Suryaa.co.in

Political News

దేశమంతా ఎన్నికలైపోయినాక ఎలా ఉంటుంది?!

ఎన్నికలైపోయినాక దేశమంతా ఎలాగుంటుంది?
దగాపడిన ఆడ కూతురులాగా ఉంటుంది.
దొంగ నవ్వుల బ్రోకర్ని నమ్మేసి అమాయకంగా
రైలెక్కిపోయిన పల్లెటూరి పిచ్చిపిల్లలా ఉంటుంది.
ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత దేశం ఎలాగుంటుంది?
చిరిగిపోయిన ప్రచార పత్రాల గుట్టలాగుంటుంది.
ఎన్నికలైపోయినాక ఏమౌతుంది?
మనకు భోజనం లేదని గుర్తుకొస్తుంది.
మన ఇంట పుట్టిన దోమైనా, పరాయింట పుట్టిన జలగైనా
మన రక్తం పీల్చే బతుకుతాయని స్పష్టపడుతుంది.
మనకి ఉపాధి లేదని, దిక్కూ, దివాణం లేదని,
తెరువూ, తీరు లేదని మళ్లీ గుర్తుకొస్తుంది.
తెలిసి తెలసీ అయిదేళ్లకోసారి జీవితాంతం
మోసపోవడం గూర్చి ఏడుపొస్తుంది.
మన మీద మనకి కొంచెం అసహ్యం వేస్తుంది.
మన బుద్ధి గడ్డి తింటుందని తెలిసి సిగ్గేస్తుంది.
ఎన్నికల పతాకాలు విప్పేసిన తర్వాత,
గుడారాలు పీకేసిన తర్వాత,
పట్టాభిషేకం మహోత్సవం ముగిసిన తర్వాత
తుపాకీ ఇంకా మనకేసే గురిపెట్టి ఉందని తెలుస్తుంది.
మన ఓటే మనల్ని కాటేసిందని తెలుస్తుంది.

-కేఎన్‌వై పతంజలి

LEAVE A RESPONSE