హైదరాబాద్: పర్యావరణ హితమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందని.. రాష్ట్రంలో కాలుష్య నియంత్రణకు అనేక చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
గత ఏడాది అక్టోబరులోనే ఎలక్ట్రానిక్ వాహనాల విధానం తీసుకొచ్చామని.. తయారీదారులతోపాటు వినియోగదారులనూ ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. పరిశోధన, అభివృద్ధి, నవీకరణలను ప్రోత్సహించేందుకు వీలుగా తయారీదారులకు ఎస్‌జీఎస్టీ తిరిగి ఇవ్వడం, విద్యుత్తు, వడ్డీ, రవాణా తదితర అంశాల్లో రాయితీలు, ప్రోత్సాహకాలను ఇస్తున్నట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు రహదారి పన్నుతో పాటు వాహన రిజిస్ట్రేషన్ ఫీజులో మినహాయింపు ఇస్తున్నట్లు వివరించారు.
హరితహారం కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల రాష్ట్రంలో 23 శాతంగా ఉన్న పచ్చదనం 28 శాతానికి పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వమే వెల్లడించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. వాహన కాలుష్యాన్ని తగ్గించే ప్రక్రియలో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ స్టోరేజీ పాయింట్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. రంగారెడ్డి జిల్లా చందనపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా దివిటి పల్లిలో రెండు చోట్ల క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జహీరాబాద్‌లో ఉన్న క్లస్టర్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఓ కంపెనీ ముందుకు వచ్చినట్లు తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి సంబంధించి రూ.5,600 కోట్ల పెట్టుబడులు ఆకర్షించామన్నారు. తద్వారా 8,300 ఉద్యోగాలు ప్రత్యక్షంగా, ఇంతకంటే రెట్టింపు పరోక్షంగా ఉపాధి లభిస్తాయన్నారు