– అహంకారం వర్సెస్ ఆత్మాభిమానం
– జగన్ సర్కారుపై వెల్లువెత్తిన ప్రజావ్యతిరేకత
– ఒక్క హైదరాబాద్ నుంచే 10 లక్షల మంది ఓటర్లు రాక
– బెంగళూరు, చెన్నై నుంచి మరో 6 లక్షల మంది ఓటర్లు
– జగన్‌పై కసితోనే ఏపీకి వచ్చిన ఆ ఓటర్లు
– దానినే ధృవీకరించిన టీవీ9
– ఉద్యోగుల ఓట్లలో 90 శాతం కూటమికే
– మధ్య, ఎగువ మధ్య తరగతి ఓటు కూటమికే
– కూటమి వైపు మొగ్గిన కమ్మ-కాపు-బ్రాహ్మణ-వైశ్య-క్షత్రియ వర్గాలు
– బీసీలో పాత ఓటర్లు కూటమి వైపు.. కొత్త ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు
– ఎస్సీ-ఎసీ-మైనారిటీలలో వైసీపీ ఓట్లు చీల్చిన కాంగ్రెస్
– మహిళల ఓట్లలో భారీ చీలిక
– టీడీపీకి బహిరంగ మద్దతు ప్రకటించిన ముస్లిం సంస్థలు
– గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలులో రెడ్ల ఓట్లలో చీలిక
– ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజల్లో వెల్లువెత్తిన తిరుగుబాటు
– పోలింగ్ రోజున పేలిన ల్యాండ్ టైట్లింగ్, పట్టాపుస్తకాలపై జగన్ ఫొటో బాంబు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ప్రతి ఏటా ఊళ్లలో జాతర్లు జరుగుతుంటాయి. దానికి ఎక్కడెక్కడో నివసించే ఆ ఊరివాళ్లంతా కట్టకట్టుకుని వచ్చి, ఆ సంబరాల్లో పాల్గొంటారు. మందు-విందుతో చిల్లయి, మళ్లీ వెళ్లిపోతుంటారు. ఇది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నదే. అయితే రెండు రోజుల క్రితం ఏపీలో, అలాంటి జాతర దృశ్యాలు, పోలింగ్ సందర్భంలో దర్శించాం. అదేదో తమ ఊరి తిరనాళ్ల లెక్క, లక్షలమంది తరలివెళ్లి ఓటుకు పోటెత్తారు.
హైదరాబాద్ నుంచి దాదాపు 10 లక్షలు, బెంగళూరు-చెన్నై నుంచి మరో 6 లక్షల మంది ఓటర్లు జనసునామీలా తరలివచ్చి, ఓటేసిన దృశ్యం చూసిన తర్వాత కూడా.. ఇంకా ఏపీలో ఎవరు గెలుస్తారని ప్రశ్నించిన వాడు, అమాయకుడి కింద లెక్క. కావాలంటే జగన్ జపం చేసే టీవీ9 ఏం చెప్పిందో చూడండి. పరాయి రాష్ట్రాల నుంచి తరలివచ్చిన ఓటర్లలో 98 శాతం టీడీపీకే ఓటేశారని సెలవిచ్చింది. అంతలావు వైసీపీ మిత్రమీడియానే.. ఆ వచ్చిన వాళ్లంతా టీడీపీకే ఓటేశారని ధృవీకరించిన తర్వాత, ఇక దానిపై చర్చ వృధా. వాదన కంఠశోష, వృషణాయాసం!
అసలు అన్ని లక్షలమంది చీమలపుట్టల్లా, ఆంధ్రా వైపు ఎందుకు కదిలారన్నదే చర్చించాల్సిన అంశం. హైదరాబాద్‌లో ఓటు ఉన్న వాళ్లు కూడా, అక్కడ ఓటు వేయకుండా.. అంత ఎండలో, రవాణా సౌకర్యం లేకపోయినా ఏది దొరికినా దానిలో దానిని అందుకుని, చిక్కినబస్సు చిక్కినట్లు ఏపీ వైపు ఎందుకు వెళ్లారన్నది మరో ప్రశ్న. జగన్ ఐదేళ్ల పాలనలో డబ్బు పంచడం తప్ప, ఉత్పత్తి లేదు.
ఒక్క పరిశ్రమ వచ్చింది లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాల్లేవు. వ్యవసాయం పడుకుంది. భవన నిర్మాణరంగం కుదేలయింది. రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది. వ్యాపారాలకు గ్యారంటీ లేదు. వచ్చిందల్లా 5 వేల రూపాయల వాలంటీరు, మందు షాపులో ఉద్యోగాలు. కొన్ని సచివాలయ ఉద్యోగాలు మాత్రమే. అప్పటికి అదే ఎక్కువన్నది వైకాపేయుల ప్రచారం.
ఫలితంగా వారందరికీ ప్రత్యామ్యాయం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. ఇంకా అనేకం. ఇంకొందరు వలస పక్షులకు దుబాయ్, సింగపూర్, అమెరికా, కెనడా ఆశ్రయం ఇచ్చింది. ఎవరి స్థాయిలో వారికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ వేదన-రోదనకు కులాలు లేవు. మతాలు లేవు. ప్రాంతాలు లేవు. అంతా జగన్ బాధితులే. ఆయన సృష్టించిన అంధకారంలోని బిడ్డలే. ఉపాథి లేక ఉద్యోగాలు రాక చెల్లాచెదురయిన అనాధ ప్రేతలే.
అందుకే చంద్రబాబు సీఎం అయితే కొత్త పరిశ్రమలు వస్తాయని వారి ఆశ. కూలీలకు చేతినిండా పనిదొరుకుతుందని ఆశ. తమకు ఉద్యోగాలొస్తాయన్న నమ్మకం. ఎలాగైనా బతికేయచ్చన్న ధీమా. ఆ ధీమాతోనే.. జగన్ ఆ కసితోనే.. అన్ని లక్షల మంది ఆంధ్రాకు తరలివెళ్లి ఓటు కోసం పోటెత్తారు. వారిలో కమ్మోరి సంఖ్య తక్కువైతే, మిగిలిన కులాల వారే అధికం.
కావాలంటే తాజాగా జగన్ జపం చేసే టీవీ9లో, జగద్విఖ్యాత పాత్రికేయుడు రజనీకాంత్ చేసిన విశ్లేషణ చూడాల్సిందే. ఇతర రాష్ట్రాల నుంచి తరలివెళ్లిన వారిలో 98 శాతం టీడీపీకి ఓటు వేశారన్నది, ఆ చానెల్ బృందం చేసి తెలుసుకున్న పరిశోధనట. ఏపీకి అన్ని లక్షల మంది, ఓటు కోసం ఎందుకు వెళ్లారో ఇంకా అర్ధం కాలేదా?
ఇక రాష్ట్రంలోని అగ్రకులాలన్నీ జగన్‌కు దాదాపు వ్యతిరేకంగానే ఓటేశాయి. విశాఖ, గుంటూరు, ప్రొద్దుటూరు, విజయవాడలో నివసించే ఉత్తరాది ఓటర్లు కూడా, బీజేపీ మీద ప్రేమతో కూటమి వైపు మొగ్గిన పరిస్థితి. చివరాఖరకు రెడ్లలో సింహభాగం, వారినే అనుసరించారంటే ఆశ్చరం కాదు. వాలంటీర్ల వ్యవస్థతో గ్రామాల్లో, రెడ్ల గౌరవాన్ని దెబ్బతీసిన ఏకైక సీఎంగా వారి పాలిట జగన్ అవతరించారు.
