•చిట్ ఫండ్ కంపెనీల మోసాలను అరికట్టడం, చందాదారులు నష్టపోకుండా సహకరించడమే ప్రధాన లక్ష్యం
•చిట్ ఫండ్ కంపెనీలను సమర్థవంతంగా నియంత్రించడం, వ్యాపారంలో పారదర్శకత తీసుకురావడం
•చిట్ ఫండ్ కంపెనీల నుండి ఎదుర్కొనే ఎటు వంటి సమస్యలైనా ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేసుకునే అవకాశం
రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు & స్టాప్స్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు
అమరావతి, మే 15 : చందాదారుల భద్రతే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలో నేటి నుండి “ఇ-చిట్స్” సేవలను అమల్లోకి తెస్తున్నట్లు రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాప్స్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు తెలిపారు. సంబందిత నూతన ఎలక్ట్రానిక్ అప్లికేషన్ ను వెలగపూడి ఆంద్రప్రదేశ్ సచివాలయంలో మంత్రి సోమవారం లాంఛనప్రాయంగా ప్రారంభించారు.
ఈ సందర్బంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మట్లాడుతూ చిట్ ఫండ్ కంపెనీల మోసాలకు సంబంధించి ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా పలు కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు ఇటు వంటి మోసాలకు గురికాకుండా చూసేందుకై ప్రభుత్వం చిత్తశుద్దితో రాష్ట్రంలో ఇ-చిట్స్ సేవలను అమల్లోకి తేవడం జరిగిందన్నారు. రాష్ట్ర రిజిస్ట్రేషన్లు మరియు స్టాప్స్ శాఖ రూపొందించిన ఈ నూతన ఎలక్ట్రానిక్ విధానాన్ని రాష్ట్రంలోని చిట్ ఫండ్ కంపెనీలు అన్ని ఇకపై తప్పని సరిగా అనుసరించాల్సి ఉందన్నారు.
చిట్ ఫండ్ లావాదేవీలను ఆన్లైన్ ద్వారానే నిర్వహించాల్సి ఉందని, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కూడా ఆన్లైన్ విధానములోనే సంబంధిత లావాదేవీలను పరిశీలించి ఆమోదించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ఈ ఇ-చిట్స్” విధానం వల్ల చిట్ ఫండ్ కంపెనీల మోసాలను అరికట్టడమే కాకుండా చందాదారులు నష్టపోకుండా సహకరిస్తుందన్నారు. చిట్ ఫండ్ కంపెనీలను సమర్థవంతంగా నియంత్రించడంలోనూ వ్యాపారంలో పారదర్శకత తీసుకురావడంలోనూ ఈ నూతన విధానం ఎంతగానో దోహదపడుతుందనే ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు.
చిట్ ఫండ్ కంపెనీల విషయంలో చందాదారులు కూడా ఎంతో అప్రమత్తంగా ఉంటూ తమ ప్రాంతాలలో నడుపబడే చిట్ ఫండ్ కంపెనీలు రిజిస్టర్డు అయినవా? లేదా? అనే విషయాన్ని ముందుగా ఈ “ఇ-చిట్స్” అప్లికేషన్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉండే అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ వారిని కూడా ఈ విషయంలో సంప్రదించవచ్చన్నారు. అదే విధంగా చిట్ ఫండ్ కంపెనీల నుండి ఎదుర్కొనే ఎటు వంటి సమస్యలలైనా ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేసుకునే అవకాశం మరియు ఆయా సమస్యలను సత్వరమే అధికారులు పరిష్కరించే అవకాశం ఈ నూతన విదానం ద్వారా అమల్లోకి వచ్చిందన్నారు. మరిన్ని వివరముల కొరకు https://echits.rs.ap.gov.in అనే వెబ్ సైట్ నుండి తెలుసుకోవచ్చని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర రిజిస్ట్రేషన్స్ మరియు స్టాప్స్ శాఖ కమిషనర్ మరియు ఇన్స్పెక్టర్ జనరల్ వి.రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.