అమరావతి: వైద్య రంగంలో విశేష సేవలందించిన డాక్టర్ సూర్యదేవర కేశవరావు బాబు ప్రతిష్టాత్మకమైన పదవికి ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యుడిగా ఆయనను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్ర విశ్వ విద్యాలయం నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ కేశవరావుబాబు.. మధుమేహ చికిత్సా నిపుణులుగా విశిష్ట ఖ్యాతి గడించారు.
మధుమేహం, రక్తపోటుకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలుగు భాషలో పలు రచనలు చేసి, వైద్య పరిశోధనల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ఓడీఏ ప్రాజెక్టు వైద్యాధికారిగా, వీఎంసీ అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసరుగా, వీఎంసీ స్కూల్ హెల్త్ ప్రాజెక్ట్ హెల్త్ ఆఫీసరుగా సేవలందించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విజయవాడ అధ్యక్షుడిగా సమర్థవంతంగా సేవలందించిన డాక్టర్ కేశవరావుబాబు.. ప్రస్తుతం ఐఎంఏ స్టేట్ వర్కింగ్ కౌన్సిల్ మెంబరుగా వ్యవహరిస్తున్నారు.
హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ నిర్వహించిన పలు కార్యక్రమాలకు పరిశీలకుడిగా వ్యవహరించారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ సలహాదారుడిగా సేవలందించిన డాక్టర్ కేశవరావుబాబు.. వివిధ అంశాలపై టీవీ, రేడియో మాధ్యమాల్లో అనేక ప్రసంగాలు చేశారు. ప్రధానంగా మధుమేహానికి సంబంధించి అనేక సదస్సుల్లో ప్రసంగించి, అత్యాధునిక చికిత్సలను ప్రజలకు చేరువ చేసేందుకు అద్వితీయమైన కృషి చేశారు.
డాక్టర్ కేశవరావుబాబు సేవలను మరింత విస్తృతంగా వినియోహించుకోవాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆయనను ఏపీ మెడికల్ కౌన్సిల్ మెంబరుగా నియమించింది. ఈ నియామకం పట్ల డాక్టర్ కేశవరావుబాబు సంతోషం వ్యక్తం చేశారు. తనకు లభించిన ఈ పదవిని బాధ్యతగా భావించి, అంకితభావంతో సేవలందిస్తానని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యుడిగా నియమితులైన డాక్టర్ కేశవరావు బాబుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పలువురు వైద్య నిపుణులు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ నగర ప్రజలకు.. మరీ ముఖ్యంగా వన్ టౌన్ ప్రజలకు విశేష సేవలందించిన డాక్టర్ కేశవరావుబాబు.. ఏపీ మెడికల్ కౌన్సిల్ పదవికి మరింత వన్నె తెస్తారని వారు పేర్కొన్నారు.