Suryaa.co.in

Andhra Pradesh

సచివాలయ సిబ్బందికి డ్రెస్ కోడ్

– ఇక రాష్ట్రమంతా అమలు

అమరావతి: అన్ని గ్రామ, వార్డు సచివాలయాలలో డ్రెస్ కోడ్ను రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇప్పటికే మండలానికి రెండు సచివాలయాలలో ప్రతి సోమవారం డ్రెస్ కోడ్ అమలవుతోంది. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో పాటు, వారం పొడవునా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయశాఖ డైరెక్టర్ ఎస్ షాన్ మోహన్ సర్క్యులర్ జారీ చేశారు.

మహిళా పోలీసు, ఎఎన్ఎం, ఎనర్జీ అసిస్టెంట్స్ మినహా మిగిలిన వారందరికీ డ్రెస్ కోడ్ విధానం సాధ్యమైనంత త్వరగా అమలులోకి రానుంది. ఎప్పటి నుండి ఈ విధానాన్ని అమలు చేయాలన్న విషయంపై ప్రభుత్వం ఇంకా ఒక నిర్ణయానికి రాక పోయినప్పటికీ, జిల్లాలకు ఇప్పటికే మూడు జతల యూనిఫారంను సరఫరా చేసింది. అనేక జిల్లాల్లో మండల పరిషత్ కార్యాలయాలకు కూడా యూనిఫారం క్లాత్ సరఫరా అయ్యింది.

యూనిఫారం క్లాత్ సరఫరాను రెండు సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది. అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు గుడ్విల్ ఫ్యాబ్రిక్స్, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి, కడప జిల్లాలకు మిలాప్చంద్ ప్రతాప్ పద్మచంద్ జైన్ సంస్థలు సరఫరా చేయనున్నారు. 11,162 గ్రామ, 3,842 వార్డు సచివాలయాలలో 1.34 లక్షల మంది సిబ్బంది పని చేస్తుండగా, వారికి 167 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల నుంచి ఎంపిడిఓలు యూనిఫారంను తీసుకుని పంపిణీ చేయనున్నట్లు మోహన్ తెలిపారు.

LEAVE A RESPONSE