Suryaa.co.in

Telangana

బాపూ ఘాట్ అభివృద్ధికి 222.27 ఎక‌రాలు బదిలీ చేయండి

* ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విన‌తి
* మామునూరు విమానాశ్ర‌య ప‌నుల‌కు అనుమ‌తి ఇవ్వండి.
* పాల్వంచ‌, అంత‌ర్గాం, ఆదిలాబాద్ విమానాశ్ర‌యాలు మంజూరు చేయండి..
* పౌర విమాన‌యాన శాఖ మంత్రి కె.రామ్మోహ‌న్ నాయుడుకు సీఎం రేవంత్ విన‌తి

ఢిల్లీ: హైద‌రాబాద్‌లో ఈసా, మూసీ న‌దుల సంగ‌మ స్థ‌లంలోని బాపూ ఘాట్ అభివృద్ధికి ర‌క్ష‌ణ శాఖ ప‌రిధిలోని 222.27 ఎక‌రాల భూమిని రాష్ట్ర ప్ర‌భుత్వానికి బ‌దిలీ చేయాల‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. మ‌హాత్మా గాంధీ చితాభ‌స్మాన్ని క‌లిపిన‌ చోట ఏర్పాటు చేసిన బాపూ ఘాట్ ను ప్రపంచ స్థాయిలో గాంధీ తాత్విక‌త‌ను చాటే కేంద్రంగా తీర్చిదిద్దాల‌ని త‌మ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు.

ఢిల్లీలో రక్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం సాయంత్రం క‌లిశారు. బాపూ ఘాట్ వ‌ద్ద గాంధీ సిద్దాంతాల‌ను ప్ర‌చారం చేసే నాలెడ్జ్ హ‌బ్‌, ధ్యాన గ్రామం (మెడిటేష‌న్ విలేజ్‌), చేనేత ప్ర‌చార కేంద్రం, ప్ర‌జా వినోద స్థ‌లాలు, ల్యాండ్ స్కేప్ ఘాట్లు, శాంతి విగ్ర‌హం (స్టాట్యూ ఆఫ్ పీస్‌), మ్యూజియంల‌తో గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టును చేప‌ట్టనున్నామ‌ని కేంద్ర మంత్రికి సీఎం వివ‌రించారు. ఇందుకోసం ర‌క్ష‌ణ శాఖ భూమిని బ‌దిలీ చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

పారిశ్రామిక‌, ర‌వాణాభివృద్ధికి…

తెలంగాణ‌లో పారిశ్రామికాభివృద్ధి.. ప్ర‌జ‌ల‌కు ర‌వాణా వ‌స‌తుల మెరుగుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి సారిస్తోంద‌ని పౌర విమాన‌యాన శాఖ మంత్రి కె.రామ్మోహ‌న్ నాయుడుకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని ముఖ్య‌మంత్రి మంగ‌ళ‌వారం సాయంత్రం క‌లిశారు. తెలంగాణ‌లో రెండో పెద్ద న‌గ‌ర‌మైన వ‌రంగ‌ల్‌లో విమానాశ్ర‌య ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన నిర‌భ్యంత‌ర ప‌త్రాన్ని (ఎన్‌వోసీ) రాష్ట్ర ప్ర‌భుత్వం జీఎంఆర్ నుంచి (ఒక విమానాశ్ర‌యం నుంచి మ‌రో విమానాశ్ర‌యానికి 150 కి.మీ.దూరం ఉండాల‌నే నిబంధ‌న) పొందింద‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు.

253 ఎక‌రాల భూ సేక‌ర‌ణ‌కు అవ‌స‌ర‌మైన రూ.205 కోట్ల‌ను భార‌త విమాన‌యాన సంస్థ (ఏఏఐ)కి అంద‌జేసింద‌ని వివ‌రించారు. విమానాశ్ర‌య ప‌నుల‌కు అవ‌స‌ర‌మైన అనుమ‌తులు, అక్క‌డి నుంచి విమానాలు న‌డిపేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడిని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో విమానాశ్ర‌య ఏర్పాటుకు గ‌తంలో గుర్తించిన స్థ‌లం అనువుగా లేనందున ప్ర‌త్యామ్నాయంగా పాల్వంచ‌లో 950 ఎక‌రాలు గుర్తించామ‌ని కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడుకు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

ఆ భూమి వివ‌రాలు ఏఏఐ అంద‌జేశామ‌ని, వెంట‌నే విమానాశ్ర‌య ఏర్పాటుకు అనుమ‌తులు ఇవ్వాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. పెద్ద‌ప‌ల్లి జిల్లాలో గ‌తంలో గుర్తించిన భూమి విమానాశ్ర‌య నిర్మాణానికి అనువుగా లేద‌ని ఏఏఐ ప్రీ-ఫీజుబిలిటీ స‌ర్వేలో తేలింద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడుకు తెలిపారు. దానికి ప్ర‌త్యామ్నాయంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అంత‌ర్గాంలో 591.24 ఎక‌రాలు గుర్తించింద‌ని… అక్క‌డి విమానాశ్ర‌య ఏర్పాటుకు అనుమ‌తులు ఇవ్వాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.

ఆదిలాబాద్‌లో భార‌త వైమానిక ద‌ళం (ఐఏఎఫ్‌) ఆధ్వ‌ర్యంలో ఇప్ప‌టికే 369.50 ఎక‌రాల భూమి ఉంద‌ని, పూర్తి స్థాయి కార్య‌క‌లాపాల‌కు అద‌నంగా 249.82 ఎక‌రాలు అవ‌స‌ర‌మ‌ని కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడుకు సీఎం రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు. అద‌నంగా అవ‌స‌ర‌మైన భూమి సేక‌రించి అప్ప‌గించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని కేంద్ర మంత్రికి సీఎం వివ‌రించారు. గిరిజ‌నులు ఎక్కువ‌గా ఉన్న ఆదిలాబాద్ కు వెంట‌నే విమానాశ్ర‌యం మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞ‌ప్తి చేశారు.

సీఎం కేంద్ర మంత్రుల‌ను క‌లిసిన కార్య‌క్ర‌మాల్లో ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి, ఎంపీలు చామ‌ల కిర‌ణ్‌ కుమార్ రెడ్డి, కె.ర‌ఘువీర్ రెడ్డి, ఎం.అనిల్ కుమార్ యాద‌వ్‌, ఆర్‌.రఘురామిరెడ్డి, డాక్ట‌ర్ క‌డియం కావ్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE