– టిటిడి ఈవో శ్యామల రావు
తిరుచానూరు: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు టిటిడి ఈవో శ్రీ శ్యామల రావు తెలిపారు. తిరుచానూరులోని పసుపు మండపం నుంచి పుష్కరిణి, ఆలయ వీధుల్లో తిరుపతి టిటిడి జేఈవో వీరబ్రహ్మం, సివీఎస్వో శ్రీధర్, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తదితర అధికారులతో కలిసి శనివారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ నవంబర్ 28 నుంచి డిసెంబరు 6వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని, అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు తదితర ఇంజినీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆలయం, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అలంకరణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పిఏ సిస్టమ్, ఎల్‌ఇడి తెరలు ఏర్పాటు చేయాలన్నారు.
హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కళాబృందాలతో ఆకర్షణీయంగా ఉండేలా ప్రదర్శనలు చేపట్టాలని సూచించారు. భక్తులను ఆకట్టుకునేలా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి, శిల్పారామం, తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేయాలని కోరారు.
శుక్రవారపు తోటలో పుష్పప్రదర్శనశాలతోపాటు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు చేపట్టాలని ఈవో సూచించారు. బ్రహ్మోత్సవాల రోజులతోపాటు పంచమితీర్థం నాడు మెరుగ్గా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, తోళప్ప గార్డెన్స్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా, పోలీసు, రెవెన్యూ, పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకుని భక్తులకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఈ బ్రహ్మోత్సవాలను సంప్రదాయబద్ధంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.
ఈ సమావేశంలో టిటిడి ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణ, ఎఫ్ ఏ&సీఏవో బాలాజీ, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్) వేంకటేశ్వర్లు, ట్రాన్స్‌పోర్టు జిఎం శేషారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్, తదితర అధికారులు పాల్గొన్నారు.