Suryaa.co.in

Andhra Pradesh

ప్ర‌తి ఒక్క‌రు 3 మొక్క‌లు నాటాలి

  • వ‌న‌మ‌హోత్స‌వ వేడుక‌ల్లో పిలుపునిచ్చిన మంత్రి నారాయ‌ణ‌
  • కొత్తూరు వ‌ద్ద ఉన్న నగర వనంలో అట్ట‌హాసంగా ఉత్సవం
  • మనిషి మనుగడకు, జీవనానికి నీటి ఆవశ్యకత ముఖ్యం
  • చెట్లను నరికేయడం వలన ఏర్ప‌డుతున్న నీటి కొరత
  • ఇండియాలో 21.7 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 23 శాతం, నెల్లూరులో 21.4 మాత్రమే గ్రీన‌రీ
  • రాష్ట్రంలో పార్కులు, గ్రీనరి అభివృధికి కూటమి ప్రభుత్వం కృషి

నెల్లూరు: ప్ర‌తి ఒక్క‌రు మూడు మొక్క‌లు నాటి ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించాల్సిన బాధ్య‌త ఎంతైనా ఉంద‌ని ఆంధ్ర రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని కొత్తూరులో నగరవనంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో శుక్రవారం అట్ట‌హాసంగా వనమహోత్సవ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ముఖ్యఅతిథిగా మంత్రి నారాయ‌ణ‌ హాజర‌య్యారు. భారీగా హాజరైన విద్యార్థినీ, విద్యార్థులతో క‌లిసి వనమహోత్సవంలో భాగంగా నగరవనంలో భూమిపూజ చేసి మంత్రి మొక్కలు నాటారు.

అనంత‌రం నగరవనం ఆర్ట్ గ్యాలరిని ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌లిసి మంత్రి తిలకించారు. న‌గ‌ర‌వ‌నం అంతా క‌లియ తిరుగుతూ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. న‌గ‌ర వ‌నానికి విచ్చేసిన పిల్ల‌ల‌తో, విద్యార్థుల‌తో మంత్రి నారాయ‌ణ కాసేపు స‌ర‌దా స‌ర‌దాగా గ‌డిపారు. పిల్ల‌ల‌తో క‌లిసి మంత్రి ఆట‌లాడారు, విద్యార్థుల‌తో క‌లిసి మంత్రి నారాయ‌ణ భుజించారు. మంత్రి త‌మ‌తో స‌ర‌దాగా ఉండ‌డంతో అక్క‌డికి విచ్చేసిన విద్యార్థుల ఆనందానికి హ‌ద్దులు లేకుండాపోయింది. మంత్రి నారాయ‌ణ‌తో క‌లిసి సెల్ఫీలు దిగేందుకు పిల్లలు, పెద్ద‌లు పోటీ ప‌డ్డారు. విద్యార్థుల కోరిక మేర‌కు మంత్రి నారాయ‌ణ వారంద‌రికి ఇచ్చిన టోఫీల‌పై ఆటోగ్రాఫ్ చేశారు. అనంత‌రం ఏర్పాటు చేసిన స‌మావేశంలో మంత్రి పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి నారాయ‌ణ మాట్లాడుతూ 2014 నుంచి 2019 స‌మ‌యంలో న‌గ‌ర వ‌నాన్ని తెలుగుదేశంప్ర‌భుత్వంలోనే ప్రారంభించామ‌న్నారు. మ‌నిషి బ‌త‌కాలంటే నీరు, చెట్లు ఎంతో అవ‌స‌ర‌మ‌ని తెలిపారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు చెట్ల పాత్ర చాలా ఉంద‌న్నారు. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌ కల్యాణ్ పిలుపు మేర‌కు వ‌న‌మ‌హోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని అట్ట‌హాసంగా నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు. ఇండియాలో 21.7 శాతం, ఆంధ్ర‌లో 23 శాతం, నెల్లూరులో 25 శాతం గ్రీన‌రీ ఉంద‌న్నారు.

నెల్లూరు జిల్లాలో గ్రీన‌రీని పెంచుకునేందుకు కృషి చేయాల‌న్నారు. జిల్లాలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రు మూడు మొక్క‌లు నాటాల‌ని పిలుపునిచ్చారు. దాని ద్వారా మ‌నం అనుకున్న ల‌క్ష్యాన్ని చేరుకోవ‌చ్చ‌ని తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఉన్న ఆరు న‌గ‌ర వ‌నాల డెవ‌ల‌ప్‌మెంట్‌కు క‌లెక్ట‌ర్‌తో రివ్యూ చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు. అమ‌రావ‌తి రాజ‌ధానిలో ఆరు ప‌బ్లిక్ పార్కులు ఉన్నాయ‌ని, వాటి డెవ‌ల‌ప్‌మెంట్‌కు కూడా వేగ‌వంతంగా ప‌నులు చేప‌డుతున్నామ‌ని చెప్పారు. నెల్లూరులో ఉండే న‌గ‌ర వ‌నాలు రాష్ట్రంలో నెంబ‌ర్ ఒన్‌గా ఉండేలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తామ‌ని మంత్రి నారాయ‌ణ తెలిపారు.

అనంత‌రం వనమహోత్సవం కార్యక్రమంలో అధికారులు, పిల్లలతో ప్రతిజ్ఞ చేయించిన అనంత‌రం రూరల్ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది మాట్లాడారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో వనమహోత్సవం అట్టహాసంగా జరిగింద‌న్నారు. నగరవనం 330 ఎకరాల్లో గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రి నారాయణ ఆదేశాలతో ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. 2019 ప్రభుత్వంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నగరవనం నిర్లక్ష్యానికి గురైందని మండిప‌డ్డారు. మ‌ళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రిగా, నారాయణ మంత్రిగా వంద శాతం పనులు పూర్తి అయ్యి అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. మరో వారం రోజుల్లో మంత్రి నారాయణ చేతుల మీదుగా నగరవనం ప్రారంభోత్సవానికి నోచుకోనుందన్నారు.

త‌ద‌నంత‌రం సర్వేపల్లి శాసనసభ్యడు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో మంత్రిగా నారాయణ పార్కులు అభివృద్ధి చేశార‌ని కొనియాడారు. కాలుష్యం వలన ప్రపంచం నాశనం అవుతుందని, చెట్లు నరికివేత వినాసానానికి మానవాళి కారణమ‌న్నారు. ప్రజలు మొక్క‌లు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంద‌ని తెలిపారు. లేఅవుట్ల‌ పేరుతో చెట్లు విచ్చలవిడిగా నరికేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. లేఅవుట్లు వేస్తే పది పర్సెంట్ చెట్లు నాటే నిబంధన తీసుకురావాలని సోమిరెడ్డి కోరారు. మానవాళి భవిష్యత్ కోసం చెట్లు నాటవలసిన బాధ్యత ఉందని పిలుపునిచ్చారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ ఆనంద్‌తో పాటు ప‌లువురు అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు మాట్లాడారు.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ వనమహోత్సవ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, సర్వేపల్లి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, డీఎఫ్ వో చంద్రశేఖర్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE