– రూ. 70 లక్షలతో జెరియాట్రిక్ వార్డు నిర్మాణం
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, డిసెంబర్ 31: కృష్ణాజిల్లా గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో రూ. 2 కోట్ల వ్యయంతో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డితో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ఏర్పాటు, జెరియాట్రిక్ వార్డు నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి కొడాలి నాని చర్చించారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్ పై సీఎం జగన్మోహనరెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారని చెప్పారు.
రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు తగ్గిందని తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సీఎం జగన్మోహనరెడ్డి ఆదేశించారన్నారు. దీనిలో భాగంగా గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంటు ఏర్పాటు పనులు జరుగుతున్నాయన్నారు. పైప్ కనెక్షన్ పనులు పూర్తయిన వెంటనే ప్లాంట్ ను ప్రారంభించి అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. అలాగే ప్రభుత్వాసుపత్రి ఆవరణలో రూ. 70 లక్షల వ్యయంతో జెరియాట్రిక్ వార్డును నిర్మిస్తున్నామన్నారు. నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయని తెలిపారు. గత జనవరి 30 వ తేదీన నిర్మాణ పనులను ఎస్ఆర్ ఎడిఫైస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రారంభించిందన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వాసుపత్రిలో గుడివాడ పట్టణ, పరిసర ప్రాంతాల్లోని వృద్ధులకు ప్రత్యేకంగా వైద్య సేవలందించే విభాగాలు లేవన్నారు. నిత్యం ఎంతో మంది వృద్ధులు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్నారన్నారు. కొంత మంది కనీసం సమీపంలోని ఆసుపత్రులకు కూడా వెళ్ళలేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నారన్నారు. అటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేకంగా జెరియాట్రిక్ వార్డును నిర్మిస్తున్నామన్నారు. ఈ వార్డులో 10 బెడ్స్ అందుబాటులో ఉంటాయన్నారు.
60 ఏళ్ళకు పైబడిన వృద్ధులు ఎటువంటి అనారోగ్య సమస్య ఎదురైనా వెంటనే జెరియాట్రిక్ వార్డులో ఇనేషెంట్ గా చేరి వైద్యం పొందవచ్చన్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే డిశ్చార్జ్ చేయడం జరుగుతుందన్నారు. వృద్ధాప్యంలో వచ్చే అన్ని సమస్యలనూ ఈ జెరియాట్రిక్ వార్డు ద్వారా అధిగమించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలోని అన్ని దశలనూ దాటాల్సి ఉంటుందని, వృద్ధాప్యాన్ని ఆరోగ్యవంతంగా అధిగమించేందుకు తనవంతు సేవలందిస్తానని చెప్పారు. వృద్ధుల్లో కన్పించే ఆందోళన, శారీరకంగా ఎదురయ్యే ఇబ్బందులు, నిద్ర లేక పోవడం, ఆసక్తులు తగ్గడం, భారమయ్యామనే ఆలోచనలు, ఏకాగ్రత లోపించడం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలకు కూడా జెరియాట్రిక్ వార్డులోని వైద్యులు సలహాలు, సూచనలను అందిస్తారని తెలిపారు. ఈ జెరియాట్రిక్ వార్డును ఈ నెలాఖరులో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి కొడాలి నాని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుడివాడ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు.