Suryaa.co.in

Andhra Pradesh

ఎర్ర చందనం స్మగ్గర్ల పట్ల అలసత్వం వద్దు !

– టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి డిమాండ్

తిరుపతి, ఆగస్టు 19 : ఎర్ర చందనం అక్రమ రవాణా పరిశీలన కోసం ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) లోతైన పరిశోధన చేయాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర హై కోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పడిన ఈ బృందం ఆదివారం తిరుపతికి వస్తున్నదని చెప్పారు. టాస్క్ ఫోర్స్ అధికారులతో కలిసి తిరుపతి తిరుమల పరిధిలోని అడవులలో పర్యటిస్తారని తెలిపారు.

అయితే అలసత్వం వహించ కుండా ఎర్ర చందనం స్మగ్లర్ల పీడ వదిలించాలని కోరారు.వీరి నిర్వాకం వల్లనే అడవిలోని చిరుత పులులు జనాల్లోకి వస్తున్నాయని చెప్పారు.ప్రతి నిత్యం శేషాచలం అడవుల నుంచి వివిధ మార్గాలలో కోట్ల విలువైన ఎర్ర చందనం అక్రమంగా తరలి పోతున్నదని తెలిపారు. చంద్రగిరి, పీలేరు, రాయచోటి, రాజంపేట, కోడూరు, తిరుపతి నియోజక వర్గాల నుంచి చెన్నై, బెంగళూరుకు తరలిలిస్తున్నారని చెప్పారు.

ఎక్కువగా రేణిగుంట, పుత్తూరు, నెండ్రగుంట , పెనుమూరు, జి డి నెల్లూరు, మదనపల్లి, పుంగనూరు మార్గాల ద్వారా అక్రమ రవాణా జరుగుతున్నదని చెప్పారు. దీని వెనుక అధికారం, పలుకుబడి ఉన్న కొందరు ప్రముఖ నాయకుల హస్తం ఉందని చెప్పారు. అలాగే కొందరు అధికారులు కూడా లంచాలకు ఆశపడి దొంగలకు సహకరిస్తున్నారని చెప్పారు. కంటి తుడుపు చర్యగా అప్పుడప్పుడు కొందరిని అరెస్టు చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. ఎక్కువ సందర్భాలలో దొంగలను వదిలేసి దుంగలను పట్టు కుంటున్నారని ఎద్దేవా చేశారు.

ఇప్పటి వరకు దొరికిన చిన్న దొంగల ద్వారా అసలు దొంగల వివరాలు రాబట్ట లేక పోతున్నారని విమర్శించారు. కేవలం అరెస్టులు, స్వాధీనం చేసుకున్న దుంగలు ఇతర వివరాలు పరిశీలించి మమా అనిపించకుండా సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. అసలు అడవుల్లో యే యే ప్రాంతాలలో ఎర్రచందనం చెట్లను నరికు, దుంగలుగా మారుస్తున్నారో కనిపెట్టాలన్నారు. శక్తి వంత మైన డ్రోన్ కెమెరాలు, ఇతర సాంకేతిక పరికరాలను ఉపయోగించి దొంగల స్థావరాలు కనిపెట్టలన్నారు.

చంద్ర మండలానికి రాకెట్లు, ఉపగ్రహాలను పంపగలుగుతున్న నేపథ్యంలో అడవి దొంగలను కనిపెట్ట లేక పోవడం వింతగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్యం, అధికారులకు చిత్తశుద్ది లేక పోవడం వల్లనే ఎర్ర చందనం దొంగలను నిర్మూలించ లేక పోతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రత్యేక దర్యాపు బృందం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలు ఉపయోగించి అక్రమ రవాణా అరికట్టాలని సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE