Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రానికి పట్టిన శని మే13 తేదికి వదలిపోతుంది

ఖజానాలో ఉన్న డబ్బులు కాంట్రాక్టర్లకు దోచిపెట్టి పింఛను ఇవ్వలేక జగన్ రెడ్డి తిరిగి నాపై బురద జల్లుతున్నాడు
రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ.2000 చేసింది నేనే. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పింఛను రూ.4 వేలకు పెంచి ఇంటి వద్దకే తెచ్చి అందించే బాధ్యత నాదే
బాపట్లను టూరిజం హబ్‌గా మారుస్తా. ఆక్వా, ఆర్టికల్చర్‌ను అభివృద్ధి చేస్తాం
బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దోపిడీదారుడు.. ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్ధి సేవాభావం కలవాడు
బాపట్ల వైసీపీ ఎంపీ అభ్యర్ధి ఒక రౌడి.. ఎన్డీఏ ఎంపీ అభ్యర్ధి నిజాయితీగల ఐపీఎస్ అధికారిగా పనిచేసిన వ్యక్తి
ఎవరు కావాలో మీరే తేల్చుకోండి
-బాపట్ల ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు

బాపట్ల: ఐదేళ్ళుగా రాష్ట్రానికి పట్టిన శని మే13 తో వదులుతోంది. ఈస్టర్ రోజు బాపట్లలో ఉండడం నా అదృష్టం. భారత రాజ్యాంగాన్ని రాసి మనకి హక్కులు ఇచ్చిన అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రావు గారు పుట్టింది మార్చి నెలలోనే

గత సంవత్సరం డిసెంబర్ లో నేను బాపట్లకు వచ్చాను. తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి వారికి ధైర్యాన్ని ఇచ్చాను.ఈ సంవత్సరం రైతాంగం పూర్తిగా చితికిపోయింది. వ్యవసాయ ఆధారిత కూలీలు ఇబ్బందులు పడ్డారు. వారికి ఈ ప్రభుత్వం ఏమి చేయలేదు.

మూడు పార్టీల కలయిక మా కోసం కాదు.. రాష్ట్రం కోసం, ప్రజల కోసం మాత్రమే. ఐదు సంవత్సరాల దుష్టపాలనను మీరు చూశారు. ఒక అహంకారి రాష్ట్రాన్ని అతలాకుతం చేశాడు.

నరేంద్రవర్మ ఎలాంటి వాడో, ఇక్కడున్న వైకాపా అభ్యర్ధి ఎలాంటి వాడో ప్రజలే తేడాలు చూడాలి.నేను పట్టిసీమను తీసుకొచ్చి కృష్ణా డెల్టా ద్వారా మీకు నీళ్ళు అందించాను. నేను తీసుకువచ్చానని అహంకారంతో జగన్ రెడ్డి పట్టిసీమను వాడటం ఆపేసాడు.

అమరావతిలోని భూములను పాడుపెట్టి 3 లక్షల కోట్ల రూపాయిల ప్రజా ధనాన్ని జగన్ విధ్వంసం చేశాడు. సంపదను నాశనం చేసి మీ నెత్తిన రూ.13 లక్షల కోట్లు అప్పులు తెచ్చాడు.ఈ అప్పును సాక్షి పేపర్ కడుతుందా? భారతి సిమెంట్ కడుతుందా? మీరే పన్నుల ద్వారా కట్టాలి. దానికి మాత్రం సమాధానం చెప్పరు.

ఆక్వా రైతులు ఎవరైనా బాగుపడ్డారా? టీడీసీ హయాంలో రాష్ట్రంలో 2లక్షల ఆక్వా హెక్టార్ల సాగును ప్రోత్సాహించాం. 3 రెట్లు ఖర్చులు పెరిగినా ఆదాయం మాత్రం లేదు. 10 ఎకరాలు పెట్టి జోన్, నాన్ జోన్ అని ఆంక్షలు పెట్టారు.

ఈ రాష్ట్రానికి కోస్టల్‌లో ఆక్వా కల్చర్ అవసరం. రూ.1.50 పైసాకే అందరికి కరెంట్ ఇచ్చే బాధ్యత నాది. మత్స్యకారులను దెబ్బతీసే విధంగా జీవో నెం.217 తీసుకువచ్చారు. అధికారంలోకి రాగానే ఆ జీవోను రద్దు చేసి మీకు స్వేచ్ఛనిస్తాను. చెరువులను మీకే ఇస్తాను.

మాస్క్ అడిగిన డాక్టర్ను పిచ్చోడిని చేసి చంప్పాడు. అంబేద్కర్ పేరుతో విదేశి విద్యను తీసుకొస్తే ఆ పేరు మార్చి జగన్ రెడ్డి పేరు తన పేరు పెట్టుకొని అది కూడా అమలు చేయలేదు. అంబేద్కర్ కంటే గొప్పోడివా..అని జగన్ రెడ్డిని అడుగుతున్నా..

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెబుతున్నారు. మేము పొత్తు పెట్టుకుంటే జగన్ రెడ్డికి నిద్ర రాదు. అందుకే కుట్రలు చేసైనా పొత్తు చెడగొట్టాలని ప్రయత్నాలు చేశాడు. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మనిద్దరం కలవాలని పవన్, నేను నిర్ణయించుకున్నాం.

రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పథకాలు మరింతగా దూసుకువెళ్ళాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. నా మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్న జగన్ రెడ్డికి నేను సవాల్ విసురుతున్నా. కేంద్రంలో మైనారిటీలకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన బిల్లులన్నిటికీ జగన్ రెడ్డి సపోర్ట్ చేశాడు. నన్ను విమర్శించే హక్కు జగన్ రెడ్డికి లేదు.

