Suryaa.co.in

Features

ప్రకృతి పరిహాసం..

చెట్టుకు చేతబడి చేసి మొక్కను మొక్కుబడిగ మార్చేసి..
ప్రకృతి మొత్తాన్ని పరిమార్చేసి
వనాలను మోడులుగా
పొలాలను బీడులుగా
మిగిల్చేసి
ఇప్పుడేడిస్తే ఏం లాభం?
విపత్తు ముంచుకొచ్చాక మొలిచేనా విత్తనం..
హరించేసినాక
చిగురించేనా హరితం..!?

నిన్ను మోస్తూ..అన్నీ ఇస్తూ
నీ పాపాలను భరిస్తూ..
నువ్వు పెట్టే
హింసలను సహిస్తూ
ఇన్నాళ్లూ.. ఇన్నేళ్ళూ
రోదించింది తల్లి భూమి..
నీకు వినిపించ లేదా ఏమి..?
కట్ట తెగింది.గుండె పగిలింది..
ఇది నువ్వు..నేను
మనందరం చేసిన తప్పు..
కొనితెచ్చుకున్న ముప్పు..
పాపం పండినట్టే..
ఆయువు మూడినట్టే..

మండుతోంది భూగోళం..
ఎండుతోంది పాతాళం..
చినుకు రాలదు
చిగురు మొలవదు..
ఆరుగాలాలు పోయె
ఎండాకాలమె మిగిలె..
క్రతువులు చేస్తే
రుతువులు మారేనా..
చెరువులు నిండేనా?
అంతా వృధా.. వ్యధా..
చేతులు కాలినాక
పట్టేందుకు ఆకులు
సైతం మిగలని కాలం…
కలికాలం..ఆకలికాలం..
తరుముకొస్తున్న ప్రళయం..
ముంచుకొస్తోంది విలయం..
ఎగసిపడుతున్న
వెచ్చటి ద్రవం
ఇదే కదా విధ్వంసక ఉపద్రవం..
అంతానికి ఇదే సంకేతం
పిశాచాల విజయకేతనం..
విరక్తిగా భూదేవి హాసం..
కసిగా మృత్యుదేవత
వికటాట్టహాసం..!

ఇప్పుడు విత్తు నాటితే
నేను..నా వాళ్ళు తినేనా..
ఇదే నీ మాటైతే విను..
నీ పూర్వీకులు
ఇలాగే ఆలోచిస్తే ఈరోజున
నువ్వు తినే మాటేనా..
ఇప్పుడు నీకు నీడనిచ్చే
ప్రతి చెట్టు ఒకనాడు
ఏ స్వార్థమూ లేక
నీ తాత నాటిన ఓ మొక్క
దాని ఫలమే తింటున్నావు
నువ్వు లొట్టలేస్తూ..
నువ్వూ ఆలోచించు
నీ తాతలాగే..
ఇప్పుడు నాటు..
రేపటి నీ తరాలకు
ఉండదు తినడానికి లోటు..
అత్యాశతో..నిర్లక్ష్యంతో
నువ్వు సృష్టించిన మోడులను..బీడులను
ముందు చూపుతో
మళ్లీ నువ్వే
పచ్చని పొలాలుగా..
చక్కటి వనాలుగా మార్చి
భవితను తీర్చి దిద్దవోయ్..!

-ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE