వైద్యరంగ బలోపేతానికి కృషి

– నర్సింగ్ విద్యకు అన్ని విధాలుగా ప్రోత్సాహం
– కరోనా కష్టకాలంలో పోరాడింది వైద్య సిబ్బందే
– వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని

అమరావతి: రాష్ట్రంలో ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోందని, అందుకోసం బడ్జెట్లో అధికంగా నిధుల కేటాయింపు చేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు అన్నింటిపైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నామని స్పష్టం చేశారు. కరోనా సమయంలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది అందించిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. వారు ప్రాణాలకు తెగించి వైద్యం అందించడం వల్లే దేశంలోనే కరోనాను దీటుగా ఎదుర్కోవడంలో మన రాష్ట్రాన్ని ముందంజలో నిలపగలిగామన్నారు.

రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక జిల్లా స్థాయి ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామని వివరించారు. నూతన కేబినెట్లో మంత్రి పదవిని అలంకరించిన వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజినిని ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కాలేజీ, స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు గౌరవపూర్వకంగా కలిసి మంత్రికి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి రజిని మాట్లాడుతూ వైద్యరంగంలో నర్సింగ్ సిబ్బంది అత్యంత కీలకమన్నారు.

ప్రతి రోగిని ప్రత్యక్షంగా పర్యవేక్షించే వారి బాగోగులు చూసుకునేది వారేసని కొనియాడారు. అలాంటి నర్సింగ్ సిబ్బందిని అందించే కళాశాలలు, పాఠశాలలకు అవసరమైన పూర్తి సహకారాన్ని ప్రభుత్వపరంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే మరిన్ని నూతన కళాశాలలు, స్కూల్స్ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు అందించేందుకు సహకరిస్తామన్నారు. ఈ సందర్భంగా వైద్య విద్య, నర్సింగ్ విద్యకు సంబంధించిన అంశాలను అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

మంత్రి రజినిని కలిసిన వారిలో ఏపీ నర్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెన్నా రెడ్డి, ప్రభుదాసు, కోశాధికారి డీవీ సుబ్బారావు, ఉపాధ్యక్షులు ప్రవీణ్, రవీంద్రారెడ్డి, విజయవర్ధన్ రెడ్డి, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని నర్సింగ్ కాలేజీలు, స్కూల్స్ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అసోసియేషన్
ప్రతినిధులు తన దృష్టికి తీసుకొచ్చిన అన్ని అంశాలనూ సానుకూలంగా పరిశీలించి పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని మంత్రి విడదల రజిని హామీ ఇచ్చారు.