Suryaa.co.in

Editorial

నాగబాబు ట్వీట్ అల్లు అర్జున్ మీదేనా?

-పవన్ ప్రచారానికి రాని అల్లు అర్జున్
-పవన్ కోసం పిఠాపురం వెళ్లిన రాంచరణ్
-వైసీపీ అభ్యర్ధికి ప్రచారానికి వెళ్లిన అల్లు
-పవన్ వ్యక్తిగత జీవితంపై వైసీపీ దుష్పచారం
-అయినా ఆ పార్టీకే అల్లు అర్జున్ ప్రచారం
( మార్తి సుబ్రహ్మణ్యం)

జనసేనాధిపతి పవన్ కల్యాణ్ అన్నయ్య, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ నాగబాబు ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే’ అని ట్వీట్ చేయడం కొత్త చర్చకు తెరలేపింది. దీనిపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి.

ఇటీవల మెగా హీరో అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవిచంద్రారెడ్డి ఇంటికెళ్లి మద్దతిచ్చిన విషయం తెలిసిందే.ఈ ఘటనలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయనపై ఈసీ కేసు కూడా పెట్టిన విషయం తెలిసిందే. దీంతో బన్నీని ఉద్దేశించే ఈ ట్వీట్ చేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అయితే పిఠాపురంలో పోటీచే స్తున్న జనసేనాధిపతి, తన మామ పవన్ కల్యాణ్‌కు మద్దతునివ్వని అల్లు అర్జున్.. వైసీపీలోని తన మిత్రుడి గెలుపుకోసం ప్రచారం చేయడంపై పవన్ ఫ్యాన్స్ ఫైరయ్యారు. ఇప్పటికే చిరంజీవి కొడుకు రాంచరణ్‌తేజ, సోదరి కొడుకు సాయిధరమ్‌తేజ పిఠాపురంలో, బాబాయ్ గెలుపు కోసం ప్రచారం చేశారు. సాయిధరమ్‌తేజపైనయితే వైసీపీ కార్యకర్తలు ఖాళీ బీరు సీసాలు విసిరేశారు.

సినిమా పరిశ్రమలో పవన్‌కు ఏమీకాని చాలామంది నటులు వచ్చి, పవన్‌కు సంఘీభావం ప్రకటించారు. చిరంజీవి కూడా తమ్ముడిని గెలిపించాలని కోరారు. ఆయన ప్రచారానికి రాలేకపోయినా సతీమణి వచ్చి, మరిదిని ఆశీర్వదించారు. అయితే కుటుంబంలోని అల్లు అర్జున్ మాత్రం, పవన్‌కు ప్రచారం చేయాల్సింది పోయి.. ఆయన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్న, జగన్ పార్టీకి ప్రచారం చేయడం ఏమిటని, పవన్ ఫాన్సు కారాలు మిరియాలు నూరుతున్నారు. నాగబాబు కూడా, బహుశా పవన్ అభిమానుల ఆగ్రహజ్వాల చల్లార్చేందుకే ఈ ట్వీట్ చేసినట్లు కనిపిస్తోంది.

LEAVE A RESPONSE