Suryaa.co.in

Political News

నవ్విపోదురుగాక …

నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు? అన్న సామెతను ఏపీలో జరుగుతున్న పరిణామాలు గుర్తుచేశాయి.

పోటుగాళ్ళం అంటూ ఎగేసుకుంటూ ఆ ఇద్దరూ ఢిల్లీ వెళ్లి, ఢిల్లీలో జాతీయ మీడియా ముందు కనీసం సమాధానాలు చెప్పలేక వెర్రిచూపులుతో నీళ్ళునమిలిన సీఐడీ అదనపు డీజీపీ, నాకు హిందీ రాదు, నన్ను క్షమించమని తెల్లమొఖం వేసి చేతులెత్తేసి క్షమాభిక్ష అడిగి, నవ్వులపాలు అయిన అదనపు అడ్వకేట్ జనరల్.

ఆ పత్రికా సమావేశాన్ని పరిశీలిస్తే ఈ ఇద్దరికీ ఏమాత్రం కనీస న్యాయశాస్త్ర అవగాహన లేదని, చట్టాలు రాజ్యాంగం కోర్టులు మీద ఏమాత్రం కనీస పరిజ్ఞానం లేదని అర్థమైపోతుంది. ఒక జిల్లాలో మేజిస్ట్రేట్ కోర్టులో ప్రాక్టీసు చేసే వ్యక్తిని తీసుకొచ్చి, రాజ్యాంగ విరుద్ధ పదవైన అదనపు అడ్వకేట్ జనరల్ గా నియమిస్తే అతని వద్ద అంతకుమించి మనం ఏమి ఆశించాలి?

పాలిటెక్నిక్ చదివి స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం చేసుకుంటూ, యాక్సిడెంటల్ గా ఐపీఎస్ కి సెలక్ట్ అయ్యి, కనీసం ఒక సాధారణ ఎస్సై కి చట్టాలు రాజ్యాంగం కోర్టులు మీద ఉండే అవగాహన కూడా లేకుండా మాట్లాడుతున్న ఆ అదనపు డీజీపీ నుండి మనం ఏమి ఆశించగలం?

వీళ్ళిద్దరూ ఒక కేసు దర్యాప్తు ఎలా చేయాలి అని ఏమాత్రం కనీస విషయం పరిజ్ఞానం అవగాహన లేకుండా ఏమి ధైర్యంతో ఎంత ధైర్యంతో ఇలా మీడియా ముందుకు రాగలుగుతున్నారు? మీడియా ముందు ఎంత ధీమాతో అబద్ధాలు మాట్లాడగలుగుతున్నారు? తెలుగు మీడియా 90% వాళ్ళ చెప్పుచేతల్లో ఉంది కాబట్టి తెలుగు మీడియా ముందు అయితే నడిచింది, ఢిల్లీలో కూడా జాతీయ మీడియా ముందు అలాగే బరితెగించి అబద్ధాలు మాట్లాడేస్తాం అంటే కుదురుతుందా?

ఆ అదనపు అడ్వకేట్ జనరల్ పదవిలో ఉన్న వ్యక్తి . జాతీయ మీడియాతో మాట్లాడుతూ నేనే ప్రాసిక్యూషన్ నిర్వహిస్తున్నాను అని అన్నాడు, అతని పదవి ఏమిటని అతను ప్రాసిక్యూషన్ నిర్వహిస్తాడు? రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టులలో ప్రాసిక్యూషన్ నిర్వహించాలంటే, హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చి , జిల్లా కోర్టులో మేజిస్ట్రేట్ కోర్టులో కూడా ప్రాసిక్యూషన్ నిర్వహించవచ్చు, అంతేగానీ.. ఒక అడ్వకేట్ జనరల్ కి ఆ అధికారం ఎలా ఉంటుంది?

అసలు అడ్వకేట్ జనరల్ అనే వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వానికి- ముఖ్యమంత్రికి కేబినెట్ కి న్యాయసలహాలు మాత్రమే ఇవ్వగలడు, హైకోర్టు సుప్రీంకోర్టులో రాజ్యాంగ పరమైన అంశాలలో ప్రభుత్వ కేసులను మాత్రమే వాదించగలడు, క్రిమినల్ కేసులను అతనెలా వాదిస్తాడు? క్రిమినల్ కేసులను వాదించడానికి, రాజ్యాంగపరంగా ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు.

