– పరిశ్రమలు, చేనేత జౌళి శాఖ మంత్రి గుడివాడ అమర్ నాధ్
– పెళ్లి పట్టు చీరల సంగమంగా “ఆప్కో సేలబ్రేషన్స్” ప్రారంభం
– ఆప్కో నేతృత్వంలో నవ్యత, నాణ్యతలతో కంచిపట్టు చీరల ఉత్పత్తి
వ్యవసాయం తరువాత అత్యధికంగా అధారపడిన చేనేత రంగం ఆర్ధిక స్వావలంబనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి గుడివాడ అమర్ నాధ్ అన్నారు. నేత కార్మికుల ప్రయోజనం కోసం ఇప్పటికే ప్రభుత్వ పరంగా ఉన్న బకాయిలను దశల వారిగా విడుదల చేస్తున్నామన్నారు.
విజయవాడ పిన్నమనేని పాలీ క్లీనిక్ రోడ్డులో “ఆప్కో సెలబ్రేషన్స్” పేరిట నూతనంగా ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రపంచాన్ని మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గుడివాడ మాట్లాడుతూ వినియోగ దారుల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా నూతన వస్త్ర శ్రేణితో ఆప్కో సెలబ్రేషన్స్ ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ప్రత్యేకించి పెళ్లి పట్టు చీరల సంగమంగా దీనిని కొనుగోలు దారులకు అంకితం చేయటం శుభపరిణామమన్నారు. చేనేత రంగ ప్రయోజనాల విషయంలో ఎటువంటి ఆర్ధిక పరిమితులు లేవని ముఖ్యమంత్రి స్పష్టం చేసారని, తదనుగుణంగా కార్యాచరణ అమలు చేస్తున్నామని వివరించారు.
ఆర్ధిక, పరిశ్రమల, చేనేత, జౌళి శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ చేనేత కార్మికులతో పాటు సంఘాలు ఎదుర్కునే సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కార్మికుల సంక్షేమం విషయంలో ఎటువంటి రాజీలేని ధోరణిని అనుసరించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారన్నారు. ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగ మోహన రావు మాట్లాడుతూ ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్లో కంచి పట్టుచీరల కోసం ఎక్కడికో వెళ్లనవసరం లేదని, నాణ్యత, నవ్యతలో రాజీ లేకుండా ఇప్పడు వాటిని ఆప్కో స్వయంగా తయారు చేయిస్తోందన్నారు. నగరంలో నూతనంగా ప్రారంభిస్తున్న ఆప్కో సెలబ్రేషన్స్ ఇక ప్రతి ఇంటి పండుగలోనూ భాగం కానుందన్నారు.
చేనేత, జౌళి శాఖ సంచాలకురాలు, ఆప్కో విసి, ఎండి చదలవాడ నాగరాణి మాట్లాడుతూ వివాహ వస్త్రాలకు సంబంధించి ఆధునిక డిజైన్ల సమాహారంగా ఆఫ్కో సెలబ్రేషన్స్ నిలుస్తుందని, రానున్న రోజుల్లో మరిన్ని షోరూమ్ లు ప్రారంభించటం ద్వారా చేనేత రంగం బలోపేతానికి ఆప్కో కృషి చేయనుందన్నారు. తెలంగాణ, కర్నాటక, పశ్చిమ బెంగాల్, డిల్లీలో ప్రదర్శన, విక్రయ కేంద్రాలను నూతనంగా ఏర్పాటు చేయటంతో పాటు, ఇప్పటికే ఉన్న షోరూమ్ లను ముఖ్యమైన కూడళ్లలోకి మార్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాసన సభ్యులు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, చేనేత జౌళి శాఖ సంయిక్త సంచాలకులు కన్నబాబు, నాగేశ్వరరావు, ఆప్కో ముఖ్య మార్కెటింగ్ అధికారి రమేష్ బాబు, డివిజినల్ మార్కెటింగ్ అధికారి ప్రసాద రెడ్డి, పలువురు చేనేత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
పెళ్లి కళ వచ్చేసిందే బాల…
ఆప్కో సెలబ్రేషన్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చేనేత పెళ్లి పట్టు చీరల ష్యాషన్ షో అదుర్స్ అనిపించింది. ఆధునిక డిజైన్లతో కూడిన వివాహ వస్రాలను ధరించిన ముద్దుగుమ్మలు అక్కడి వాతావరణానికి పెళ్లి కళ తీసుకువచ్చారు. రాష్ట్రానికి చెందిన చేనేత పట్టు వస్త్రాలను అయా రాష్ట్రాల వివాహ సాంప్రదాయ వస్త్ర ధారణతో ప్రదర్శించారు. యువ డిజైనర్లు సృజనకు అద్దం పడుతూ రూపొందించిన వివాహా వేడుకల వస్త్ర శ్రేణితో యువతీ యువకులు సాంప్రదాయాలకు అనుగుణంగా ర్యాంప్ పై వయ్యారాలు పోయారు. నూతనత్వంతో కూడిన చేనేత పెళ్లి పట్టు చీరలు ప్యాషన్ ప్రియులను అకట్టుకున్నాయి. నేత వస్త్రాలతో సైతం ఇంతలా తమ అందం రెట్టింపు చేసుకోవచ్చా అన్న ఆలోచన రెకెత్తేలా మోడల్స్ వస్త్రధారణ ఉండటం ప్రత్యేకతగా నిలిచింది. ఆప్కో కేంద్ర కార్యాలయం నేతృత్వంలో జరిగిన ష్యాషన్ షోకు సామ్రాజ్యం సిల్వర్ కింగ్ డమ్, పోజ్ సెలూన్ సంస్దలు ఆభరణాలు, అలంకరణలో తమ వంతు సహకారం అందించాయి.