– సీపీఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు డిమాండ్
పరవాడ: స్మార్టు మీటర్లు బిగించవద్దని, విద్యుత్ సర్ధుబాటు ఛార్జీలు తగ్గించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం పరవాడ సబ్ స్టేషన్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. సీపీఎం పార్టీ జిల్లా కార్యదదర్శ జి.కోటేశ్వరరావు మాట్లాడారు. అదానీ విద్యుత్ స్మార్ట్‌మీటర్లను బిగించి ప్రజలపై భారం మోపుతున్నారని, ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని చెప్పి అధికారంలోకివచ్చి అదే స్మార్ట్ మీటర్లు బిగింపు చర్యలు తీసుకోవడం దుర్మార్గం అన్నారు. మోడీ ప్రభుత్వ ఆదేశాలకు లొంగిపోయి గత వైసీపీ ప్రభుత్వం స్మార్ట్‌మీటర్లకు ఒప్పందాలు చేసుకుని, అదాని సంస్థకు టెండర్లను కట్టబెట్టి, భారీ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించిన కూటమి ప్రభుత్వం పదివేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతుందన్నారు.అందుకే గత ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారని గుర్తు చేశారు.
నాడు స్మార్ట్‌మీటర్లను పగలగొట్టాలని పిలుపునిచ్చిన మీరు, నాడు మీటర్లను బిగించాలని ఆదేశాలు ఇవ్వటంతోపాటు, స్మార్ట్‌మీటర్ల ఒప్పందాలను రద్దు చేయకుండా వాటిని కొనసాగించడం రాష్ట్ర ప్రజలను నమ్మకద్రోహం చేయడమే అవుతుందన్నారు. విద్యుత్ భారాలను తగ్గిస్తామని ఎన్నికల్లో మీరు హామీ ఇచ్చారు. కానీ, సంవత్సరంలో 15,485 కోట్ల రూపాయలు సర్ధుబాటు ఛార్జీలను అదనంగా మోపారు. మొత్తం నాలుగు రకాల సర్దుభాటు ఛార్జీలు (ఎఫ్.పి.పి.సి.ఏ) వసూలు చేస్తున్నారు. దీనితో బిల్లులు అధికంగా వస్తున్నాయి.
స్మార్ట్ మీటర్లు బిగించిన అనంతరం షాపులు, చిన్న పరిశ్రమలు రెండు, మూడు రెట్లు, కొందరికి 10రెట్లు ఛార్జీలు పెరిగాయి. మీటర్లకు అయ్యే ఖర్చు రూ.10వేల17వేల వరకు దశలవారీగా వినియోగదారులపై మోపడం మరింత దారుణం. అధిక విద్యుత్ వినియోగించే సమయాలలో అధికరేట్లు నిర్ణయించి వసూలు చేయడం అన్యాయం. ప్రీపెయిడ్ మీటర్ల వల్ల అందరిపై అధిక భారం పడుతుంది.
కరెంట్ బిల్లులు ఆన్లైన్లో పంపడం వల్ల బిల్లులకు జవాబుదారీతనం ఉండదని మనవి చేస్తున్నాము. అందుకే అదానీ స్మార్ట్‌మీటర్లు, సోలార్ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని కోరుతున్నాము. స్మార్ట్‌మీటర్ బిగించడాన్ని మేము వ్యతిరేకస్తున్నాము. పాత మీటర్లనే కొనసాగిస్తూ, పాత రీడిరగ్ పద్ధతినే అమలు చేయాలని, గృహాలకు స్మార్ట్ మీటర్లు పెట్టవద్దని, షాపులు, సంస్థలకు పెట్టిన మీటర్లు తొలగించాలని, సర్ధుబాటు ఛార్జీలు పూర్తిగా రద్దు చేసి బిల్లులు తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు వివి రమణ, పి మాణిక్యం, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ, ఐద్వా నాయకులు ఎం.బంగారమ్మ, టి.అన్నపూర్ణ, డి.సీతమ్మ, కె.సాయి వేణి, డి.నాగదేవి, ఎస్కే బేగం, గౌరీ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.