– 65 శాతం పోలింగ్
– కాంగ్రెస్‌కే జైకొట్టిన మైనారిటీలు
– మెదక్, వరంగల్‌లో పోటీ ఇచ్చిన బీఆర్‌ఎస్
– కాంగ్రెస్-బీజేపీ మధ్యనే పోటీ
– హైదరాబాద్ బీజేపీ అభ్యర్ధి మాధవీలతపై కేసు
– హైదరాబాద్‌లో ఓటింగ్‌కు విముఖత చూపిన మైనారిటీలు
– తొలిసారి ఇళ్లకు వెళ్లి ఓటర్లను అభ్యర్ధించిన మజ్లిస్
– నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్ధి రఘువీర్‌కు అత్యధిక మెజారిటీ?
( అన్వేష్)
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. కడపటి వార్తలు అందే సమయానికి, 65 శాతం పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో మెదక్-వరంగల్‌లో గట్టి పోటీ ఇచ్చిన బీఆర్‌ఎస్, మిగిలిన స్థానాల్లో పెద్దగా ప్రభావం చూపలేదని సమాచారం. మిగిలిన అన్ని స్థానాల్లో కాంగ్రెస్-బీజేపీ మధ్య హోరాహోరీ సాగినట్లు కనిపించింది. అయితే హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఓటర్లు పెద్దగా బయటకు రాకపోవడం మజ్లిస్, బీజేపీకి మైనస్ పాయింటేనన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొద్దినెలలకే వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో, కాంగ్రెస్-బీజేపీ హోరాహోరీ తలపడ్డాయి. కడపటి వార్తలు అందే సమయానికి తెలంగాణలో 65 శాతం పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల ఓటర్లు బద్దకించడంతో, మధ్యాహ్నం వరకూ పోలింగ్ బూత్‌లు ఖాళీగా కనిపించాయి. ప్రధానంగా హైదరాబాద్-సికింద్రాబాద్‌లో ఓటర్లు మధ్యాహ్నం వరకూ బయటకు రాలేదు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఓటర్లు క్యూలు కట్టారు. ఈ ఎన్నికలు ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, మెదక్‌లో మాజీ సీఎం-బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్ఠకు సవాలుగా మారాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బాహాటంగా మద్దతిచ్చిన మజ్లిస్.. ఈ ఎన్నికల్లో మాత్రం జాతీయ కోణంలో కాంగ్రెస్‌కే జైకొట్టింది. కాంగ్రెస్ అభ్యర్ధులకే ఓటు వేయమని, ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. దానికితోడు కాంగ్రెస్‌కు ఓటు వేసి బీజేపీకి బుద్ధి చెప్పాలంటూ, ముస్లిం మత సంస్థలన్నీ పిలుపునిచ్చాయి. ఆ మేరకు మసీదులో కూడా ఫత్వా జారీ చేయడం, కాంగ్రెస్‌కు కలసి వచ్చే అంశమే. దీనితో ముస్లిం ఓట్లన్నీ గంపగుత్తగా కాంగ్రెస్‌కే పోలయ్యాయి. ఇది బీఆర్‌ఎస్‌కు శరాఘాతమే.
ఇక రైతులు మరోసారి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు కనిపించింది. ప్రధానంగా పంద్రాగస్టులోగా 2 లక్షల రుణమాఫీ హామీ, వారిని కాంగ్రెస్ వైపు నడిపించినట్లు గ్రామాల్లో పోలింగ్ సరళి స్పష్టం చేసింది. కాగా తెలంగాణలో నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్ధి రఘువీర్‌రెడ్డికి, అత్యధిక మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నల్లగొండలో కాంగ్రెసు గెలుపు ఏకపక్షంగానే కనిపించింది.
ఇక తెలంగాణలో మహిళలే ఎక్కువ సంఖ్యలో పోలింగ్‌బూత్‌ల వద్ద కనిపించారు. వారిలో 60శాతం కాంగ్రెస్‌కే ఓటు వేసినట్లు చెబుతున్నారు. కాగా బ్రాహ్మణ-వైశ్య-మార్వాడీ-ఉత్తరాది వర్గాలన్నీ బీజేపీకే జై కొట్టినట్లు కనిపిస్తోంది. ప్రధానంగా మధ్య తరగతి వర్గాలు, విద్యావంతులు కూడా బీజేపీ వైపే మొగ్గు చూపారు. ఫలితంగా పోటీ అంతా కాంగ్రెస్-బీజేపీ మధ్యనే కేంద్రీకృతమైనట్లు క నిపించింది. బీజేపీ అభ్యర్ధులపై వ్యక్తిగతంగా అసంతృప్తి ఉన్నప్పటికీ, వారంతా జాతీయ కోణంలో మోదీని చూసి ఓటేసిన పరిస్థితి కనిపించింది. బీఆర్‌ఎస్ మాత్రం మెదక్-వరంగల్ స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చింది. ఆ రెండింటిలో ఒక స్థానం గెలిచే అవకాశం కనిపిస్తోంది.
ప్రతి ఎన్నికల్లోనూ ఓటర్లతో కిటకిటలాడే హైదరాబాద్ పోలింగ్ బూత్‌లు, ఈసారి ఓటర్లు లేక వెలవెల పోవడం మజ్లిస్‌ను ఆందోళన పరిచే అంశమే. దానితో చరిత్రలో తొలిసారి మజ్లిస్ కార్యకర్తలు.. పోలింగ్ మధ్యలో ఓటర్ల ఇళ్లకు వెళ్లి, తలుపు కొట్టి మరీ ఓటింగుకు రావాలంటూ అభ్యర్ధించడం విశేషమే. అటు హైదరాబాద్ బీజేపీ అభ్యర్ధి, ఫైర్‌బ్రాండ్ మాధవీలత తనదున ప్రచారశైలితో, మజ్లిస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఆ ప్రచారమే ఆమెకు ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టింది.
సహజంగా ఎప్పుడూ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడే మజ్లిస్ బ్రదర్స్‌ను.. చరిత్రలో తొలిసారి గుళ్లకు తీసుకువచ్చి, అర్చన కూడా చేయించిన ఘనత మాధవీలతకే దక్కింది. హైదరాబాద్‌లో ఈసారి సహజ సంప్రదాయానికి భిన్నంగా.. హిందువుల ఓట్లు చీలకుండా, బీజేపీకే గంపగుత్తగా పోలయినట్లు కనిపించింది. కాగా తాజాగా పోలింగ్ సందర్భంగా, ఆమె ముస్లిం మహిళల బురఖా తొలగించారన్న ఆరోపణలతో, ఈసీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు.