Suryaa.co.in

National

భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్ కు అత్యవసర వినియోగ అనుమతి

దిల్లీ: కొవిడ్‌ నుంచి రక్షణ కల్పించేందుకు భారత్‌ బయోటెక్‌ (Bharat Biotech) రూపొందించిన ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందుకు (నాసల్‌ వ్యాక్సిన్‌) అత్యవసర వినియోగ అనుమతి లభించింది.ఈ మేరకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) అనుమతి ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. 18 ఏళ్లు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు అత్యవసర అనుమతులు మంజూరైనట్లు తెలిపారు. కొవిడ్‌పై భారత్‌ సాగిస్తున్న పోరును ఈ టీకా మరింత బలోపేతం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగం, అందరి సహకారంతో భారత్‌ సమర్థంగా కొవిడ్‌ను ఓడిస్తామని మంత్రి ధీమా వ్యక్తంచేశారు. దేశంలో అనుమతి పొందిన తొలి నాసల్‌ వ్యాక్సిన్‌ ఇదే కావడం గమనార్హం.

గర్వంగా ఉంది: డాక్టర్‌ కృష్ణా ఎల్లా
ముక్కు ద్వారా ఇచ్చే నాసల్‌ వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతులు మంజూరు అవ్వడంపై భారత్‌ బయోటెక్‌ సంతోషం వ్యక్తంచేసింది. గ్లోబల్‌ గేమ్‌ ఛేంజర్‌ అయిన తమ చుక్కల మందు ఇన్‌కోవాక్‌ (iNCOVACC)కు అనుమతులు లభించడం గర్వంగా ఉందని సంస్థ ఎండీ, ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణా ఎల్లా పేర్కొన్నారు. భవిష్యత్‌లో సంభవించే అంటు వ్యాధులను ఎదుర్కొనేందుకు నాసల్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధిని కొనసాగిస్తామని చెప్పారు. ఈ వ్యాక్సిన్‌ అభివృద్ధికి సహకరించిన కేంద్ర ఆరోగ్య శాఖ, సీడీఎస్‌సీఓ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ గవర్నర్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా, వాషింగ్టన్‌ యూనివర్సిటీ సెయింట్‌ లూయిస్‌కు కృష్ణా ఎల్లా ధన్యవాదాలు తెలిపారు. ప్రయోగాల్లో భాగంగా ఈ నాసల్‌ వ్యాక్సిన్‌ను ప్రైమరీ వ్యాక్సిన్‌గానూ, రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి బూస్టర్‌గానూ ఇవ్వగా.. మెరుగైన ఫలితాలు వచ్చాయని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.

LEAVE A RESPONSE