Suryaa.co.in

Andhra Pradesh

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డా.నిమ్మగడ్డ రమేష్ లేఖ

-పింఛన్ల పంపిణీకి అంతరాయం లేకుండా యుద్ధ ప్రాతిపదికన తక్షణచర్యలు తీసుకోవాలి!
-సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ విజ్ఞప్తి!

మార్చి నెల సామాజిక పింఛన్ల పంపిణీ కోసం యుద్ధ ప్రాతిపదికన సమర్ధవంతమైన తక్షణ చర్యలు తీసుకోవాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ప్రధానకార్యదర్శి ,రాష్ట్ర ఎన్నికల పూర్వ ప్రధానాధికారి డా.నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆమేరకు డా.రమేష్ కుమార్ రాష్ట్రప్రభుత్వ ప్రధానకార్యదర్శికి ఒక లేఖ రాశారు.

“పింఛన్లు సహా అన్ని రకాల నగదు పంపిణీ పథకాలకు వలంటీర్లను దూరంగా ఉంచాలని , పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికలసంఘం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందని, అందుకోసం తక్షణ చర్యలు తీసుకోవాలని” డా.రమేష్ కుమార్ ఆ లేఖలో కోరారు.

ప్రతీ నెలా ఒకటవ తేదీనే వివిధరకాల పింఛన్ల పంపిణీ పంపిణీ చేసే విధానాన్ని ఎప్పటినుండో రాష్ట్రంలో అమలు చేస్తున్నారనీ, పదులలక్షల సంఖ్యలో వయో వృద్ధులైన లబ్ధిదారులు ఉన్నందున , వారికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంతో పాటు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వంటి పౌరసమాజ సంస్థలపై కూడా ఉంటుందని డా .రమేష్ కుమార్ అభిప్రాయ పడ్డారు.

“ఎన్నికల విధులకు , ఎన్నికల కాలంలో నగదు పంపిణీ పథకాలకు వలంటీర్లను దూరంగా ఉంచాలని తాము పోరాడామని , హైకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘం తాము లేవనెత్తిన అంశాలు సమంజసంగా ఉన్నాయని భావించే తగిన ఆదేశాలు ఇచ్చాయని ,ఆయన ఆ లేఖలో గుర్తు చేశారు.

ప్రస్తుతానికి వలంటీర్లు లేకపోయినా అంతరాయం లేకుండా పింఛన్ల పంపిణీ కార్యక్రమం యధావిధిగా కొనసాగేందుకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని, ప్రభుత్వ యంత్రాంగం లోని ఇతర సిబ్బందిని వినియోగించ వచ్చని , అందుకు అవసరమైన తక్షణ చర్యలను యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలని డా.రమేష్ కుమార్ ఆలేఖలో సూచించారు.

ప్రకృతి వైపరీత్యాల సందర్భాల్లో ఎదురైన తీవ్రసవాళ్ళను అత్యంత సమర్థవంతంగానూ , నిబద్దతతోనూ ఎదుర్కున్న అపారమైన అనుభవం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ఉందని, ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న అన్ని మానవ వనరులను వినియోగించి లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ జరిగేటట్లు చూడాలని డా. రమేష్ కుమార్ ఆలేఖలో కోరారు.

“ముందుచూపుతో ఆదిశగా ఇప్పటికే తగిన అత్యవసర ప్రణాళిక రూపొందించి ఉంటారని భావిస్తున్నానని, లేనిపక్షంలో యుద్ధప్రాతిపదికన తక్షణచర్యలు తీసుకోవాలని” రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి రాసిన ఆలేఖలో డా నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
లేఖ ప్రతిని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కి కూడా పంపించినట్లు ఆయన తెలిపారు.

LEAVE A RESPONSE