Suryaa.co.in

Andhra Pradesh

పోరాడమని గతంలో చెప్పింది జగన్ మోహన్ రెడ్డే

-ఉపాధ్యాయులపై ఈ వేధింపులు ఎందుకు?
-హక్కుల కోసం పోరాడమే వారు చేసిన తప్పా?
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

ఉపాధ్యాయులను ప్రభుత్వం అనవసరంగా వేధిస్తోందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు. ఉపాధ్యాయులను వేధించడం ఆపాలని… వారి జీవితాలతో ఆడుకోవద్దని ఆయన కోరారు. బుధవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఉపాధ్యాయులకు ఈ వేధింపులు ఏమిట్రా అంటే, గతంలో ఉపాధ్యాయులు తమ హక్కుల కోసం పోరాడారని, ఉపాధ్యాయుల ఉద్యమం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు రుచించలేదని చెప్పారు.

ప్రతిపక్ష నేతగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే హక్కుల కోసం పోరాడమని చెప్పారన్న ఆయన, ఉపాధ్యాయులకు రెచ్చగొట్టి వదిలేసింది జగన్మోహన్ రెడ్డే నని, ఇస్తానని చెప్పినవి ఇవ్వకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. ఉద్యోగులను తీసేశారని, కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టలేదని విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయమంటే, ఇప్పుడు వేధింపులకు గురి చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఎనిమిది ఏళ్లకు ఒకసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉపాధ్యాయుల బదిలీలు ఉండేవని, కానీ ఇప్పుడు ఓ చోట ఐదేళ్ల సమయం పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులను బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలిసిందన్నారు.

అదే జరిగితే రాష్ట్రంలో దాదాపు 70 శాతం మంది ఉపాధ్యాయుల బదిలీలు జరగడం ఖాయమన్నారు. ఉపాధ్యాయుల బదిలీ వెనుక కూడా కుట్ర కోణం ఉన్నదని రఘురామకృష్ణం రాజు తెలిపారు. 8 ఏళ్లుగా ఒకే చోట పని చేస్తున్న ఉపాధ్యాయులకు స్థానికులతో సత్సంబంధాలు ఉంటాయని, దీనితో తమకు జరిగిన అన్యాయాన్ని వారు చెప్పుకుంటే, తమకు ఎక్కడ ఓట్లు దూరమవుతాయో నన్న ఆందోళనతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నదని చెప్పారు.

ఒకవేళ ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తే, ఎన్నికల సమయం లో తమ విధులకు రెండు రోజులు సెలవులు పెట్టి, తమకు సన్నిహితులు ఉన్న గ్రామాలకు వెళ్లి, తమకు అన్యాయం జరిగిందని చెబితే పార్టీ పరిస్థితి ఏమిటని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. పార్టీ సభ్యుడిగా, పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై కూడా ఉన్నదన్న ఆయన, మన చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్ముతున్నారని అనుకుంటున్నామని, కానీ ప్రజలు ఎవ్వరు నమ్మడం లేదన్నది మాత్రం పచ్చి నిజమని అన్నారు. తాను మొదటి నుంచి ఇదే విషయాన్ని చెబుతున్నానని, పార్టీని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో మరొకసారి పార్టీ నాయకత్వానికి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తున్నానని తెలిపారు.

ఫోన్లు ఇవ్వకుండా… కొనుక్కోమనడం విడ్డూరం
చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారని, ఈ విధానం ఉపాధ్యాయులకు రుచించలేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. బయోమెట్రిక్ విధానం ద్వారా తమను అవమానిస్తున్నారని వారు భావించారన్న ఆయన, అలిగి కోపగించుకున్న ఉపాధ్యాయులు ఎన్నికల్లో దాని ప్రభావాన్ని చూపెట్టారన్నారు. అయినా పొరపాట్లు చేయడం మానవ సహజమని, దాన్ని సరిదిద్దుకోవడమే దైవత్వం అనిపించుకుంటుందన్నారు.. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ విద్యార్థి అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన అటెండెన్స్ యాప్ విధానం విస్మయాన్ని కలిగిస్తుందని చెప్పారు.

