బాబూ రాజేంద్రప్రసాద్..
ఈ పేరే నిబద్ధతకు నిర్వచనం
నీతినిజాయితీలకు
బహువచనం..
క్రమశిక్షణకు నామవాచకం
జీవితమే మేధ
అనే సిరాతో రాసుకుని
దేశభక్తి అనే అట్టవేసి
అందంగా బౌండ్
చేసిన పుస్తకం..
న్యాయశాస్త్రం మొత్తాన్ని
ఔపోసన పట్టేసిన మస్తకం!
పుష్కరకాలం
ప్రధమపౌరుడి హోదా..
మనిషి మాత్రం సాదా..
ఆయన నేతృత్వంలోనే
రూపు దిద్దుకున్న
రాజ్యాంగం ముసాయిదా..
ఎన్నో మంచి లక్షణాలున్న
మనిషి గనకనే
జాతి మొత్తం
బాబూజీకి ఫిదా..!
భారత రాష్ట్రపతి పదవికి
రాజేంద్రునితోనే వన్నె..
అత్యున్నత స్థానంలో
అత్యంత గౌరవ ప్రస్థానం
కుర్చీలో కూర్చున్నంతనే
కాంగిరేసుకు రాజీనామా
విలువలే ఆయన వీలునామా..!
విద్యార్థి దశలో
అబ్బురపరిచే మేధస్సు..
పరీక్ష రాసిన వాడే పేపరు దిద్దిన వాడికంటే గొప్పోడని
ఉపాధ్యాయుని ప్రశంసలు
పొందిన ఉషస్సు..
ఈ రెండూ కలగలిపి అందుకున్న ఉన్నత పదవి
నిర్వహణలో
అంతులేని యశస్సు..
ఈ రాజేంద్రప్రసాదం
ఉనికితోనే వాసికెక్కిన
రాష్ట్రపతి ప్రాసాదం..!
స్వరాజ్య సమరంలో
ఎందరో వీరులతో పాటుగా
తాను సైతం..
అందుకోసం పదవుల
పరిత్యాగం..
నమ్ముకున్న న్యాయవాదవృత్తి తృణప్రాయం..
అలా అయ్యాడు
రాజేంద్రప్రసాద్
జాతికి ఆదర్శం..!
రాష్ట్రపతిగానూ తనదైన ప్రత్యేక ముద్ర..
ఎన్నో దేశాల్లో భారత ప్రతినిధిగా పర్యటించి
భారతీయ విధానాలకు
సంపాదించి ఆమోదముద్ర..
కొండొకచో గర్జిస్తూ
వదిలించి వ్యవస్థల మొద్దునిద్ర..
తానే స్థాపించిన భారతరత్నను తదుపరి కాలంలో అందుకున్న ఘనుడీ దేశరత్న..!
(భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ వర్ధంతి)
– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286