Suryaa.co.in

Editorial

ఎర్రబెల్లి రూటే వేరు!

-ఇంటి తలుపు తడుతున్న దయాకర్
-పెద్దమనుషులతో మజాకులు
-టిఫిన్‌బండిలో దోసెలు
-మీదచేతులేసి ఫొటోలకు ఫోజులు
-మునుగోడు ప్రచారంలో మంత్రి దయాకర్ విన్యాసాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రూటే వేరు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచార బరిలో మంత్రులంతా మోహరించారు. మండలాలు, గ్రామాలలో బీఆర్‌ఎస్‌ను గెలిపించే బాధ్యత తీసుకున్నారు. మంత్రి కేటీఆర్, హరీష్, జగదీష్‌రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, శ్రీనివాసగౌడ్, మల్లారెడ్డి.. ఒక్కరేమిటి? మంత్రులంతా ప్రచారబరిలో దిగి, బీఆర్‌ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించేందుకు నానా తంటాలు పడుతున్నారు. సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వారంతా అక్కడే తిష్టవేసి, మండల-గ్రామ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. గ్రామాలలో పట్టున్న ప్రముఖుల ఇళ్లకు వెళ్లి, కారుకు ఓటెయ్యమని అడుగుతున్నారు. కులాల వారీగా విడిపోయి, ఆయా గ్రామాల్లోని కుల ప్రముఖులకు దావతులిచ్చి మరీ, వారిని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.

అయితే వీరందరి ప్రచారం కంటే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విభిన్నంగా కనిపిస్తోంది. సహజంగా ఎప్పుడూ అందరితో సరదాగా ఉంటూ జోకులేసి నవ్వించే దయాకర్, మునుగోడులో తనకు అప్పగించిన చండూరులోనూ అదే విధంగా వ్యవహరిస్తూ అందరి దృష్టీ ఆకర్షిస్తున్నారు. చండూరు 2,3 వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తున్న ఎర్రబెల్లి, ప్రతి ఇంటినీ తడుతున్నారు. తట్టడమే కాదు.. తోసుకుని లోపలికి వెళ్లి, ఆ ఫ్యామిలీ మెంబర్లతో ‘మన్‌కీబాత్’ మొదలుపెడుతున్నారు. మీద చెయ్యేసి మరీ ఫొటోలు దిగుతున్నారు. ఇంటికెళ్లి అన్న లేడా? చెల్లి లేదా? ఏం పెద్దమనిషీ ఎట్టున్నవ్ అని అందరి యోగక్షేమాలు అడుగుతున్నారు.

‘పించన్లొత్తున్నయా? ఎవలిత్తుల్లు? కేసీఆర్ సారే ఇత్తుండా? లేదా? ఈడ ఎంపీకి కాంగ్రెసుకి ఏసిన్రు. ఎమ్మెల్యేకీ కాంగ్రెసుకే ఏసిన్రు. కానీ మీకు పించన్లు, ఇల్లు, రైతుబంధు ఇత్తాంది కేసీఆర్ సారు గద? మల్ల ఇప్పుడు కారుకే ఓటెయ్యండి. ఏమంటున్నవ్’ అని ఓటర్లను బుజ్జగించి మరీ చెబుతున్న దయాకర్ ప్రచారంతో, అక్కడి ఓటర్లు ఫిదా అవుతున్నారు. ఇళ్లలోకి వెళ్లి మరీ స్కీములు వస్తున్నాయా? లేదా అని అడుగుతున్నారు. వృద్ధులను ఆటపట్టిస్తు, చివ రలో కారుకే ఓటేయమని అడుగుతున్నారు. టిఫిన్ బండి వద్దకు వెళ్లి దోసెలేసి, అందరికీ పెడుతున్నారు. ఇస్త్రీబండి వద్దకు వెళ్లి బట్టలు ఇస్త్రీలు చేస్తున్నారు. ఇలా ఎర్రబెల్లి విన్యాసాలు చండూరు ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి.

LEAVE A RESPONSE