేషించారు. అయితే అందుకు భిన్నంగా టీడీపీకి అధికారికంగా వచ్చిన విరాళాలు బయటపెడితే, ఉపయోగం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ లాజిక్ వల్ల తమకు లాభం లేకపోగా, నష్టమేనని తలపట్టుకుంటున్నారు.
నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉంటూ, కొన్నేళ్లపాటు అధికారం అనుభవించి, జాతీయ స్థాయిలో కీలకపాత్ర పోషించిన టీడీపీ.. విరాళాల వంటి కీలక అంశాలలో, నిర్లక్ష్యంగా ఉంటుందనుకోవడం తెలివితక్కువని వైసీపీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఈ వాదనపై పార్టీలో ఏ స్థాయిలోనూ చర్చ జరిగిన దాఖలాలు లేవంటున్నారు. కనీసం సీనియర్ అడ్వకేట్ల సలహాలు కూడా తీసుకున్నట్లు కనిపించలేదని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇప్పుడు తమ పార్టీకి సంబంధించిన విరాళాలు బయటపెట్టిన టీడీపీపై.. ఏమని ఎదురుదాడి చేస్తామని, వైసీపీ నేతలు తలపట్టుకుంటున్నారు. ఒకరకంగా పొన్నవోలు వాదన.. తమను మాత్రమే కాకుండా, దేశంలో ఉన్న అని రాజకీయపార్టీలు అందుకుంటున్న విరాళాల వ్యవహారాన్ని రచ్చ చేయడానికి ఉపయోగపడుతోందని వాపోతున్నారు. ప్రధానంగా తమకు తెలియకుండానే బీజేపీని ఈ విరాళాల రొంపిలోకి లాగామని వాపోతున్నారు.
నిజానికి పార్టీల విరాళాలు రహస్యం ఏమీ కాదని, అది పబ్లిక్‌డాక్యుమెంటేనని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. స్కిల్ కేసులో టీడీపీ మళ్లించిన అసలైన ఖాతాలను వెల్లడిస్తే ఆ పార్టీ కచ్చితంగా ఇరుక్కునేదేనంటున్నారు. అలాకాకుండా, విరాళాల లెక్కలు చూపించడంతో.. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయామని వ్యాఖ్యానిస్తున్నారు. దీన్నిబట్టి తమ వద్ద చంద్రబాబునాయుడు అవినీతికి సంబంధించి… ఎలాంటి ఆధారాలు లేవన్న విషయం ప్రజలకు అర్ధమవడం, తమకు ఇబ్బందికరమే అని వైసీపీ నేతలు అంగీకరిస్తున్నారు.
ఈ చర్య వలన ఇప్పుడు బీజేపీని కూడా, తాము ఈ రచ్చలోకి లాగినట్లయిందని పలువురు వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. నిజానికి విరాళాలతో వేలకోట్ల రూపాయల లబ్థిపొందిన వారిలో, బీజేపీ అగ్రస్థాన ంలో ఉండగా, వందల కోట్లతో కాంగ్రెస్ 2వ స్థానంలో ఉందని గుర్తు చేస్తున్నారు. ఇక విరాళాలు అందుకుంటున్న ప్రాంతీయ పార్టీల్లో 600 కోట్లతో తమ పార్టీ మొదటి స్థానంలో ఉండగా, డీఎంకె, తృణమూల్ కాంగ్రెస్ తర్వాత స్థానాల్లో ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.
ఇదిలాఉండగా ఇప్పటిదాకా బీజేపీ 5,272 కోట్ల రూపాయలు, కాంగ్రెస్ 952 కోట్లు, అన్ని పార్టీలూ 1784 కోట్ల రూపాయలు విరాళాలు తీసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ 768 కోట్లు, బిజూ జనతాదళ్ 622 కోట్లు, డిఎంకె 432 కోట్లు పారిశ్రామికవేత్తలు- కాంట్రాక్టర్ల నుంచి విరాళాలు తీసుకున్నటు,్ల రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ‘ ఎలాంటి అవినీతి చేయకుండా కేసీఆర్ పార్టీకి 900 కోట్ల రూపాయల వైట్ మనీ ఎలా వచ్చింది’ అని, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రశ్నించడం విస్మరించకూడదు.
కాగా వైసీపీ ఆందోళనకు తగినట్లుగానే.. తాజాగా పొన్నవొలు బయటపెట్టిన విరాళాల వ్యవహారం, బీజేపీకి ప్రాణసంకటంగా మారింది. ఈ లెక్కల యుద్ధంలో ‘బీజేపీ నిజాయితీ’ కూడా బయటపడటమే దానికి కారణం. కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు.. కేంద్రప్రభుత్వం నుంచి ఎలాంటి లాభం పొందకుండా, ప్రభుత్వంలో ఉన్న పార్టీకి ఎందుకు విరాళం ఇస్తారన్న చర్చ మేధావుల్లో మొదలయింది.
దీన్నిబట్టి బీజేపీ కూడా భారీ స్థాయిలో కాంట్రాక్టర్లు-బడా పారిశ్రామికవేత్తలకు పనులుచేసి పెట్టిందన్న విషయం.. పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు బట్టి అర్ధమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దానితో బీజేపీ నిజాయితీపై ఇప్పటివరకూ సామాన్యులు-విద్యావంతులు-మేధావుల్లో ఉన్న భ్రమలు తొలగిపోయేందుకు, పొన్నవోలు ఆరోపణలు దోహదపడినట్లు స్పష్టమవుతోంది.