అగ్రిగోల్డ్ బాధితుల సొమ్ము దారిమళ్లించిన జగన్ రెడ్డి మార్గదర్శిపై కక్షసాధించడం హాస్యాస్పదం
– ఒక్క ఖాతాదారుడూ ఫిర్యాదు చేయని మార్గదర్శిపై సోదాలు, అరెస్ట్ లు చేయడం జగన్ రెడ్డి మార్క్ రాజకీయానికి నిదర్శనం
– వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఈనాడు గళమెత్తినందుకే జగన్ రెడ్డి అక్కసు
– తెదేపా శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని కల్లబొల్లి కబుర్లు చెప్పి తీరా అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా వారి సమస్యలు పట్టించుకోని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక్క ఖాతాదారుడూ ఫిర్యాదు చేయని మార్గదర్శిపై కక్షసాధింపు చర్యలకు దిగడం దుర్మార్గం. రాష్ట్రంలో ఏసీబీ, జేసీబీ, పీసీబీ పాలన నడుస్తోందనడానికి ఇదే నిదర్శనం. జగన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలపై ఈనాడు కథనాలు ప్రసారం చేస్తోందనే అక్కసుతోనే మార్గదర్శిపై పడ్డారు. సీఐడీని అడ్డుపెట్టుకుని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు.
ఏదైనా ఒక సంస్థ ప్రమాదంలో పడితే ఖాతాదారులు ఊరుకుంటారా? వెంటనే తమ డబ్బులు తిరిగి చెల్లించమంటారు. మార్గదర్శి విషయంలో అలా ఏమైనా జరిగిందా? మార్గదర్శిని కుప్పకూల్చడం ద్వారా ఈనాడు ఆర్థిక మూలాలను దెబ్బతీయొచ్చని జగన్ రెడ్డి కుయుక్తులు పన్నుతున్నారు. మార్గదర్శి ఖాతాదారుల లిస్ట్ తీసుకుని స్వయంగా సీఐడీ అధికారులు వారికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగుతుండటం జగన్ రెడ్డి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. మార్గదర్శిలో మా డబ్బులు భద్రంగా ఉన్నాయి. మేము గడువు ముగిశాకే డబ్బులు తిరిగి తీసుకుంటామని ఖాతాదారులు కుండబద్దలు కొడుతున్నా జగన్ రెడ్డి అండ్ కోకు సిగ్గు రావడంలేదంటే వారిని ఏమనాలి? ఒక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసుకుని మరీ మార్గదర్శి ఖాతాదారులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారంటే జగన్ రెడ్డిలో ఎంతటి అరాచకవాది ఉన్నాడో అర్ధమవుతోంది.
సోదాల పేరుతో మార్గదర్శి కార్యాలయాల్లో విలువైన డాక్యుమెంట్లు తరలించారు. బ్రాంచ్ మేనేజర్లను అరెస్ట్ చేయించారు. విచారణ పేరు చెప్పి రామోజీరావు, శైలజ ఫోటోలను బయటకు వదిలారు. ఇదంతా జగన్ రెడ్డి రాజకీయ కక్షసాధింపు కాక మరేమిటి? ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ఇలాంటివి చూశామా? చిట్ ఫండ్ యజమాని తన కమీషన్ ను పెట్టుబడిగా పెట్టుకోవచ్చని 1982 చిట్ ఫండ్ చట్టమే చెబుతోంది కదా. కేవలం కంపెనీ ఆర్జించే కమీషన్, ఇతర ఆదాయ నిల్వలను మ్యూచువల్ ఫండ్స్, ఇతర షేర్లు పెట్టుబడులుగా పెట్టారు. చిట్ సంస్థలు వ్యాపారం చేయకూడదని జగన్ రెడ్డి రాజ్యాంగం చెబుతోందా? 2022 మార్చి 31 నాటికి కంపెనీ లిక్విడ్ అసెట్స్/ఆస్తులు విలువ రూ. 2,723 కోట్లు కాగా చందాదారులకు చెల్లించాల్సింది కేవలం రూ. 1170 కోట్లు మాత్రమే.
కానీ జగన్ రెడ్డి మాత్రం మార్గదర్శి అక్రమాలకు పాల్పడి అవినీతి చేసినట్టు అభూత కల్పనలు సృష్టిస్తున్నారు. పాలకులకు అధికారులు గుడ్డిగా వంత పాడుతున్నారు. సీఐడీ అయినా ఏసీబీ అయినా రూల్స్ కు విరుద్ధంగా జగన్ రెడ్డి చెప్పినట్టల్లా తలాడిస్తున్నందుకు మూల్యం చెల్లించుకోక తప్పదు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా రూల్స్ అతిక్రమించి వ్యవహరిస్తున్న అధికారులు శిక్షార్హులే. సీఐడీ ఈ విషయం గుర్తుంచుకుంటే మంచిది. అగ్రిగోల్డ్ బాధితులను మోసం చేసి డిపాజిటర్లకు చేరాల్సిన నిధులను మళ్లించిన జగన్ రెడ్డి ఏ మచ్చా లేని మార్గదర్శిపై కక్షసాధింపు చర్యలకు పూనుకోవడం దుర్మార్గం, అమానుషం. ఇకనైనా కక్షపూరిత రాజకీయాలకు జగన్ రెడ్డి స్వస్తిపలకాలి. లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదు.