సికింద్రాబాద్, డిసెంబరు 12 : క్రైస్తవ మతస్తులకు అన్ని రంగాల్లో ప్రాధాన్యతను కల్పిస్తున్న ప్ర భుత్వం తమదేనని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ పరిధిలో క్రిస్మస్ వేడుకలకు నిర్వహణకు సంబంధించి చర్చీలకు కానుకలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఉప సభాపతి పద్మారావు గౌడ్ సోమవారం లాంచనంగా ప్రారంభించారు. సీతాఫల్మండి లోని అవర్ లేడి చర్చి అఫ్ పర్పెచువల్ హెల్ప్ చర్చ ప్రాంగణంలో స్థానిక కార్పొరేటర్ కుమారి సామల హేమ, భారస యువ నేత తీగుల్ల రామేశ్వర్ గౌడ్, సీనియర్ నేత కరాటే రాజు, చర్చ్ నిర్వాహకులతో కలిసి క్రిస్మస్ దుస్తులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సికింద్రాబాద్ పరిధిలో తెలంగాణా ప్రభుత్వం ఏర్పడిన తరువాత అన్ని మతాలకు చెందిన వారి మనోభావాలను గుర్తించి గౌరవించే పద్దతిని పాటిస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలో కనీసం 10 వేల మంది క్రైస్తవులకు ప్రభుత్వ కానుకలు పంపిణీ చేసేలా ఏర్పాట్లు జరపాలని ఇప్పటికే అధికారులను ఆదేశించామని తెలిపారు. క్రిస్మస్ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. డీ పీ ఓ శ్రీనాద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.