Suryaa.co.in

Features

దళిత దార్శనికతకు నిలువెత్తు నిదర్శనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్

75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశం గర్విస్తోంది. బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ప్రపంచ మేధావిని కన్నందుకు ఈ భారతావని పులకించిపోతోంది. భారత్ కు ఊపిరిగా, దేశానికి దిక్సూచినిచ్చిన మహనీయుడు అంబేద్కర్ ప్రపంచానికే ఆదర్శనంగా నిలిచినందుకు భరతమాత ఉప్పొంగిపోతోంది. దేశం కోసం రాత్రి, పగలు అహర్నిశలు తన కలంతో కవాతు చేసిన పోరాటయోధుడు , భరత ఖండ యుగపురుషుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇంతటి మహనీయుని స్మరించుకోవడం ఈ దేశం బాధ్యత.

నరనరాల్లో దేశభక్తిని పుణికిపుచ్చుకున్న బాబాసాహెబ్ మనుషుల మధ్య విబేధాలు సృష్టించి దేశాన్ని ముక్కలు చేయడం దేశ భవిష్యత్తుకు ఏ మాత్రం మంచిదికాదని ఆనాడే చెప్పారు. వెయ్యి ఏళ్ళ దూరదృష్టితో భారత రాజ్యాంగాన్ని (సంవిధాన్) రాసిన అంబేద్కర్ రాజ్యాంగ హక్కులతో ప్రతి మనిషికి వెయ్యి ఏనుగుల బలనిచ్చారు. రాజ్యాంగ బలమే ఈ రోజు భారత్ ఒక ”బలగం” అయి వెలుగుతోంది. అందుకే ఈ దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ప్రతిఏడాది అంగరంగ వైభవంగా జరుపుకుంటోంది. గల్లీలు మొదలుకొని ఢిల్లీ వరకు బాబాసాహెబ్ జయంతి ఒక వేడుకల జరుగుతోంది. ఏప్రిల్ నెల మొత్తం అంబేద్కర్ జయంతి జరుగుతూనే ఉంటుంది. బహుశా ఇంతటి గొప్ప అవకాశం ఈ ప్రపంచంలో ఏ నాయకుడికి దక్కి ఉండకపోవచ్చు.

ఆ మహానుభావుడి జయంతిని తెలంగాణ ప్రభుత్వం కూడా ఈసారి ఒక పండుగలా చేస్తోంది. రాజ్యంగంలో రాసి ఆర్టికల్ 3 ప్రకారం సంక్రమించిన ”తెలంగాణ” రాష్ట్రం బాబాసాహెబ్ ను ఘనంగా స్మరించుకుంటోంది. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. తెలంగాణ రాష్ట్రంలో దళిత దార్శనికతకు నిలువెత్తు నిదర్శనమే 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం. ఒక పక్క అద్భుతమైన కట్టడం తెలంగాణ సచివాలయం.

సచివాలయం పక్కనే 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం. ఇక్కడ అంబేద్కర్ చేతి వేలు హుసేన్ సాగర్ లో ఉన్న గౌతమ బుద్ధుని వైపుకు చూపుతోంది. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహంతో ఈ ప్రాంతానికే కొత్త కల వచ్చేసింది. ఇదే ప్రాంతంలో ఇద్దరు మాజీ ప్రధానుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ దేశంలో ఏకైక మహిళా ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహంతో పాటు తెలంగాణ ప్రాంతం నుంచి ప్రధానిగా పని చేసిన ఏకైక నేత పి వి నరసింహ రావు విగ్రహం కూడా ఉంది.

దేశానికి దిశా నిర్దేశం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం తో పాటు దేశాన్ని పాలించిన ఇద్దరు ప్రధానుల విగ్రహాలు ఉండటం ఈ సందేశం దేశానికే తలమానికంగా భావించవచ్చు.

