Suryaa.co.in

Andhra Pradesh

ఈనాడు స్క్రిప్ట్‌… బాబు ప్రొడక్షన్‌… పవన్‌ యాక్షన్‌

-వాలంటీర్లపై విషం చిమ్ముతున్న ఆ ముగ్గురు
-సంక్షేమ పథకాలు అడ్డుకోవడమే వారి లక్ష్యం
-అందుకే నిత్యం ప్రభుత్వంపై విరుచుకుపాటు
-సంక్షేమ పథకాలను తూలనాడుతూ పిచ్చి విమర్శలు
-జన్మభూమి కమిటీలను మళ్లీ జనం మీద రుద్దుతారా?
– ఎంపీ మార్గాని భరత్‌ స్పష్టీకరణ

ఈనాడు రచనకు పవన్‌ నటన:
రాష్ట్రంలో ఈరోజు వాలంటీర్‌ వ్యవస్థ అనేది పూర్తి పారదర్శకంగా నడుస్తోన్న వ్యవస్థగా చెప్పుకోవాలి. ఎక్కడా లంచాలకు తావు లేకుండా కులమతాలు, పార్టీలకు అతీతంగా పని చేస్తూ ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్న ఈ వ్యవస్థను నాశనం చేయడానికి దుష్ట చతుష్టయం కుట్రలు పన్నుతుంది. ఇందులో భాగంగా ఈనాడు రచనతో విష కథనాలు ప్రచురితం చేస్తుంటే.. వాటికి చంద్రబాబు నిర్మాతగా వ్యవహరిస్తూ.. ఈనాడు విషప్రచారాన్ని ప్యాకేజీస్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నోటివెంట ప్రజల మెదళ్లల్లో చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే, వారెన్ని విషప్రయోగాలు చేసినప్పటికీ, లేనిపోని కబుర్లుతో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేసినా ప్రజలు మాత్రం వారి మాటల్ని నమ్మరుగాక నమ్మరు. ఎందుకంటే, పవన్‌కళ్యాణ్‌ పిచ్చిమాటలకు ఆయన్నొక పేకాటలో జోకర్‌గా, రాజకీయాల్లో కామెడీస్టార్‌గా ప్రజలు చూస్తున్నారు.

జన్మభూమి కమిటీలు కావాలా పవన్‌?:
రాష్ట్రంలో ప్రజలకు ఈ ప్రభుత్వం మంచి చేస్తుంటే చంద్రబాబుకు, ఆయన దత్తపుత్రుడైన పవన్‌కళ్యాణ్‌కు కన్నుకుట్టి పోతుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ఇంటి గడపకు చేరుతుంటే వారిద్దరి కడుపు మండిపోతుంది. కనుకనే, వారి ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉన్న వాలంటీర్లపై చెడు ముద్ర వేస్తూ దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు.

ఈ సందర్భంగా పవన్‌కళ్యాణ్‌ను నేనొక ప్రశ్న అడుగుతున్నాను. బాబు హయాంలో పని చేసిన జన్మభూమి కమిటీలే నేటికీ ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? పచ్చ కండువాల్ని ధరిస్తేనో.. పచ్చ జెండాల్ని ఇళ్లపై ఎగరేస్తేనో.. లంచాలిస్తేనో ప్రభుత్వ పథకాలు అందాలని నువ్వు కోరుకుంటున్నావా?.
గతంలో ఆ కమిటీల మూలంగా ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నీకెవరూ ఫిర్యాదు చేయలేదా?. అప్పుడెందుకు నోరు మూసుకున్నావో సమాధానం చెప్పగలవా?.

దేశం మెచ్చిన వ్యవస్థ అది:
మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం అనేది నేడు రాష్ట్రంలో సచివాలయాలు, వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా అందరూ కళ్లకు కట్టినట్టు చూస్తున్నారు. ఇంతటి మహత్తరమైన సంస్కరణకు శ్రీకారం చుట్టిన సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచనా విధానాన్ని దేశంలో చాలా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ప్రతి నెలా ఒకటో తేదీన ప్రతి ఇంటి తలుపు తట్టి, అవ్వాతాతల్ని నిద్ర లేపి పెన్షన్లు ఇస్తున్న మంచి వ్యవస్థగా వాలంటీర్లు పని చేస్తున్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకాన్ని అర్హులకు నేరుగా ఇంటికి చేరుస్తున్న ప్రభుత్వ వారధులు ఈ వాలంటీర్లు. ప్రజలంతా సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్థపై సదాభిప్రాయంతో ఉంటే పవన్‌కళ్యాణ్‌కు మాత్రం కేంద్ర నిఘా వర్గాలు ఏదో చెప్పాయంట. సేవా దృక్పథంతో పని చేసే వాలంటీర్లపై నోటి కొచ్చినట్లు మాట్లాడుతున్నాడు.

ప్రజా వ్యతిరేక ప్రచారమది:
వాలంటీర్లను మందుబాటిల్‌ రేట్లతో పోల్చుతూ.. సచివాలయ వ్యవస్థను తప్పు బడుతూ వాలంటీర్లను అరాచక శక్తులంటున్నాడంటే పవన్‌కళ్యాణ్‌ ఎంత అహంకారినో అందరికీ అర్ధమవుతుంది. ఆయన కచ్చితంగా ప్రజా వ్యతిరేక ప్రచారం చేస్తున్నట్టుగానే భావించాలి. రాష్ట్రంలో రైతు భరోసా పథకం తీసుకుంటున్న 51 లక్షల మంది రైతులకు వ్యతిరేకంగా.. మరో 79 లక్షల మంది డ్వాక్రా అక్కచెల్లెమ్మలుకు వ్యతిరేకంగా, అమ్మఒడి లబ్ధిదారులకు వ్యతిరేకంగా పవన్‌కళ్యాణ్‌ ప్రచారం చేస్తున్నట్టే. అంటే, వాలంటీర్లు సేకరించే డేటాతో ప్రజలు పొందే ప్రభుత్వ లబ్ధిని పవన్‌కళ్యాణ్‌ తప్పుబడుతున్నారు. కనుకనే, ఆయా ప్రభుత్వ పథకాలు పొందే లబ్ధిదారులంతా పవన్‌కళ్యాణ్‌పై ఆవేశంపై ఊగి పోతున్నారు.

పవన్‌ అజ్ఞానానికి పరాకాష్ట:
చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్‌ రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థపై మాట్లాడుతున్నాడు. వాలంటీర్లను అనరాని మాటలతో కించపరుస్తున్నాడు. వాళ్లను బ్రోకర్లు, క్రిమినల్స్‌తో పోల్చాడంటే ఆయన అజ్ఞానానికి పరాకాష్టగానే చెప్పుకోవాలి. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడుగా ప్రజల ముందుకెళ్లినప్పుడు వాళ్లకు తాను ఏం చేస్తాడో చెప్పకుండా.. సమాజానికి మంచి చేస్తున్న వ్యవస్థను తప్పు బట్టడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాను. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ.. కులమత రాజకీయాలకు అతీతంగా సేవలందిస్తున్న అభం శుభం తెలియని వాలంటీర్ల గురించి విరుచుకుపడటం పవన్‌కళ్యాణ్‌ కుసంస్కారానికి నిదర్శనమని చెబుతున్నాను.

బాబు కంపెనీ పార్టనర్‌వి కాదా?:
జన్మభూమి కమిటీలు క్షేత్రస్థాయిలో చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. గతంలో ఆ కమిటీలు నీరు–చెట్టు పనుల్లో ఏ విధమైన దోపిడీకి పాల్పడ్డారో అందరికీ తెలిసిందే. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లోనూ జన్మభూమి కమిటీలు చేతివాటం ప్రదర్శించాయి. మరి, ఆనాడు చంద్రబాబు కంపెనీలో పార్టనర్‌గా ఉన్న పవన్‌కళ్యాణ్‌ అప్పటి కుంభకోణాలతో భాగస్వామ్యుడు కాదా? అని అడుగుతున్నాను. 2014లో ఇదే పవన్‌ ఏం చెప్పాడు. నన్ను నమ్మి ఓటేస్తే నేను ప్రశ్నిస్తానన్న వ్యక్తి ఇతడు. మరి, బాబు హయాంలో జరిగిన అరాచకాలపై ఏనాడైనా నోరిప్పి ప్రశ్నించాడా? బాబు కంపెనీలో జరిగిన అవినీతి లావాదేవీలకు పవన్‌ పార్టనర్‌ కాదా?.

వారంటే పవన్‌లో ఎందుకు భయం?:
వాలంటీర్లు బ్రోకర్లు, క్రిమినల్స్‌ అంటూ నోరు పారేసుకున్న పవన్‌కళ్యాణ్‌ గత రెండ్రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల నిరసన సెగ దెబ్బకు భయపడ్డాడు. కనుకనే, నిన్న వారి గురించి మాట్లాడేటప్పుడు కాస్త తగ్గాడు. వాలంటీర్లంటే తనకు అన్నదమ్ములంటూ.. సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. వాలంటీర్లు మంచి చేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, రాబోయే ఎన్నికల్లో మళ్లీ మా పార్టీదే ఘన విజయమన్న భయంతోనే పవన్‌కళ్యాణ్‌ పిచ్చిమాటలతో పేట్రేగిపోతున్నారని మేధావి వర్గం చెబుతోంది.

