– రాష్ట్రంపై మాత్రం రుణ భారం
– ఇదొక మాయాజాలం!
రాయలసీమ ఎత్తిపోతల పథకాల నిర్మాణం పేరుతో రు.900 కోట్లు ఆర్.ఈ.సి. మరియు పవర్ పైనాన్స్ కార్పోరేషన్ ల నుండి రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొని, ప్రభుత్వ ఖజానాలో జమ చేయకుండా, నేరుగా కాంట్రాక్టు సంస్థ ఖాతాలో జమ చేసినట్లు ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పైఆవుల కేశవ్ గారు ఆరోపించారు.
కేశవ్ గారి ఆరోపణపై స్పందించిన ప్రభుత్వం ఒక ప్రకటన ద్వారా ” రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ “స్టే” విధించక ముందు జరిగిన పనులను పరిశీలించిన మీదటనే ఆర్.ఈ.సి. మరియు పవర్ పైనాన్స్ కార్పోరేషన్ రు.739.5 కోట్లు రుణం మంజూరు చేశాయని, ఆ మొత్తాన్ని ప్రభుత్వ అనుమతితోనే కాంట్రాక్టు సంస్థ ఖాతాకు నేరుగా జమ చేయడం జరిగిందని” తెలియజేసినట్లు ఈనాడు దినపత్రికలో చదివాను. అంటే, కేశవ్ గారు చేసిన ఆరోపణ నిజమని ప్రభుత్వం ఒప్పుకున్నది కదా!
రు.3,278 కోట్ల వ్యయ అంచనాతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డిగారి ప్రభుత్వం 2020 ఆగస్టులో ప్రకటించి, నిర్మాణ పనులను ప్రారంభించింది. ఆ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం వివాదాస్పదం చేసింది.
జాతీయ హరిత ట్రిబ్యునల్ లో వ్యాజ్యం కూడా దాఖలు వేశారు. విచారణ చేపట్టి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డును క్షేత్ర స్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించమని ట్రిబ్యునల్ ఆదేశించింది. బోర్డు నివేదిక సమర్పించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంపై “స్టే” విధించింది. నిర్మాణం ఆగిపోయింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక నిర్మాణ పనులకే రు.739.5 కోట్లు వ్యయం చేశారా? లేదా, మరేయితర ఎత్తిపోతల పథకాలకైనా ఈ మొత్తంలో కొంత భాగాన్ని ఖర్చు చేశారా? రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీతనంతో ప్రజలకు స్పష్టత కల్పించాలి. రాయలసీమ ఎత్తిపోతల పథకానికే ఖర్చు చేశామంటే ఏ మాత్రం నమ్మశక్యంగా లేదు.
ప్రభుత్వం ఆర్.ఈ.సి. మరియు పవర్ పైనాన్స్ కార్పోరేషన్ ల నుండి తీసుకొన్న రుణం మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయకుండా కాంట్రాక్టు సంస్థకు నేరుగా జమ చేయడం ముమ్మాటికీ ఆర్థిక క్రమశిక్షణను ఉల్లంఘించడమే.
రాయలసీమ ఎడారి నివారణా పథకమంటూ ఆశలు రేకెత్తించిన ప్రభుత్వం ఒక కార్పోరేషన్ కూడా ఏర్పాటు చేసింది. దాని ద్వారా నలభై వేల కోట్ల నిధులను సమీకరించి, నిర్మాణంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ఆ కార్పోరేషన్ ద్వారా కూడా ప్రభుత్వం అప్పులు తెచ్చిందా! అప్పు చేసి ఉంటే ఆ నిధులను ఏఏ ప్రాజెక్టుకు ఎంతెంత వ్యయం చేశారో! బహిరంగపరచాలి.