* రాష్ట్ర బీసీ శాఖ మంత్రి సవిత
* గుంటూరులో డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించిన మంత్రి
* అన్ని జిల్లా కేంద్రాల్లోనూ డీస్సీ కోచింగ్ సెంటర్లు
* త్వరలో ఆన్ లైన్లోనూ ఉచిత డీఎస్సీ కోచింగ్
* డిసెంబర్ నుంచి సివిల్స్ కోచింగ్
* చంద్రబాబు నేతృత్వంలో 1.80 లక్షల టీచర్ పోస్టుల భర్తీ
గుంటూరు : రానున్న అయిదేళ్ల కాలంలో 20 లక్షల మంది ఉద్యోగ, ఉఫాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖామాత్యులు ఎస్.సవిత తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి డీఎస్సీ నిర్వహణ పూర్తయి, అపాయింట్ మెంట్ ఆర్డర్లతో నూతన ఉపాధ్యాయు బాధ్యతల్లో చేరడం ఖాయమని స్పష్టంచేశారు.
వచ్చే నెల నుంచి బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్స్ కోచింగ్ ప్రారంభించనున్నామని తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్ ను గుంటూరు కలెక్టరేట్లో ఉన్న ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో ఎమ్మెల్యే మహ్మద్ నజీర్, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఏసురత్నంతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సీఎం చంద్రబాబునాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీ నిర్వహణ ఫైల్ పై చేశారన్నారు.
16,347 టీచర్ పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించారన్నారు. సీఎం చంద్రబాబు స్ఫూర్తితో తన సంతకం కూడా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్ల ఏర్పాటు ఫైల్ సంతకం చేసినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దానిలో భాగంగా గుంటూరు డీఎస్సీ కోచింగ్ సెంటర్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రెండు నెలల పాటు ఈ శిక్షణా తరగతుల కొనసాగనున్నాయన్నారు.
అభ్యర్థులకు నెలకు రూ.1500 స్టయిఫండ్ తోపాటు రూ. 1000లు పుస్తకాల కొనుగోలుకు అందజేయనున్నామన్నారు. రాబోయే అయిదేళ్లలో 20 లక్షల మంది యువతీ యువకులకు 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే సీఎం చంద్రబాబునాయుడు ధ్యేయమన్నారు. చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా మంత్రి నారా లోకేశ్…రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు దేశ విదేశాల్లో కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతున్నారు. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు సులభంగా లభిస్తాయన్నారు.
చంద్రబాబు, లోకేశ్ స్ఫూర్తితో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వెనుకబడిన తరగతుల యువకులు ఎక్కువ టీచర్ పోస్టులు సాధించాలన్న ఉద్దేశంతో డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సబ్జెక్టుల వారీగా నిష్ణాతులైన అధ్యాపకులతో కోచింగ్ ఇవ్వనున్నామన్నారు. బీసీ సంక్షేమ శాఖ అందిస్తున్న ఈ సదావకాశాన్ని వినియోగించుకుని, బీసీ అభ్యర్థులు ఎక్కువ టీచర్ పోస్టులు సాధించాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు.
త్వరలో ఆన్ లైన్ డీఎస్సీ కోచింగ్ ప్రారంభం
ఆఫ్ లైన్ లో అవకాశం లభించని వారికోసం ఆన్ లైన్ లోనూ డీఎస్సీ ఉచిత కోచింగ్ అందివ్వనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఇందుకు ప్రత్యేక వెబ్ సైట్ రూపొందిస్తున్నామన్నారు. తమకు నచ్చిన సమయంలో ఓపెన్ చేసి క్లాసు వినేలా వెబ్ సైట్ రూపొందిస్తున్నామన్నారు. ఈ వెబ్ సైట్ లో అధ్యాకుల వీడియోలతో పాటు పాత క్వశ్చన్ పేపర్లు, టెస్ట్ పేపర్లుం అందుబాటులో ఉంచనున్నామన్నారు. అర్హులందరికీ ఆన్ లైన్ ద్వారా డీఎస్సీ కోచింగ్ ఇవ్వనున్నామన్నారు.
డిసెంబర్ నుంచి సివిల్స్ కోచింగ్
యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంగా సీఎం చంద్రబాబునాయుడు ముందుకు సాగుతున్నారని మంత్రి సవిత వెల్లడించారు. ముఖ్యంగా బీసీ బిడ్డలు అత్యున్నత స్థానాల్లో నిలవాలన్నది ఆయన ఉద్దేశమన్నారు. చంద్రబాబు ఆశయం మేరకు డీఎస్సీకి మాత్రమే కాకుండా బీసీ బిడ్డలకు సివిల్స్ ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. డిసెంబర్ నుంచి తొలుత 100 మందికి సివిల్స్ కోచింగ్ అందివ్వనున్నామన్నారు. ఇప్పటికే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించామన్నారు. భవిష్యత్తులో నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా నిరుద్యోగ యువత అన్ని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా శిక్షణ అందజేస్తామన్నారు.
చంద్రబాబు నేతృత్వంలో 1.80 లక్షల టీచర్ పోస్టుల భర్తీ
చంద్రబాబు వస్తే జాబులు వస్తాయని గుర్తెరిగే రాష్ట్రంలో యువత ఇటీవల జరిగిన ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయాన్ని కూటమికి కట్టబెట్టారని మంత్రి సవిత తెలిపారు. 1994కు ముందు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో టీచర్ పోస్టులు భర్తీ చేసేవారన్నారు. తరవాత వచ్చిన సీఎం చంద్రబాబునాయుడు డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారన్నారు.
గడిచిన 30 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వాల నేతృత్వంలో 2.20 లక్షల ఉపధ్యాయ పోస్టులను నోట్ ఫై చేయగా 1.80 లక్షల పోస్టులను భర్తీ చేశామన్నారు. త్వరలో మరో 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నామన్నారు. 2019 తరవాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయలేదన్నారు. అయిదేళ్ల తరవాత ఎన్నికలకు రెండు నెలల ముందు తూతూ మంత్రంగా డీఎస్సీ నోటిఫికేషన్ అంటూ జగన్ హడావిడి చేసి, నిరుద్యోగ యువతను మోసం చేశారని మంత్రి మండిపడ్డారు.
అసభ్యకర పోస్టుల పెట్టిన వారిపై ఉక్కుపాదం
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టు పెట్టిన వారిపై ఉక్కుపాదం మోపుతామని మంత్రి సవిత హెచ్చరించారు. డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. గడిచిన అయిదేళ్లలో వెనుకబడిన వారికి తీవ్ర అన్యాయం చేసి జగన్ బీసీ ద్రోహిగా ముద్రపడ్డారన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుతం బడ్జెట్ లో బీసీల అభ్యున్నతికి సీఎం చంద్రబాబునాయుడు రూ.39 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించారన్నారు.
బీసీ మహిళలకు టైలరింగ్ లో శిక్షణిచ్చి, ఉచితంగా కుట్టు మిషన్లు అందజేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై ఉక్కుపాదం మోపుతామని ఓ ప్రశ్నకు సమాధానం మంత్రి సవిత తెలిపారు. తనపైనా అసహ్యకర పోస్టులు పెట్టారని, మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెట్టేవారిని క్షమించేది లేదని స్పష్టంచేశారు. అంతకుముందు ఎమ్మెల్సీ లక్ష్మణరావు సేకరించిన విద్యా, మనో విజ్ఞాన శాస్త్రం పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్, డైరెక్టర్ మల్లికార్జున, ఏపీ గౌడ కార్పొరేషన్ చైర్మన్ వెంకట గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.