హైదరాబాద్: కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అంటారు కానీ, కొందరి విషయంలో మాత్రం ఈడీ ఆఫీసు మెట్లు పాత జ్ఞాపకాలను నెమరువేసుకునేలా చేస్తాయి. గతంలో ‘ఈడీ 1.0’ వెర్షన్లో ఏ1గా జగన్, ఏ2గా విజయసాయిరెడ్డి జోడీగా వెళ్లి దర్యాప్తు సంస్థల ఆతిథ్యం స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీన్ కట్ చేస్తే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త వెర్షన్ ‘ఈడీ 2.0’ మొదలైంది. ఈసారి కూడా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికే తొలి అవకాశం దక్కడం విశేషం. రూ. 3,500 కోట్ల ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా, గురువారం హైదరాబాద్‌లోని ఈడీ జోనల్ కార్యాలయానికి ఆయన ‘ముఖ్య అతిథి’గా విచ్చేశారు.
పాత పరిచయాలు.. కొత్త ప్రశ్నలు! గతంలో క్లాస్ రూమ్ తరహాలో ఈడీ ఆఫీసులో గంటల తరబడి గడిపిన అనుభవం విజయసాయి రెడ్డికి ఉంది. అయితే అప్పట్లో అంశం వేరు, ఇప్పుడు కుంభకోణం రేంజ్ వేరు. 2019-2024 మధ్య ఏపీలో రాజ్యమేలిన ‘జే బ్రాండ్ విష మద్యం’ వెనుక ఉన్న అసలు కిక్కు ఏమిటో తెలుసుకోవాలని ఈడీ అధికారులు ఉత్సాహంగా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో తన ఇంట్లోనే డీల్స్ సెట్ చేసి, తన మాట మీద అప్పు ఇచ్చిన అల్లుడి అన్న అరబిందో శరత్‌చంద్రారెడ్డి నుండి తన వరకు సెగ తగలకుండా కాపాడుకోవడమే ఇప్పుడు ఆయన ముందున్న లక్ష్యం.
అన్నీ తానై వ్యవహరించిన సాయిరెడ్డి, ఇప్పుడు అదే మద్యం పాలసీలో జరిగిన మనీ లాండరింగ్ వ్యవహారాలపై పీఎంఎల్ఏ (ఫంళా) చట్టం కింద సమాధానాలు చెప్పుకోవాల్సి వస్తోంది. తనను ఇంకా విచారణకు పిలవకపోయినా, కింద స్థాయి నుండి నరుక్కు వస్తున్న ఈ లిక్కర్ కేసు సెగ జగన్‌కు గట్టిగానే తగులుతోంది. అందుకే, సహచర ఏ2 ఈడీ ముందుకు వెళ్లిన రోజే, జగన్ హుటాహుటిన తాడేపల్లికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ‘డైవర్షన్’ పాలిటిక్స్‌కు తెరలేపారు.
అసలైతే, ఈడీ వద్ద విజయసాయి రెడ్డి ఏం చెబుతున్నారు? ఆయన వైఖరి ఎలా ఉంది? అనే లైవ్ అప్డేట్స్ కోసం ఉత్కంఠతో యలహంక ప్యాలస్‌లో ఉండలేక ఆయన తాడేపల్లికి వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈయన తర్వాత ‘పుడింగి కొడుకు’, జగన్ ఆప్తమిత్రుడు పిల్ల పెద్దిరెడ్డి (మిధున్ రెడ్డి) రెండో అతిథిగా ఈడీ మెట్లు ఎక్కబోతున్నారని సమాచారం. మిధున్ రెడ్డికి ఇది తొలి ఆతిథ్యం కాబోతుండటంతో తాడేపల్లిలో ప్రస్తుతం ‘టెన్షన్ టెన్షన్’ వాతావరణం నెలకొంది.
గతంలో ఏ2గా ముద్రపడ్డ సాయిరెడ్డి, ఇప్పుడు ఈ మద్యం స్కాములో తన కోటరీని కాపాడుకునేందుకు జగన్ అండ్ గ్యాంగ్‌ను పట్టించే ‘అప్రూవర్’గా మారుతారా? లేక తన పాత అనుభవాన్ని వాడి ఈడీ ప్రశ్నలకు మస్కా కొట్టి తప్పించుకుంటారా? అన్నది తేలాల్సి ఉంది. మొత్తానికి ఈడీ గుమ్మం ఆయనకు కొత్తేమీ కాదు కానీ, ఈసారి తగిలిన మద్యం ‘ఘాటు’ మాత్రం మామూలుగా లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈడీ 2.0లో మరోసారి ఎ డ్యాష్(X) ముద్దాయిగా మిగిలిపోకుండా, లిక్కర్ స్కామ్ విచారణ మొదలవ్వగానే తన ‘క్రిమినల్ బ్రెయిన్’ వాడి జగన్‌కు ఝలక్ ఇచ్చి విజయసాయి రెడ్డి ఇప్పటికే పైచేయి సాధించారని చెప్పుకోవచ్చు. లేదంటే జగన్ ఓఎస్డీ నుండి తాడేపల్లి ముఠాలో కొందరు, భారతి డైరెక్టర్, చెవిరెడ్డి నుండి గ్యాంగ్ మొత్తం పదుల్లో చిప్పకూడు తినే వారు కాదు, బెయిల్ల కోసం తిరిగేవారు కాదు. విష మద్యం ముడుపులు స్వీకరించిన మూలవిరాట్ జగనుకు ముచ్చెమటలు పడుతున్నాయి, విజయసాయి రెడ్డి ఎదురుతిరగడంతో…!
_ చాకిరేవు