Suryaa.co.in

Andhra Pradesh

ఎందుకు పోలీసులు అరెస్టు చేస్తున్నారో తెలుసుకొనే హక్కు పౌరులకు లేదా?

మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, జి20 వేదికగా ప్రధాని మోడీ ఒకవైపు డప్పు కొడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్య – మానవ హక్కులకు, రాజ్యాంగబద్ధమైన – చట్టబద్ద పాలనకు పాతరవేస్తున్నారు.

స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల దుర్వినియోగం కేసులో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాన నిందితుడని, అందుకే అరెస్టు చేశామని సిఐడి, డిజి, తాఫీగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీడియా ప్రతినిధులకు తెలియజేశారు.

స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో జరిగిన అవినీతి కేసుతో పాటు పైబర్ కేబుల్ నెట్ వర్క్ లోను , అమరావతి రింగ్ రోడ్డు వ్యవహారంపైన లోకేష్ పాత్రపైన కూడా విచారణ చేస్తున్నామని కూడా పనిలో పనిగా వెల్లడించారు. రానున్న ఎన్నికల పూర్వరంగంలో ప్రభుత్వ అజెండా ఏమిటో బయట పెట్టారు. ప్రజల అజెండా, ఎన్నికల అజెండా కాకుండా దారి మళ్ళించాలనే కుట్ర ఇందులో దాగి ఉన్నట్లు కనబడుతున్నది.

చంద్రబాబును అరెస్టు చేసిన కేసు పూర్వపరాలను పరిశీలిస్తే, చంద్రబాబు ప్రభుత్వ కాలంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా పని చేసి, నేడు జగన్ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడైన అజయ్ కల్లాం 2021 డిసెంబరు 9న కేసు పెట్టారట. 2019 మే నెలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

కేసు 2021 డిసెంబరులో పెట్టారు. 2024లో ఎన్నికలు జరగబోతున్న పూర్వరంగంలో, FIRలో చంద్రబాబు పేరు లేకపోయినా అరెస్టు చేశారు. ఎందుకు అరెస్టు చేశారంటే, రివైజ్డ్ FIRలో ఆయన పేరు చేర్చబడుతుందట! ఇది “రాజకీయ తతంగం”గా స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు రెండేళ్ళ కాలంలో విచారణ పూర్తి చేసి, అవినీతి ఆరోపణలపై నిజాన్ని నిగ్గుదేల్చలేదో!

అవినీతి, అక్రమాలు జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు కాబట్టి అరెస్టు చేశామని ఇప్పుడు సిఐడి, డిజి చెప్పడం, అరెస్టు చేసిన పోలీసు అధికారులు ఆ మాట కూడా చెప్పకుండానే అరెస్టు చేయడం, నాన్ – బెయిలబుల్ అరెస్టు చేస్తున్నాం, న్యాయ స్థానంలోనే బెయిల్ కు అప్లయ్ చేసుకోవాల్సిందేనని వ్యాఖ్యానించడం, చట్టబద్దమో! కాదో! న్యాయ స్థానాలే తేల్చాలి.

ఒక పౌరుడిని అరెస్టుచేసే సందర్భంలో పాటించాల్సిన కనీస నియమాలను కూడా పాటించలేదు. రాజ్యాంగం, చట్టాలు, సుప్రీం కోర్టు తీర్పులపై లెక్కలేనితనంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించారన్న భావన కలిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోకడలు ప్రజాస్వామ్యం మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

– టి. లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు

LEAVE A RESPONSE