క్లాస్‌వార్‌పై ఆయన చెప్పేదే నిజం:
పవన్‌కళ్యాణ్‌ అనే వ్యక్తి చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ప్రజలకు అర్ధమైంది. ఎందుకంటే, వారంతా గత ప్రభుత్వాలకు ప్రస్తుత ప్రభుత్వానికి గల తేడాను గమనిస్తున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ చెబుతున్నట్లు రాష్ట్రంలో ‘క్లాస్‌వార్‌’ జరుగుతుందన్న వాస్తవాన్ని ప్రజలు నమ్ముతున్నారు. మా ప్రభుత్వం అధికారంలోకొచ్చాక వివిధ పథకాల ద్వారా రూ.2 లక్షల కోట్లకు పైగా నగదును డీబీటీలో జమ చేయడం జరిగింది. ఆ లబ్ధి పొందిన వారిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల పేదలూ ఉన్నారు. ఇప్పుడు వారందరికి వ్యతిరేకంగా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ మాట్లాడుతున్నారు.

అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల వాలంటీర్లలో 1.80 లక్షల మంది మహిళలు ఉన్నారు. వారిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారు. వీళ్లందరికీ వ్యతిరేకంగా బాబు, పవన్‌లు మాట్లాడుతున్నప్పుడు వీరికి క్లాస్‌వార్‌ గుర్తుకు రాదా?. పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం చదువంటే అడ్డుకుంటారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలంటే వీల్లేదని కోర్టులకెళతారు. మరి, పేదల పాలిట పెన్నిధిలా సీఎంగారు పని చేస్తుంటే బాబు, పవన్‌లు పెత్తందార్లకు కొమ్ము కాస్తున్నారని ప్రజలకు అర్ధం అవుతోంది.

వారిని పెళ్లాలనే అంటారు:
పవన్‌కళ్యాణ్‌ ఇటీవల అనేక సందర్భాల్లో గౌరవ సీఎంని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. తనకు ఇద్దరు ముగ్గురు పెళ్లాలు ఉన్నారంటూ మాట్లాడటం వపన్‌కళ్యాణ్‌కు బాధాకరంగా ఉందంట. మరి, అందులో తప్పేముంది? భర్తకు భాగస్వామిగా ఒకరుంటే వారిని భార్య అని అంటారు కానీ, ఇద్దరు ముగ్గురుంటే వారిని పెళ్లాలనే పిలుస్తారు. ఈ వాస్తవాన్ని పవన్‌ గ్రహించాలి.

ఈ సందర్భంగా నేనొక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. మీ రెండో సహధర్మచారిణి రేణుదేశాయ్‌ గతంలో ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారు?. ‘నన్ను పెళ్లి చేసుకుని మరొకరితో సంసారం చేస్తుంటే నేనెంత క్షోభపడ్డానో’.. అంటూ ఎంతో బాధ వ్యక్తం చేశారు. మరి దానికి ఏం సమాధానం చెబుతావు?.

పవన్‌ను నమ్మితే..:
నటన వేరు రాజకీయాలు వేరు అని పవన్‌ తెలుసుకోవాలి. చేగువేరా అంటాడు. విప్లవం అంటాడు. సినిమాల్లో రెండు ప్యాంటులు ధరించి ఒక ప్యాంటు సగం విప్పి చూపుతాడు. ఇది ఆయన సంస్కారంగా ప్రజలు తెలుసుకోవాలి. జనసేన పార్టీలో పవన్‌కళ్యాణ్‌ను ఆయన పార్టీ నాయకులే ఆయన్ను నమ్మడం లేదు. ఆయన పొంతన లేని మాటల్ని నాయకులెవరూ నమ్మరు. జేడీ లక్ష్మీనారాయణలాంటి పెద్దలు జనసేన పార్టీని విడిచి ఎందుకు పోయారు..? పవన్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరిని ఈదినట్టేనని గుర్తించాలి.

ఇకనైనా బుద్ధి తెచ్చుకో..:
వాలంటీర్లు ప్రజల డేటాను ఏదో చేస్తున్నారంటూ ఊగిపోయే పవన్‌ను నేనొక ప్రశ్న అడుగుతున్నాను. జనసేన సభ్యత్వం తీసుకోవాలంటే సభ్యుడి డేటా తీసుకోవడం లేదా? మరి ఆ సమాచారాన్ని ఏం చేస్తున్నారు?. అదొక మినీ పెగాసిస్‌ అంటావా పవన్‌కళ్యాణ్‌? దీనికి సమాధానం చెప్పు. అందుకే ఇప్పటికైనా సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థల వల్ల జరుగుతున్న మంచి గుర్తించి, పిచ్చి విమర్శలు మానాలని పవన్‌ను కోరుతున్నానని ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు.

LEAVE A RESPONSE