మైత్రి ప్లాంటేషన్ అండ్ హార్టికల్చర్ సంస్థపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేశారు. ఏపీలోని ఒంగోలు కేంద్రంగా రిజిస్టర్ అయిన ఈ కంపెనీ హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ భారీ ఎత్తున ఆస్తులను కూడగట్టినట్టు సమాచారం.
ఈ క్రమంలోనే ఈ సంస్థ మనీ ల్యాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు రాగా… ఈడీ అధికారులు మంగళవారం కంపెనీకి చెందిన పలు ప్రాంతాల్లోని కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా కంపెనీకి పెద్ద సంఖ్యలో స్థిరాస్తులు ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో కంపెనీకి చెందిన రూ.110 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశారు.
ఈడీ సీజ్ చేసిన ఆస్తుల్లో ఏకంగా 210 స్థిరాస్తులున్నాయి. వీటిలో మైత్రి రియాలిటీ, నక్షత్ర బిల్డర్స్, మైత్రి ప్రమోటర్లు అయిన లక్కు మాధవ రెడ్డి, లక్కు కొండారెడ్డి, లక్కు మాల్యాద్రి రెడ్డి, కొలకపూడి బ్రహ్మారెడ్డిలకు చెందిన ఆస్తులున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
ED has provisionally attached 210 immovable properties worth Rs. 110 Crore belonging to M/s. Maithri Plantation & Horticulture Pvt. Ltd. (M/s. MPHPL) and others under PMLA, 2002 in a Ponzi scam case.
— ED (@dir_ed) June 7, 2022