– ప్రజలకు ఏం కావాలో సీఎం జగనకు తెలుసు
– రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఆలోచన చేయని చంద్రబాబు
– రాష్ట్రంలో టీడీపీ బీ టీంగా పనిచేస్తున్న బీజేపీ
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
సీఎం జగన్మోహనరెడ్డి పాలనలో ప్రతిపక్షాలకు పనిలేకుండా పోయిందని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. గురువారం రాత్రి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం దగ్గర మీడియా పాయింట్లో మంత్రి కొడాలి నాని మాట్లాడారు. ప్రతిపక్షాలకు ముఖ్యంగా టీడీపీకి రాష్ట్రంలో పోరాటాలు చేయడానికి, ప్రజల తరపున మాట్లాడడానికి ఎటువంటి ఇష్యూలు లేవన్నారు. జనవరి నెల్లో సీఎం జగన్మోహనరెడ్డి ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. వీటిపై కనీసం టీడీపీ ఒక్క మాటైనా మాట్లాడలేదన్నారు. సీఎం జగన్ వంద అడుగుల ముందుంటారని, ప్రజలు అడగక ముందే వారికి ఏం కావాలో ఆయనకు తెలుసని అన్నారు. ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా, కుటుంబ సభ్యుడిగా ప్రతి అంశాన్ని పరిష్కరిస్తూ వస్తున్నారన్నారు.
పనికిమాలిన ప్రతిపక్షాలు, చంద్రబాబుకు ఏ కార్యక్రమం చేయడానికి పనిలేకుండా పోయిందన్నారు. ఉద్యోగుల వ్యవహారంలోనూ ప్రభుత్వం ఒక కమిటీని నియమించిందని, చర్చలు కూడా జరుగుతున్నాయన్నారు. ఉద్యోగ సంఘాలు కూడా రాజకీయ పార్టీలు ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయన్నారు. ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించుకోవాలన్న ఆలోచనకు ఉద్యోగ సంఘాలు వచ్చాయన్నారు. జిల్లాల ప్రకటనతో ఉద్యోగుల వ్యవహారం పక్కకు వెళ్ళిపోయిందని చంద్రబాబు అనుకుంటున్నాడా అని ప్రశ్నించారు. ఉద్యోగాల్లో చేరి సమ్మెను విరమించుకున్నారా అని అన్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 12 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా పనిచేశానని, 40 ఏళ్ళ సీనియార్టీ ఉందని చెప్పే చంద్రబాబుకు గ్రామ సచివాలయాలను తీసుకురావాలన్న ఆలోచన ఎప్పుడైనా చేశారా అని అన్నారు.రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు సేవలందించాలన్న ప్రయత్నం చేశాడా అని అన్నారు.
అధికారాన్ని వికేంద్రీకరించేందుకు మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని చూడలేదన్నారు. అభివృద్ధిని ఒకేచోట కేంద్రీకృతం చేస్తే మిగతా ప్రాంతాల ప్రజలు నష్టపోతారని, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం చర్యలు ఎందుకు తీసుకోలేదని అన్నారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం ద్వారా మెరుగైన పరిపాలన ఎందుకు అందించలేదని విమర్శించారు. చంద్రబాబు ఏం చెప్పాడో సోము వీర్రాజు కూడా అదే చెబుతాడన్నారు. బీజేపీ అనేది టీడీపీకి బీ టీంగా పనిచేస్తుందన్నారు. ఎజెండాను చంద్రబాబు రూపొందిస్తాడని, సోము వీర్రాజు అమలు చేస్తాడన్నారు. బీజేపీని టీడీపీకి సోము వీర్రాజు అద్దెకు ఇచ్చాడన్నారు. గోవాలో బీజేపీ ప్రభుత్వం ఉందని, అక్కడ డ్యాన్స్లు వేయడం నేర్పాడా అని అన్నారు. విష సంస్కృతి అయినపుడు గోవాలో కేసినోను బ్యాన్ చేయమని ఎందుకు అడగడం లేదన్నారు. హైదరాబాద్లో ఒక పెద్దాయన బెల్లీ, క్యాబరే డ్యాన్స్లు పెట్టి టికెట్లు అమ్ముకుని బతుకుతున్నాడు కదా అని అన్నారు. 1200 ఎకరాల్లో కట్టిన ఫిలిం సిటీలో షూటింగ్లు ఎలాగో జరగడం లేదని, ఇప్పటికీ డ్యాన్స్ లను నిర్వహిస్తున్నారని చెప్పారు. లోపలకు వెళ్ళి డ్యాన్స్లు చూడాలంటే ఫోన్లు బయట పెట్టాల్సి ఉంటుందన్నారు. గుడివాడలో మూడు రోజులు జరగడం వల్ల రాష్ట్రం భ్రష్టు పట్టిపోయిందని చెప్పే బీజేపీ నేతలు హైదరాబాద్లో కూడా క్యాబరే, బెల్లీ డ్యాన్స్లు ఆపాలని సూచించారు. సోము వీర్రాజును మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, మంచి వ్యక్తి దొరికితే మార్చేస్తారని మంత్రి కొడాలి నాని అన్నారు.