ఉదయాన్నే 9 గంటల లోపు పాఠశాలకు చేరిన ఉపాధ్యా యులు తమ స్మార్ట్ ఫోన్లో ప్రభుత్వం నిర్దేశించిన యాప్ డౌన్లోడ్ చేసుకొని తరగతి గదికి చేరిన వెంటనే తాము తరగతి గదికి హాజరయ్యామన్న ఆధారంతో కూడిన ఫోటోలను తీసుకొని అటెండెన్స్ యాప్ లో అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నారు. అంతే కాకుండా తరగతికి హాజరైన విద్యార్థుల ఫోటోలు కూడా తీసి యాప్ లో అప్ లోడ్ చేయాలని చెప్పారు. ఒకవేళ ఒకరిద్దరు విద్యార్థులు ఆలస్యంగా తరగతి గదికి హాజరైతే వారికి ఆరోజు జగనన్న గోరుముద్ద కాస్తా, జగనన్న తొడపాశంగా మారుతుందన్నారు.

ఇక ఎక్కువ రోజులపాటు తరగతికి గైర్హాజరైన విద్యార్థులకు అమ్మఒడి కాస్తా కత్తెర పథకం గా మారి, వారి పట్ల శాపంగా పరిణమిస్తుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. బయోమెట్రిక్ కాదని ఉపాధ్యాయులకు నూతన అటెండెన్స్ యాప్ విధానాన్ని ప్రవేశపెట్టిముందు, వారికి స్మార్ట్ ఫోన్ లను ప్రభుత్వమే కొనుగోలు చేసి, యాప్ ను డౌన్లోడ్ చేసి ఇచ్చి ఉంటే బాగుండేదన్న వాదనలు వినిపిస్తున్నాయని ఆయన అన్నారు. అయితే ఇదే విషయమై తాను తనకు తెలిసిన ఉపాధ్యాయులతో మాట్లాడితే… తరగతి గదిలో ఫోటోలతోనే ప్రభుత్వం సరిపెట్టేలా లేదని, మధ్యాహ్న భోజనం తో పాటు, మరుగుదొడ్ల ఫోటోలను కూడా తీసి యాప్లో అప్లోడ్ చేయాల్సిన దుస్థితి తమకు ముందున్నదని వారు తనతో చెప్పారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

అయితే తమలో చాలామందికి స్మార్ట్ ఫోన్ ను ఎలా వినియోగించాలో కూడా తెలియదని ఉపాధ్యాయులు పేర్కొన్నారని వెల్లడించారు. ఇక ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన అని చెబుతుందని, కానీ మెజారిటీ ఉపాధ్యాయులు ఇప్పటికీ తెలుగు మాధ్యమంలోనే పాఠ్యాంశాలను బోధిస్తున్నామని తెలిపారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుగు భాష అంటే ఎందుకంత ద్వేషము తమకు అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ఇలాంటి నూతన విధానం ద్వారా ఉపాధ్యాయులను అవమానించడం కంటే, అనునయినించాలని రఘురామ సూచించారు.

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎంతో అనుభవజ్ఞుడని, సమయస్ఫూర్తి ఉన్న వ్యక్తిని ఆయన ఉపాధ్యాయుల సమస్యలను చక్కగా పరిష్కరించగలడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన రఘురామకృష్ణంరాజు, ఆయన్ని కూడా ఉత్సవ విగ్రహంగా ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారని విమర్శించారు. బయోమెట్రిక్ కాదని నూతన విధానాన్ని అమలు చేయాలని అనుకుంటే ఉపాధ్యాయులకు స్మార్ట్ ఫోన్లు కొనిచ్చి, కంప్యూటర్ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని, దానికి కంప్యూటర్ పరిజ్ఞానం పెద్దగా లేని సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డిని పంపించాలని ఎద్దేవా చేశారు. ఉపాధ్యాయులు స్మార్ట్ ఫోన్లలో తమ ఫోటోలు తాము తీసుకొని యాప్ లో అప్లోడ్ చేసే బదులు, గ్రామ వాలంటీర్ల ద్వారా ఫోటోలు తీసి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

కార్తీక్, దీప మళ్లీ కలిసినప్పుడే హామీల అమలు
సిపిఎస్ రద్దు … ఉద్యోగుల బకాయి జీతాలు ఎప్పుడు వస్తాయంటే, కార్తీకదీపం సీరియల్ లో కార్తీక్, దీప లు కలుసుకున్నప్పుడు వస్తాయని గతంలో అనుకునేవారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 31 లక్షల గృహాల హామీ, 16 మెడికల్ కాలేజీలు, పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు పాలిటెక్నిక్ కాలేజ్, మండలానికి ఒక బాలికల ఇంటర్మీడియట్ కాలేజీ, ఏడు గ్రామాలకు కలిపి ఒక ఫ్యామిలీ డాక్టర్, ప్రతి గ్రామానికి గుంతలు లేని రోడ్లంటూ ఇచ్చిన హామీలు ఎప్పటికీ అమలవుతాయి అంటే, కార్తీకదీపం సీరియల్ లో మళ్లీ కార్తీక్, దీపలు ఒక్కటైనప్పుడు అంటూ ప్రజలు సెటైర్లు వేస్తున్నారని ఆయన అన్నారు.
ఇప్పటికే 1300 ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న కార్తీకదీపం సీరియల్, ఈ హామీలు నెరవేరాలంటే మరొక 1300 ఎపిసోడ్లను పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. జనం అనుకునే మాట నిజం చేయకుండా, జగన్మోహన్ రెడ్డి కానీ ఇచ్చిన హామీలపై మనసుపెట్టి నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

అనువాదకున్ని పెట్టుకోండి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి జాతీయ ప్రధాన కార్యదర్శి ఉండడంతో, జాతీయ పార్టీ యే నని, దానితో గతంలో రాజీవ్ గాంధీ, ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాలకు తెలుగు అనువాదకులుగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, పురందరేశ్వరి గారు వ్యవహరించారని… జగన్మోహన్ రెడ్డి కూడా తన ప్రసంగాన్ని తెలుగులో అనువదించడానికి ఒక అనువాదకున్ని పెట్టుకోవాలని రఘురామకృష్ణంరాజు సూచించారు.
ఎందుకంటే… స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన ప్రసంగించిన తీరు విడ్డూరంగా ఉన్నదన్నారు. ఉటంకించారు బదులుగా ఉడికించారని, స్వేదం అనే పదాన్ని స్వేజ్యం, మహా ను యోధులు, పైరు పచ్చలు, సామాజిక అభద్రత, గోధుమను గోదామా వంటి పదప్రయోగాలతో తెలుగు భాషను ఖూనీ చేసే చేశారన్నారు. ఇక వజ్రోత్సవం అని కూడా పలకకుండా వజ్జోత్సవం అనడం ఏమిటో అర్థం కాలేదని విస్మయం వ్యక్తం చేశారు. తెలుగు భాషను శాశ్వతంగా నిర్మూలించాలనే కుట్రతో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి తెలుగులో మాట్లాడి, తెలుగు భాషను ఖూనీ చేయడం అవసరమా అంటూ నిలదీశారు.

జగన్మోహన్ రెడ్డి పదప్రయోగాలన్నీ ఏ డిక్షనరీలో వెతికినా దొరకవని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పదప్రయోగాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారని చెప్పారు. ఇక రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పది సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, దీనితో తప్పు చేయాలనుకునే పోలీసులు తప్పులు చేయలేరంటూ సాక్షి దినపత్రికలో గొప్పగా రాసుకున్నారని ఎద్దేవా చేశారు. మరి గత ఏడాది మే 14 వ తేదీన ముఖ్యమంత్రి ప్రేరేపితుడైన పి వి సునీల్ కుమార్ తనను ఎత్తుకెళ్లి కాళ్లు కట్టేసి కొట్టినప్పుడు, అంతకుముందు అక్కడ ఉన్న సీసీ కెమెరాలను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు.

అణగారిన అనచబడుతున్న వర్గాల సమాహారమే మహాసేన
మహాసేన మీడియా ఐదవ వార్షికోత్సవానికి తనను ముఖ్యఅతిథిగా సోదరుడు రాజేష్ మహాసేన ఆహ్వానించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. అయితే తనకు ఆంధ్ర వీసా లేనందువల్ల, ఒకవేళ అక్కడికి వెళ్తే కేసులు పెట్టే అవకాశం ఉండడంతో తాను ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నానని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం తనపై బనాయించిన అక్రమ కేసుల వల్ల కోర్టుల చుట్టూ తిరుగుతున్నానని చెప్పారు.

మహాసేన మీడియా ఏ ఒక్క కులానికో సంబంధించినది కాదని, అణగారిన, ప్రభుత్వం చేత అణిచివేయబడుతున్న కులాల సమూహారమే మహాసేన మీడియా అన్నారు. మహాసేన రాజేష్ ను కాపాడు కోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉన్నదని రఘురామకృష్ణంరాజు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన పై ఎన్నో కుట్రలను చేస్తున్నదని, రోడ్డు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు.

LEAVE A RESPONSE