ఈ దేశానికి తొలి, ఏకైక మహిళా ప్రధాని ఇందిరాగాంధీ. ఏకంగా పదహారేళ్ళ పాటు ఆమె దేశాన్ని పరిపాలించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ రాజ్యాంగం లో మహిళలకు సముచిత స్తానం కల్పించారు. రాజ్యాంగంలో మహిళలను ఎంతగానో గౌరవించారు. మహిళలకు హక్కులు కల్పించారు. ఇక్కడ కనిపించే అంబేద్కర్, ఇందిరా గాంధీ, పి వి నరసింహ రావు , గౌతమ బుద్ధుడు విగ్రహాలన్నీ యాదృచ్చికంగానే పక్కపక్కనే ఉన్నప్పటికీ దేశ భవిష్య సందేశం హుసేన్ సాగర్ చుట్టే కనిపిస్తోంది.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున హుసేన్ సాగర్ గడ్డమీద 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ ఏర్పాటు చెయ్యడమే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు షెడ్యూల్ కులాల పట్ల ఉన్న దృక్పథాన్ని తెలియజేస్తోంది. అంబేద్కర్ ఆశయ సాధన కోసం అడుగులు వేస్తున్న కేసీఆర్ ఆలోచన ధోరణి ఏమిటో ఈ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల కోసం అమలు జరుపుతున్న అభివృద్ధి పథకాలే చెప్తున్నాయి.

”జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా – అంబేద్కర్ కా నామ్ రహే గా ” అన్నట్టు చరిత్ర ఉన్నంతకాలం తెలంగాణ సచివాలయం పై డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ పేరు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారు. ఆర్థికంగా షెడ్యూల్ కులాల ప్రజలు బలపడాలి అని అంబేద్కర్ కన్న కళలను సాకారం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎస్ సి సబ్ ప్లాన్ , దళిత బందు వంటి వినూత్న పథకాలను అమలు పరుస్తోంది. దళిత బందు పథకం కొద్దీ రోజుల క్రితమే ప్రారంభం అయినప్పటికీ ఈ పథకం వల్ల ఎక్కువ మందికి లబ్ది చేకూరుతోంది అని చెప్పడం అతిశయోక్తి కాదు.

ఎలాంటి షూరిటీలు లేకుండా నేరుగా లబ్ధిదారుడికి లాభం చేకూర్చే దళిత బందు లాంటి పథకం బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదని చెప్పవచ్చు. కేజీ టూ పీజీ ఉచిత విద్యను అమలు చేస్తోంది ప్రభుత్వం. అంబేద్కర్ కూడా కోరుకున్నది ఇదే. ఈ దేశంలో పుట్టిన ప్రతి పేద విద్యార్థికి ఉచితంగా విద్య అందాలి అని అంబేద్కర్ ఆశించారు. ఇదే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది.

ఈ పథకాలే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న షెడ్యూల్ కులాలను ఆకర్షిస్తున్నాయి. టి ఆర్ ఎస్ నుంచి బి ఆర్ ఎస్ రూపాంతరం చెందిన ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటి గొప్ప గొప్ప పథకాలను దేశంలోని ఎస్ సి లకు అందించాలనే ఆలోచనతో కేసీఆర్ ముందడుగు వేశారని భావించవచ్చు. ఉన్నతమైన , నాణ్యమైన విద్యతో పాటు ఉన్నతమైన జీవితాన్ని అందించిన ప్రభుత్వాలను ఏ నాడు ప్రజలు మరచిపోలేదు. ఒకపక్క అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు తునా తునకలుగా చేసి ఎస్ సి ల బతుకులను ప్రయివేటు రంగానికి అందకుండా చేస్తున్న ప్రభుత్వాలను జనం చూస్తూనే ఉన్నారు. అందుకే ఈ ప్రపంచం బతికి ఉన్నంతకాలం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయానికి ఢోకా లేదు.. ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్లే నాయకత్వానికి లోటు లేదు.

నీలం జానయ్య
సీఈఓ
సోలార్ ఎనర్జీ

LEAVE A RESPONSE