- కేవలం కార్పొరేట్ సంస్థలకు మాత్రమే లాభం
- విద్యుత్ బిల్లు ఆమోదంతో భవిష్యత్తులో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే ప్రమాదం
- విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి
- విద్యుత్ జేఏసీ ” మహా ధర్నా ” లో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
- విద్యుత్ జేఏసీ పోరాటానికి టీ.ఆర్.ఎస్. సంపూర్ణ మద్దతు
సామాన్య ప్రజలకు పూర్తిగా వ్యతిరేకమైన విద్యుత్ సవరణ బిల్లు, కేవలం కార్పొరేట్ సంస్థలకు మాత్రమే అనుకూలమైన బిల్లును కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రాలను సంప్రదించకుండా ఏకపక్షంగా విద్యుత్ సవరణ బిల్లు – 2022ను పార్లమెంటులో ప్రవేశపెట్టిందని, అయితే విపక్ష పార్టీల నిరసనలతో తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం చివరికి పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి సిఫార్సు చేసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
విద్యుత్ సవరణ బిల్లు – 2022 ను వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ సోమవారం ఖైరతాబాద్ లోని విద్యుత్ సౌధాలో నిర్వహించిన ” మహా ధర్నా ” లో వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.విద్యుత్ జేఏసీ ఆందోళనకు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని వినోద్ కుమార్ ప్రకటించారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ విద్యుత్ సవరణ బిల్లు – 2022 సామాన్య ప్రజలకు పూర్తిగా వ్యతిరేకమని, కేవలం కార్పొరేట్ సంస్థలకు మాత్రమే అనుకూలమని పేర్కొన్నారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అహంకార పూరితంగా, నియంతృత్వ పోకడలతో విద్యుత్ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి సామాన్య ప్రజల నడ్డి విరిచే చర్యలకు పాల్పడుతోందని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
సామాన్య ప్రజల జీవితాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాగుడుమూతలు ఆడుతున్నారని వినోద్ కుమార్ ఆరోపించారు.ఇప్పటికే కేంద్రంలోని అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు దారి పట్టించిన బిజెపి ప్రభుత్వం.. తాజాగా దేశ వ్యాప్తంగా విద్యుత్ సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజలకు ఉపయోగంగా ఉండే మోది మౌలిక సదుపాయాల అంశాలు ప్రభుత్వ పరిధిలోనే ఉండాలని, అందులో విద్యుత్ రంగం అతి కీలకమైందని వినోద్ కుమార్ అన్నారు.2003 సంవత్సరంలో తీసుకొచ్చిన విద్యుత్ చట్టంలో సవరణలు చేస్తూ ఈరోజు మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా, ఎవరితో చర్చించకుండానే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారని వినోద్ కుమార్ తెలిపారు.
విద్యుత్ సవరణ బిల్లు ఆమోదం పొందితే రానున్న రోజుల్లో రైతుల మోటార్లకు మీటర్లు బిగించే ప్రమాదం ఉంటుందని అన్నారు. చిన్న, సన్నకారు రైతులకు, చిన్న తరహా పరిశ్రమలకు ఈ బిల్లు ప్రమాదకరంగా మారుతుందని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.