అలాగే, ఆ అదనపు అడ్వకేట్ జనరల్ గతంలో అవినీతి నిరోధక శాఖ కోర్టులో వాదిస్తూ, మరియు నేడు ఢిల్లీలో జాతీయ మీడియా ముందు మాట్లాడుతూ.. నాకు అర్ధరాత్రి ఒంటిగంటకు ఫోన్లో ఒక ఎస్సెమ్మెస్ వచ్చింది, అందులో నీకు వందకోట్లు లాటరీ వచ్చింది అని ఉంది, అది చూసుకుని నేను నిద్రపోయి ఉదయమే లెగిచిన తరువాత నాకు ఒక ఫోన్ వచ్చింది, ఆ ఫోన్లో నాకు వచ్చిన లాటరీ మొత్తంలో పదిశాతం ముందుగా కట్టమన్నారు, నేను కట్టాను, తరువాత నాకు ఆ పెద్దమొత్తంలో డబ్బు ఇవ్వలేదు, నేను మోసపోయాను, నన్ను మోసం చేసారని.

అలాగే ఈ కేసులో కూడా ప్రభుత్వం సీమెన్స్ మరియు డిజిటెక్ కంపెనీలను వాళ్ళు మూడువేల కోట్ల విలువైన సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ ఇస్తామని చెబితే, నమ్మి అందులో పది శాతం (371 కోట్లు) ప్రభుత్వం చెల్లించింది, ఆ కంపెనీలు వాళ్ళు చెప్పినట్లు మూడువేల కోట్లు ఇవ్వలేదని ఒక ఉదాహరణ చెప్పాడు. సరే..అతను చెప్పిన ఉదాహరణను మనం పరిగణలోకి తీసుకుంటే, మరి మోసపోయిన వాళ్ళ మీద బాధితులు మీద కేసు ఎలా పెడతారు?

మోసం చేసిన సీమెన్స్ అనే అంతర్జాతీయ కంపెనీ మీద కదా కేసులు పెట్టాల్సింది? ఆ డిజిటెక్ కంపెనీ మీద కదా కేసులు పెట్టాల్సింది? పోనీ ఆ కంపెనీలతో ఒప్పందం చేసుకున్న ఐఏఎస్ అధికారులు, ఆ డబ్బు చెల్లించిన ఐఏఎస్ అధికారులు మీద కదా కేసులు పెట్టాల్సింది? కేబినెట్ మొత్తంమీద కదా కేసులు పెట్టాలి? ఆనాడు అసెంబ్లీలో ఆ తీర్మానాన్ని ఆమోదించిన అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అందరిమీదా కదా కేసులు పెట్టాలి? అవినీతి నిరోధక శాఖ వద్ద ఉన్న కేసులో సీఐడీ ఎలా దర్యాప్తు చేస్తుంది? ఈడీ ఐటీ ఏసీబీ ల వద్ద దర్యాప్తులో ఉన్న కేసులో సీఐడీ ప్రమేయం ఏమిటి? సీఐడీకున్న చట్టపరిది ఏమిటి?

ఒక ప్రాధాన్యత సంతరించుకున్న కేసులో ఇవేమీలేకుండా, కనీస నైతిక రాజ్యాంగ చట్టబద్ధమైన అంశాలను పాఠించకుండా వీళ్ళిద్దరూ కొత్త రాజ్యాంగాన్ని చట్టాలను సృష్టించుకుని బరితెగించి ఇలా మీడియా ముందుకు రావడాన్ని విద్యావంతులైనవారు మేధావులు నిజమైన జర్నలిస్టులు ప్రజాసంఘాలు ప్రశ్నించాలి, వీళ్ళు రాజ్యాంగవ్యతిరేకంగా చట్టవ్యతిరేకంగా వీళ్లకున్న అధికారపరిధులను అతిక్రమించి ప్రవర్తిస్తూ ప్రదర్శిస్తున్న లోపాలను ప్రజలముందుకు తీసుకెళ్లి ఎత్తి చూపాలి.

నాకు తెలిసి మొన్న అవినీతి నిరోధక చట్టం కోర్టులో ఇదే అదనపు అడ్వకేట్ జనరల్ ఇదే లాటరీ ఉదాహరణతో చేసిన నేలాబారు ఉదాహరణతో కూడిన చవకబారు వాదనలను డిఫెన్స్ తరపు పేరుమోసిన లాయర్లు కనీసం తిప్పికొట్టలేకపోయారని, అదే ఉదాహరణ ప్రకారం అయితే ఒక మాజీ ముఖ్యమంత్రి మీద కేసు ఎలా పెట్టారని? అదెలా సమంజసమని న్యాయమూర్తి ఎదుట ప్రశ్నించలేదని, ధీటుగా తిప్పికొట్టలేదని సమాచారం.

అసలు ఆ అదనపు అడ్వకేట్ జనరల్ గా చెలామణీ అవుతున్న వ్యక్తికి , ఈ కేసులో వాదించడానికి రాజ్యాంగపరమైన చట్టపరమైన హక్కు లేదు. కనీసం ఈ విషయం కూడా డిఫెన్స్ తరపున వాదిస్తున్న న్యాయవాదులకు లేకపోవడం శోచనీయం.

కేవలం ఒక్క అడ్వకేట్ జనరల్ మాత్రమే రాజ్యాంగపరంగా చట్టపరంగా రాష్ట్రప్రభుత్వానికి చెందిన కేసుల్లో , ఎక్కడైనా ఏకోర్టులోనైనా వాదించవచ్చు అని రాజ్యాంగంలో చట్టంలో ఉంది. కానీ నైతికంగా సాంకేతికంగా విశ్లేషిస్తే క్రిమినల్ కేసుల్లో వాదించడానికి అడ్వకేట్ జనరల్ కి ఉన్న హక్కులు ప్రశ్నర్థకమేనని నా భావన.

ఎందుకంటే…రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రిమినల్ కేసులు వాదించడానికి ప్రాసిక్యూషన్ విభాగం ఉంటుంది, హైకోర్టులో రాజ్యాంగబద్ధంగా నియమించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. ఒకవేళ అడ్వకేట్ జనరల్ రాజ్యాంగపరంగా చట్టపరంగా తనకున్న విస్తృత అధికారాన్ని ఉపయోగించి, అన్ని కేసులలో తన ప్రమేయం చూపించవచ్చు, అంతేగానీ రాజ్యాంగ విరుద్ధమైన చట్టవిరుద్ధమైన అడిషనల్ అడ్వాకేట్ జనరల్ అన్ని కేసులలో వేలుపెట్టలేడు తలదూర్చలేడు.

అడిషనల్ అడ్వకేట్ జనరల్ అనే పదవి ఆరోవేలు లాంటిది, ఆ పదవికి రాజ్యాంగపరంగా చట్టపరంగా ఎలాంటి గురించి విలువాలేదు. మరొక ముఖ్య విషయం ఏమిటంటే….అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 165 మరియు367 ప్రకారం ఎక్కడాలేదని, ఏ చట్టంలోనూ లేనిదని, అడిషనల్ అడ్వకేట్ పదవి అనేది చెల్లదని భారత సుప్రీంకోర్టు 2004 లో ఎసెల్పీ నెంబర్: 14098/1998 లో ది.05-01-2004 న జస్టిస్ వీఎన్ ఖారే(సీజేఐ), జస్టిస్ ఎస్బీ సిన్హా ధర్మాసనం తీర్పు వెలువరించింది.

ఆ తీర్పు ప్రకారం ఎవ్వరూ కూడా ఆ పదవి పేరుతో వ్యవహరించడం కోర్టుధిక్కారం కిందకు వస్తుంది, ఉద్దేశ్యపూర్వక మోసపూరిత నేరం అవుతుంది. కాబట్టి నేడు ఎవరైతే నేను అడిషనల్ అడ్వకేట్ జనరల్ ని, నాది రాజ్యాంగ పదవి అని చెప్పుకుంటున్నాడో, అలా చెలామణీ అవుతున్నాడో అతని మీద సివిల్ క్రిమినల్ కేసులు పెట్టవచ్చు, కోర్టుధిక్కారం కేసు పెట్టాలి. అతని మీద బార్ కౌన్సిల్ కి ఫిర్యాదుచేయాలి, కానీ అలా చేయగలిగే మగాడు నేడు తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్లో ఎవ్వడూలేడు.

ఎందుకంటే వాళ్లకున్న న్యాయ శాస్త్ర పరిజ్ఞానం కూడా ఆ అదనపు అడ్వకేట్ జనరల్ గా చెప్పుకుంటూ చెలామణీ అవుతున్నాడో.. అతనికున్నంతే కాబట్టి, మరీ పచ్చిగా నిజం చెప్పాలంటే, తెలుగుదేశం పార్టీకి చెందిన లీగల్ సెల్లోని న్యాయవాదులు కంటే , అతనే మెరుగు అనిపిస్తుంది.

నేడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియమించబడినా అది రాజ్యాంగవిరుద్ధం, అలా ఎవరైనా చెప్పుకున్నా అది మోసపూరిత నేరం, అలా నియమించిన వ్యక్తి కేవలం హైకోర్టులో ఒక సాధారణ గవర్నమెంట్ ప్లీడరు(జీపీ) మాత్రమే, అంతకుమించి అతనికి ఎలాంటి విలువాలేదు. ఇది కాదని ఎవరైనా చర్చకు వస్తే, అది తప్పని న్యాయశాస్త్ర పరంగా, రాజ్యాంగపరంగా చట్టపరంగా తప్పని నిరూపించడానికి నేను సిద్ధం.

ఈ కేసులో అతను ఏ అర్హతతో వాదిస్తున్నాడో ఎవరైనా ఆడిగారా?
అతను కేవలం హైకోర్టులో ఒక గవర్నమెంటు ప్లీడరు అయినప్పుడు, అతను ఏదైనా బయట కోర్టులో ఏదైనా క్రిమినల్ కేసు వాదించాలంటే, అతనికి ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇవ్వాలి, ఈ విషయాన్ని విజ్ఞులైన న్యాయమూర్తి కోర్టులో అతన్ని అడగాలి నిలదీయాలి.

మరోపక్క….హైకోర్టులో న్యాయవాదుల సంక్షేమం మౌలిక వసతులు మంచిచెడులు గురించి, తమలో తాము ఎన్నుకునే హైకోర్టు న్యాయవాదుల అసోసియేషన్ ఒక అధికారపార్టీకి వత్తాసుగా, అధికారపార్టీకి అధికారప్రతినిధులుగా మాట్లాడడం, సివిలియన్స్ బయట ఒక న్యాయవాది గురించి మాట్లాడినదానిమీద, డీజీపీకి ఫిర్యాదు చేయడం చట్టవిరుద్ధమైన చర్య, నైతిక విరుద్ధమైన చర్య.

ఎవరైనా బయట ఒక న్యాయవాదిని విమర్శిస్తే- బెదిరిస్తే – దూషిస్తే ఆ న్యాయవాది మాత్రమే వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయవచ్చు, అంతేగానీ..అతనికి ఏజెంట్లుగా మారిపోయిన హైకోర్టు అడ్వాకేట్స్ అసోషియేషన్ ఎలా ఫిర్యాదు చేస్తుంది? ఇది ఎంతవరకు నైతికత? ఈ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ ఏమన్నా అధికారపార్టీకి గాడ్ ఫాదరా?

ఇవన్నీ సహేతుకంగా అడిగినవాడు నిలదీసినవాడు ఒక్కడూ తెలుగుదేశం పార్టీలో లేకపోవడం దురదృష్టకరం, అలాగే ఏఒక్క ప్రజాసంఘం మేధావులు విద్యావంతులు లేకపోవడం ఆ రాష్ట్ర దౌర్భాగ్యం.

ఏదేమైనా…. ఎవరు ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా, ఒక అత్యంత ప్రతిష్టాత్మక అన్యాయ కేసులో ఎవరెలా వాదించినా వాదించకపోయినా, ఒక న్యాయమూర్తి ముందుగానే చట్టాలు సాక్ష్యాలు రాజ్యాంగం గురించి ఏమాత్రం అవగాహన లేకుండా, ముందుగానే ఏదో ఒత్తిడికి గురై ఒక నిర్ధిష్ట ఆలోచనకు నిర్ణయానికి వస్తే ఎవ్వరూ చేయగలిగింది ఏమీ ఉండదు కదా.?

దేశ న్యాయ వ్యవస్థ మనుగడ గౌరవానికే మచ్చగా మారిన ఆ తీర్పు మీద జాతీయస్థాయిలో మేధావులు రాజ్యాంగనిపుణులు న్యాయకోవిదులుతో బహిరంగ న్యాయ సమీక్షకు చర్చకు కూడా ఎవ్వరూ పూనుకోలేదు, కనీసం ఎవ్వరూ నోరెత్తడానికి సిగ్గుపడుతున్నారు, భయపడుతున్నారు. అన్యాయంగా అరెస్టు కాబడి రిమాండులో ఉన్న ఒక ప్రముఖుడి వలన అన్నివిధాలా లబ్ధిపొందిన వాళ్ళు, నేడు సంఘంలో ప్రముఖులు ధనవంతులు సెలిబ్రిటీలుగా గుర్తింపు పొందిన వాళ్లు బయటకు రాకపోవడం చూస్తుంటే, వాళ్ళు రోజూ కడుపులకు నోటితో తినేది ఏమిటో వాళ్లే ఆలోచించుకోవాలి.

-సువేరా

LEAVE A RESPONSE