అలాగని రాయలసీమలో రెడ్లు, గంపగుత్తగా వైసీపీకి ఓటేసిన పరిస్థితి కనిపించలేదు. ప్రతి గ్రామంలోనూ ఉండే రెండు రెడ్డి వర్గాలలో, ఒక వర్గం వైసీపీ-మరో వర్గం టీడీపీ వైపు మోహరించడాన్ని విస్మరించకూడదు. నెల్లూరు-కర్నూలు-కడప జిల్లాల్లో రెండు పార్టీలోనే రెడ్లే నేతలు. ఆ లెక్కన వైసీపీకి కొద్దిగా మొగ్గు ఉండవచ్చేమో గానీ, రెడ్డి సామాజికవర్గం ఏకపక్షంగా వైసీపీ వైపు లేదన్నది సుస్పష్టం. ఆమాటకొస్తే రాజధాని ప్రాంతమైన మంగళగిరి నియోజకవర్గంలో, రాజధానిని ముంచిన వైసీపీపై కసితో రెడ్లు టీడీపీ వైపు ఏకపక్షంగా నిలిచారు.
ఎస్సీ, ఎస్టీ,క్రైస్తవులు, ముస్లిం వైఖరి విచిత్రం. షర్మిల పీసీసీ చీఫ్‌గా వచ్చిన తర్వాత ఆ వర్గాల వైఖరి మారిపోయింది. బీజేపీతో జట్టు కట్టిన టీడీపీ-జనసేన, ఇప్పటివరకూ ఆ పార్టీతో అంటకాగిన వైకాపాకు ఓటు వేయడం ఇష్టంలేని క్రైస్తవ-ముస్లిం వర్గాలు, విచిత్రంగా కాంగ్రెస్ వైపు చూసిన పరిస్థితి.
ఇందులో ఇంకో ట్విస్టు. జాతీయ ముస్లిం సంస్థల నేతలు స్వయంగా బాబును కలిసి, టీడీపీకి మాత్రమే మద్దతు ప్రకటించాయి. బీజేపీతో కలసినా ఏపీలో ముస్లింలు, టీడీపీ గొడుగు కింద భద్రంగా ఉంటాయని ప్రకటించడాన్ని విస్మరించకూడదు. అయితే కొంత శాతం పాతతరం ముస్లింలు, వైఎస్‌పై అభిమానంతో వైసీపీకీ ఓటు వేశారనడం కాదనలేని నిజం. ఇక బీసీలలో పాతతరం వారంతా కూటమికి జై కొడితే, కొత్త తరం ఓటర్లు వైసీపీవైపే మొగ్గినట్లు కనిపిపించింది.
ఇక మహిళలంతా వైసీపీ వైపు మొగ్గుచూపారని.. గ్రామాలు వైసీపీ వైపు నిలబడితే.. పట్టణ ప్రాంతాలు కూటమి వైపు మొగ్గారు కాబట్టి, వైసీపీకి వంద సీట్లు ఖాయమన్నది కొందరు ‘మేతావుల’ విశ్లేషణ. ఇది ఒక రెండు, మూడునెలల ముందువరకయితే నిజం. కానీ ఆ తర్వాత మారిన కథను, ఈ మేతావులు కావాలనే పక్కనపెట్టినట్లున్నారు. తమకు వంద రూపాయలిచ్చి, తమ నుంచి వెయ్యి రూపాయలు దోపిడీ చేస్తున్నారని మహిళలు గ్రహించిన వాస్తవాన్ని జగన్మాయ మేతావులు పట్టించుకోలేదు.
మహిళలకు కూటమి ఇచ్చిన మూడు గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, తల్లికివందనం హామీల తాకిడి, పోలింగ్‌బూత్‌ల దగ్గర కనిపించింది. అధ్వానంగా మారిన రోడ్లు- చెత్తపన్నులను, గ్రామీణ ప్రజలు పోలింగు రోజు కూడా ఎలా స్వాగతించారన్నది మేతావులు చెబితే బాగుండేది.
ఇక ఎన్నికల ముందు జగన్ భస్మాసురహస్తంలా.. తనకు తాను తెచ్చుకున్న ల్యాండ్ టైలిటింగ్ యాక్టు, పట్టాదారుపాసు పుస్తకాలపై జగన్ ఫొటో తాలూకు ఆగ్రహం-అసంతృప్తి బాంబు.. ఎక్కువగా పేలింది గ్రామీణ ప్రాంతాల్లోనేనన్నది విస్మరించకూడదు. కోడ్‌కు ముందే ఈ అంశంపై కూసిన కూటమి, ఎన్నికల ప్రచారంలో దానినే బ్రహ్మాస్త్రంగా సంధించింది.
జగన్‌కు ఓటేస్తే తమ భూములు స్వాధీనం చేసుకుని, వాటిని తాకట్టు పెట్టి అప్పులు తెస్తారన్న భావన కల్పించడంలో, కూటమి యమా సక్సెస్ అయింది. ఆ విషయాన్ని టీవీ 9 తాజా విశ్లేషణలో, రజనీకాంత్ అనే ప్రపంచ ప్రఖ్యాత పాత్రికేయుడే అంగీకరించడాన్ని విస్మరించకూడదు. ఈ రెండు అంశాలే రాత్రి వరకూ ఓటర్లను పోలింగ్ బూత్‌ల వద్ద నిలబడేలా చేశాయి.
గత ఎన్నికల్లో జగన్‌కు జైకొట్టి, రెండుచేతులతో ఓట్లు గుద్దిన ఉద్యోగులు- పెన్షనర్లు.. ఈసారి అంతకుమించిన కసితో, కూటమికి గుద్దేశారన్నది వారి మాటలే స్పష్టం చేశాయి. రాష్ట్రంలోని 30 లక్షల మంది ఉద్యోగ-పెన్షనర్ల కుటుంబాలు.. తమను వేధించి, నెల జీతం-నెల పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియకుండా చేసిన జగన్ సర్కారుపై, ఓటుతో పోటెత్తాయి. అయితే ఉద్యోగులంతా వైసీపీ వైపే ఉన్నారంటూ, ‘ఈనాడు’ పత్రిక పేరుతో, ఎంగిలి అక్షరాలు పేర్చిన అధికార పార్టీ శునకానందులను చూసి, జాలిపడటం మినహా మరేం చేయలేం.
పోలింగ్ సునామీ తర్వాత చూస్తే.. టీడీపీకి 100 నుంచి 125 వరకూ వచ్చే అవకాశం ఉందని ఒక లెక్కయితే.. వైసీపీకి 25 నుంచి 40 మధ్యలో అసెంబ్లీ సీట్లు; 3 నుంచి 6 ఎంపీ సీట్లు రావచ్చన్నది ఇంకో లెక్క. అసలు ఇంకా చెప్పాలంటే.. 20 నుంచి 25 వరకూ వచ్చేలా దేవుడు స్క్రిప్టు రాశార ంటున్నారు. ఇక జనసేనకు 15 నుంచి 18 అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానం; బీజేపీకి 4 నుంచి 6 అసెంబ్లీ, 2 నుంచి 3 ఎంపీ సీట్లు రావచ్చన్నది ఒక అంచనా.
షర్మిల గెలుపుతో ఈసారి, కాంగ్రెస్ ఖాతా తెరుస్తుందన్నది ఇంకో నమ్మలేని అంచనా. గుర్రం ఎగిరితే ఆ పార్టీకి ఒక అసెంబ్లీ సీటు కూడా రావచ్చంటున్నారు. బీజేపీ ఉన్న కూటమి-బీజేపీతో మొన్నటి వరకూ అంటకాగిన వైసీపీకి ఓట్లు వేయడం ఇష్టం లేని క్రైస్తవులు-దళితులు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారంటున్నారు. నిజంగా అదే జరిగితే వైసీపీ బాక్సు బద్దలయినట్లే! చివరాఖరలో చెప్పొచ్చేదేమిటంటే.. ఇవి అహంకారానికి-ఆత్మాభిమానానికి మధ్య జరిగిన ఎన్నికలు. దట్సాల్!