జార్ఖండ్‌లో ఫెయిలైన బియ్యం నగదును ఏపీపై రుద్దుతారా?

– సర్కారు అప్పుల వివరాలు ప్రధానికి అందించా
– ఒంగోలు ఘటనలోనూ కులం కోణమేనా?
– వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఫైర్

జార్ఖండ్ రాష్ట్రంలో విఫలమైన నగదు బదిలీ పథకాన్ని ఆంధ్ర ప్రదేశ్ లో అమలు చేయాలనుకోవడం సరికాదని, మద్యం ఆదాయం పై మక్కువతో నే నగదు బదిలీ పథకాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతోందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శించారు. దయార్ద్ర హృదయుడు, సామాజిక స్పృహ కలిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు నగదు బదిలీ పథకం అమలుపై మరొకసారి పునరాలోచన చేయాలంటూ సూచించారు.

మీరు మనుషులైతే… నిజంగా మనసుంటే ఫుడ్ ఫర్ ఆల్ కింద ప్రవేశపెట్టిన బియ్యం పంపిణీ పథకాన్ని యధావిధిగా కొనసాగించి, మధ్యతరగతి పేద వర్గాలకు భోజనం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టడానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి తొక్కలో వివరణ ఇచ్చుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కొంతమంది ఆరోగ్యం కోసం చిరుధాన్యాలు తింటున్నారని, అందుకే బియ్యం పంపిణీ కాకుండా నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పుకొచ్చారని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

అయితే, తనలాగా బలిసిన వాళ్లకు చిరుధాన్యాలు అవసరమేమో కానీ.. కష్టపడి పనిచేసేవారికి భోజనము కూరగాయలే బలమని వివరించారు. మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యం అవసరం లేదా ?అంటూ రేపు మంత్రి, ముఖ్యమంత్రి మాట్లాడవచ్చు నని… ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడకపోయినా, మాట్లాడించ వచ్చునన్న రఘురామకృష్ణంరాజు, కష్టపడే వారికి భోజనమే బలమని చెప్పుకొచ్చారు.

కేంద్ర ప్రభుత్వం జార్ఖండ్ రాష్ట్రంలో నీ ఒక జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టి కిలో బియ్యానికి ముప్పై ఒక్క రూపాయల చొప్పున అందజేసిన ప్పటికీ, స్థానికుల నుండి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తిందని తెలిపారు.. అటువంటి విఫలమైన పథకాన్ని రాష్ట్రంలో కిలో బియ్యాని కి ఎంత ఇస్తామన్నది చెప్పకుండానే ప్రవేశ పెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

నగదు బదిలీ పథకం అమలు వల్ల రేపు కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉండదని ప్రతిపక్షాలు చెబుతున్న మాటలను ప్రజలు విశ్వసించే అవకాశం లేకపోలేదని ఆయన అన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దివ్యాంగురాలు పై అత్యాచారం ఘటన అందరినీ కలిచివేసిందన్న రఘురామ కృష్ణంరాజు, దిశా యాప్ సంగతి దేవుడెరుగు… నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన నిందితులపై చర్యలు లేవన్నారు. దివ్యాంగురాలు పై అత్యాచార ఘటన దురదృష్టకరమన్న ఆయన, ఆసుపత్రుల్లో సౌకర్యాలు భేష్ అని చెప్పుకున్న వెంటనే ఈ ఘటన జరగడం ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని విరుచుకుపడ్డారు.

రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ రెడ్డి హస్తినలో నాలుగు రోజుల నుండిమకాం వేసి, అయ్యా అప్పు అంటూ పడిగాపులు పడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రానికి అప్పులను ఇచ్చేందుకు అనేక వివరాలను అడుగుతున్నట్లు తెలుస్తోందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అప్పులను చేసి, తాము చేసిన తప్పులను తక్కువగా చూపించే ప్రయత్నం చేస్తోందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం చేసిన రుణ వివరాలను తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తాను ఒక లేఖ రాసినట్లుగా వివరించారు. లేఖలోని అంశాలను మీడియా ప్రతినిధులకు క్లుప్తంగా వివరించారు. సి ఎస్ ఎఫ్ ఎమ్ విధానం ప్రకారం తొలుత చేసిన అప్పులకు మొదటనే చెల్లించాల్సి ఉండగా, ఆంధ్రప్రదేశ్లో అలా జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. కార్పొరేషన్ పేరిట చేసిన రుణాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని తాను ప్రధాన మంత్రిని లేఖ ద్వారా కోరినట్లు వివరించారు.

ఇంకా లక్షా యాభైవేల కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ లెక్కన రాష్ట్ర జి ఎస్ డి పి 77 శాతం గా ఉన్నట్లు వెల్లడించారు. ఢిల్లీలో మకాం వేసిన రాజేంద్రనాథ్ రెడ్డి, కేంద్ర ఆర్థిక కార్యదర్శి రావత్ వద్ద అప్పుల కోసం ఎన్నో తిప్పలు పడుతూ ఉండగా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అమెరికాలో ఉన్నారు అని చెప్పుకొచ్చారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ప్రజల పై నిర్బంధాన్ని అమలు చేస్తున్నారని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా వర భద్ర పురం పర్యటన సందర్భంగా స్థానికులతో పాటు అనపర్తి ఎమ్మెల్యే ను కూడా గృహనిర్బంధం చేయడం విస్మయాన్ని కలిగిస్తోందని రఘురామకృష్ణంరాజు అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి, ప్రజలను కలుసుకునేందుకు భయపడడం విడ్డూరంగా ఉందని నిప్పులు చెరిగారు. ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు ఒక అవకాశం ఇచ్చారని, ప్రతిసారి ప్రజలు మోసపోరని, విజ్ఞులైన ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఒక కుటుంబాన్ని నడిరోడ్డుపై నిలిపివేసిన ఘటనకు సంబంధించి సాక్షి దినపత్రికలో వచ్చిన వార్త పై రఘురామకృష్ణంరాజు స్పందించారు. కారును నిలిపివేసిన అధికారుల వివరాలను వెల్లడించే క్రమంలో లో మహిళా అధికారిని ఇంటి పేరుతో అడుసుమిల్లి సంధ్య అంటూ ప్రచురించి, మరొక అధికారి పేరు తిరుపాల్ గా పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అయితే సదరు అధికారి పేరు తిరుపాల్ రె డ్డి అని పేర్కొన్న రఘురామ కృష్ణంరాజు, అడుసుమల్లి సంధ్య ఇంటి పేరు రాయడం వెనుక ఆమె కమ్మ కులానికి చెందిన అధికారిని అని నిర్ధారించే ప్రయత్నం చేశారని వెల్లడించారు. ఆ కారు ఆపింది కమ్మ అధికారిని అన్న సంకేతాన్ని ప్రజల్లోకి పంపే ప్రయత్నం చేయడమే కాకుండా, అనంతరం సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసేందుకు కుట్రకు తెరలేపారని వివరించారు.

సాక్షి దినపత్రికలో ఇచ్చిన పూర్తి పేజీ ప్రకటనపై కూడా రఘురామకృష్ణంరాజు తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ ఖర్చుతో ఇచ్చిన ప్రకటన లో గత ప్రభుత్వం, మన ప్రభుత్వం అని పేర్కొని విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని చెప్పారు. ప్రభుత్వం సొమ్ముతో ఇచ్చిన ప్రకటన ద్వారా గత ప్రభుత్వం పై విమర్శలు చేయడం ఏమిటని ఆయన మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇస్తుండగా, ప్రభుత్వ వర్సిటీలను చదివిన వారికి మాత్రమే స్కాలర్షిప్ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేర్కొనడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. దీని ద్వారా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉన్నత విద్యకు దూరం చేయడమేనని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఏ ఉద్యోగానికైనా, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యా అర్హత కావలసి ఉన్నదని, అటువంటప్పుడు ఎస్సీ ఎస్టీలు ఎలా ఉద్యోగాలను దక్కించుకో గలరని ప్రశ్నించారు.