నువ్వు ఏం చేశావ్ అని జగన్ రెడ్డి నన్ను అడుగుతున్నాడు. నా ట్రాక్ రికార్డ్ చెప్పాక తిరిగి నోరు ఎత్తలా. 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా చేశా ఈ 14 ఏళ్ళలో 8 సార్లు డీఎస్సీ ఇచ్చాను. ఎన్టీఆర్ 3 సార్లు ఇచ్చారు. తెదెపా హయాంలో మొత్తం 11 సార్లు ఇచ్చాం. ఇప్పుడున్న టీచర్లలో 75 శాతం మంది మేము నియమించిన వాళ్ళే.

దురదృష్టవశాత్తు జగన్ రెడ్డి సీఎం అయ్యాడు. ఐదేళ్ళలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఒక్క డీఎస్సీ పెట్టలేదు. ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. ఏపీపీఎస్సీలో డీఎస్పీ, సబ్ కలెక్టర్, ఆర్డీవో ఉద్యోగాలను జగన్ రెడ్డి అమ్ముకున్నాడు. మళ్లీ పరీక్షలు నిర్వహించి మెరిట్ ప్రకారం ఉద్యోగాలు ఇస్తాం.

అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. పేదవాడికి కడుపు నిండా అన్నం పెడుతుంటే ఓర్వలేని వ్యక్తి జగన్ రెడ్డి. బాపట్లలో నరేంద్ర వర్మ నాయకత్వంలో 508 రోజుల నుంచి అన్నా క్యాంటీన్లతో పేదల ఆకలి తీరుస్తున్నాడు. ఫౌండేషన్ ద్వారా రూ.5 కే మినరల్ వాటర్‌ను 31 గ్రామాలకు అందిస్తున్నాడు. పేదల వైద్య ఖర్చులకు ఆర్ధిక సాయం చేస్తున్నాడు. పాస్టర్లకు క్రిస్మస్ కానుకలు, ఇమామ్, మౌజంలకు రంజాన్ తోఫా, మసీద్, చర్చి, గుడుల నిర్మాణాలకు ఆర్ధిక సాయం చేస్తున్నాడు. దివ్యాంగులకు సాయం చేశాడు. ఉచిత కంటి వైద్య శిబిరాలు, ఉచిత పుస్తకాలు సరాఫరాలు చేశారు. ఇదే వర్మ బ్రాండ్. రాజకీయాలు కాదు సేవా భావమే వర్మ అభిమతం. బాపట్ల ప్రజలకు సేవలందించాలనే వర్మ రాజకీయాల్లోకి వచ్చాడు.

బాపట్లలో కోనా రఘుపతి ఇసుక మాఫియాతో ఇసుకను దోచేస్తున్నాడు. 50 అడుగుల లోతుకి ఇసుకను ఊడ్చేశాడు. దీని వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. జగనన్న కాలనీలంటూ తక్కువ ధరలకు భూములను కొని ఎక్కువ ధరలకు అమ్ముకొని అందులో కూడా డబ్బులు కొట్టేసిన ఘనుడు. బాపట్లలో ఎవరైనా వెంచర్ వేయాలంటే ఎకరాకు రూ.10 లక్షల చొప్పున కప్పం కట్టాలి. వేరే వాళ్ళణి పెట్రోల్ బంకు పెట్టనివ్వకుండా..ఒక్కటే పెట్రోల్ బంకు పెట్టుకొని అరాచకాలు చేస్తున్నాడు.

సూర్యలంక తీర భూములపై కన్ను వేశాడు. టూరిజానికి పనికి వచ్చే 4 వేల ఎకరాల భూములను కొట్టేయాలని చూశాడు. భవన్నారాయణ స్వామి ఆలయానికి కోట్లు రూపాయిల విరాళాలు సేకరించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు.

రానున్న ఎన్నికలు మా కోసం కాదు.. ఈ రాష్ట్రం కోసం. ఎన్డీఏకు మీరు ఓటు వేస్తే సహజ వనరుల దోపిడీ ఉండదు. ధరల బాదుడు ఉండదు. కక్ష రాజకీయాలు ఉండవు. ప్రజాస్వామ్యంపై దాడులు ఉండవు. వ్యవస్థలు నిర్వీర్యం కావు. ప్రజలకు నమ్మకం, భరోసా కల్పించి నెం.1 స్టేట్‌గా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేస్తాం. నిర్ధిష్టమైన ప్రణాళికతో ముందుకు వస్తాం.

బాపట్ల ఉమ్మడి పార్లమెంటు అభ్యర్ధి కృష్ణ ప్రసాద్‌ను నేను వ్యక్తిగతంగా అతని పని తీరును చూశాను. నేను సీఎంగా ఉన్నప్పుడు తొమ్మిది సంవత్సరాలుగా ఐపిఎస్ అధికారిగా నా దగ్గర పని చేశాడు. మంచి వ్యక్తి. నీతి నిజాయితిగా బ్రతికి పది మందికి ఉపయోగపడ్డాడు. అందుకే వెతికి వెతికి ఒక సామాజిక వర్గానికి న్యాయం చేయాలని కృష్ణ ప్రసాద్‌ను నిలబెట్టాం. బాపట్ల ఎంపీగా కృష్ణ ప్రసాద్‌ను, ఎమ్మెల్యే నరేంద్ర వర్మను గెలిపించాల్సిన బాధ్యత బాపట్ల ప్రజలపై ఉంది.

LEAVE A RESPONSE